తాను జీవితంలో ఎందరికో సాయం చేసానని, ఉపయోగపడ్డానని, కానీ తనకు ఎవ్వరూ సాయం చేయలేదని నటుడు మోహన్ బాబు అన్నారు.
తిరుపతిలో జరిగిన ఆయన పుట్టిన రోజు సభలో మాట్లాడుతూ, తన చేత ఎందరో రాజకీయ నాయుకులు ప్రచారం చేయించుకున్నారని, కానీ తనకు ఎన్నడూ ఉపయోగపడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
కేవలం ఎన్టీఆర్ ఒక్కరే తనను రాజ్యసభకు పంపిచారన్నారు. ఎంతో మంది పొలిటికల్ లీడర్లు పిలచి కాంపైయన్ చేయించుకున్నారని, కానీ తనకు సాయం చేయలేదని, ఎన్నో సార్లు మోసపోయానని, జీవితం అనేక గుణపాఠాలు నేర్పిందని ఆయన అన్నారు.
కొద్ది రోజుల క్రితమే మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటానని ప్రకటించారు. నిజానికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. రాజ్యసభ సభ్యుడిగా వున్నారు. తెలుగుదేశం, ఎన్టీఆర్ తెలుగుదేశం, వైకాపా లకు ప్రచారం చేసారు. చంద్రబాబు తనను మోసం చేసారని చాలా సార్లు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రచారం చేసారు. ధర్నా చేసారు.
ప్రస్తుతం ఆయన వైకాపా తో వున్నారు. ఇక్కడ కూడా ఆయనేమంత సంతృప్తిగా వున్నట్లు కనిపించడం లేదు. సిఎమ్ వైఎస్ జగన్ తో బంధుత్వం వున్నా ఆ మేరకు మంచు కుటుంబానికి పెద్దగా ప్రయారిటీ కనిపించడం లేదు. సినిమా రంగంలో మెగా క్యాంప్ తో కనిపించని వైరుధ్యం వుంది. కానీ జగన్ దగ్గర చిరంజీవి కే ఎక్కువ యాక్సెస్ కనిపిస్తోంది.
ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జగన్ కు దూరం కాలేరు…చంద్రబాబుకు దగ్గర కాలేరు..ఇవన్నీ కలిసి మోహన్ బాబును ఓ నిర్వేదానికి, ఆవేదనకు గురి చేస్తున్నట్లు కనిపిస్తోంది.