ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తారా? తెలుగుదేశం వర్థిల్లితే లోకేష్ సిఎమ్ అవుతారేమో కానీ ఎన్టీఆర్ కాదు కదా? మరి ఎన్టీఆర్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుందామనుకునే తహ తహ ఎందుకు తెలుగుదేశం పార్టీకి? పచ్చ జెండాల మీద ఎన్టీఆర్ బొమ్మ పెట్టి నానా హడావుడి.
అసలు చరణ్ – ఎన్టీఆర్ ల సినిమాకు జనసేనకు సంబంధం ఏమిటి? ఈ సందట్లో జనసేన సడేమియా అనడం ఏమిటి? పైగా జగన్ దగ్గరకు చిరంజీవి వెళ్లినప్పటి నుంచి, భీమ్లా నాయక్ కు రాకుండా ఆర్ఆర్ఆర్ వేళ్లకు జీవో వచ్చి, రేట్లు అదనంగా ఇచ్చిన దగ్గర నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెగాస్టార్ మీద విరుచుకుపడుతున్నారు.
మరి అలాంటి నేపథ్యంలో ఈ జససేన జెండా ఎగరేయడం ఏమిటి? అది వుండకూడదని కొందరు కిందకు దించేయడం ఏమిటి?
అసలు సినిమా ఫంక్షన్ కు, రాజకీయానికి కనెక్షన్ ఏమిటి? ఎన్టీఆర్ ఏమన్నా చంద్రబాబు పేరు పలికారా? చరణ్ ఏమన్నా బాబాయ్ పేరు చెప్పారా? సందర్భం కాదు కదా? ఎన్టీఆర్ ఎలాగూ ఆయనంతట ఆయన తెలుగుదేశం వైపు, రాజకీయాల వైపు ఇప్పట్లో రారు. ఈ విషయంలో ఆయనే చాలా సార్లు క్లారిటీ ఇచ్చేసారు. జై ఎన్టీఆర్ అనమంటే అంటారు కానీ, జై తెలుగుదేశం అని కాదు కదా?
మరెందుకు తెలుగుదేశం తాపత్రయం..జనసేన హడావుడి? పైగా గమ్మత్తేమిటంటే పార్టీలన్నీ కలిసిపోయి జగన్ మీద పోరాడాలి. లేదంటే ఆయను ఓడించడం కష్టం అంటారు పవన్ బాబు. కానీ జనసేన జెండా అంటే మండిపడుతున్నారు నందమూరి అభిమానులు. ఇంతవరకు వచ్చాక తెలుగుదేశంతో కలవడం ఏమిటి అని బాధపడుతున్నారు జనసేన అభిమానులు.
ఇలాంటి నేపథ్యంలో ఊళ్లో సినిమా ఫంక్షన్ అయితే ఈ రాజకీయాభిమానుల హడావుడి ఏమిటో?