ఎన్నికల ఫీవర్ మెల్లమెల్లగా ఊపందుకుంటోంది. దీన్ని సీనియర్ ఎన్టీఆర్ పేరును కూడా తెలుగుదేశం పార్టీ మెల్లమెల్లగా హైలెట్ చేస్తోంది. ప్రతి ఎన్నికల టైమ్ లో ఇది జరిగేదే. అయితే ఈసారి ఇంకాస్త కొత్తగా ట్రై చేస్తున్నారు చంద్రబాబు. నారా లోకేష్ ని నందమూరి లోకేష్ గా ప్రొజెక్ట్ చేయడానికి తపిస్తున్నారు.
వారసుడిలో విషయం లేనప్పుడు ఇంటిపేరులో ఏముంటుంది..? కానీ చంద్రబాబు ఆలోచన మరోలా ఉంది. లోకేష్ చుట్టూ నందమూరి బ్యాచ్ ని తిప్పే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే నందమూరి ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని, తన భార్య పేరుని తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత ఆమె తోబుట్టువులందరితో ప్రెస్ మీట్లు పెట్టించారు. తాజాగా ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుతో మరో కొత్త ప్లాన్ వేస్తున్నారు బాబు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ విగ్రహావిష్కరణలకు నందమూరి కుటుంబ సభ్యుల్ని కాకుండా, లోకేష్ నే పంపించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి లోపు వీలైనన్ని ప్రాంతాల్లో లోకేష్ చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరింపచేయాలనేది బాబు ఆలోచన. దాని ప్రకారమే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఎందుకీ విగ్రహాలు..?
ఏపీలో టీడీపీ పరాజయానికి, పరాభవాలకి ఇంకా కారణాలు వెదుకుతూనే ఉన్నారు అధినాయకులు. ఇటీవల వారికి ఓ మెరుపులాంటి ఆలోచన తట్టింది. అసలు ఆ కారణం వల్లే ఏపీలో టీడీపీ వెనకపడిపోయిందేమోననే అనుమానాలు వారిలో బలపడ్డాయి.
ఇంకేముంది సర్వే చేపట్టారు. ఓ రిపోర్ట్ రెడీ చేశారు. తక్షణ కర్తవ్యం ఏంటనేది బోధపడింది. శిల్పులకు ఆర్డర్లిచ్చారు. తొలి దశలో మొత్తం 100 విగ్రహాలు రెడీ కావాలని చెప్పారు. విగ్రహావిష్కరణలకు రెడీ అవుతున్నారు. అదీ సంగతి.
గతంలో ఏపీ, తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాలకు కొదవే ఉండేది కాదు. ఆ తర్వాత వైఎస్ఆర్ విగ్రహాలు వాటిని డామినేట్ చేశాయి. తాజాగా టీడీపీకి విగ్రహాలపై దృష్టిమళ్లింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలనుకుంటున్నారు. టీడీపీ తెలంగాణ శాఖ నుంచి ఈ ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నా.. దీని వెనక ఎవరున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
మే 28న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి. అందులోనూ ఈ ఏడాది ఆయనది శత జయంతి. అందుకే ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఊరూవాడా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. పనిలోపనిగా ఈ కార్యక్రమాన్ని తన తనయుడు లోకేష్ కు జాకీగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే నారా లోకేష్ ను, నందమూరి లోకేష్ గా మార్చబోతున్నారు.