దొరల నుంచి పదవి దొర్లిపోతుందా?

తెలంగాణా ఉద్యమాన్ని ప్రారంభించి ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీయార్.  Advertisement ఎంతో మంది తెలంగాణా ప్రజలకు ఆయనొక ఆశాకిరణమయ్యారప్పుడు. మునుపటికంటే తమ బతుకులు ఎన్నో రెట్లు బాగుపడతాయని ఆశపడ్డారు…

తెలంగాణా ఉద్యమాన్ని ప్రారంభించి ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీయార్. 

ఎంతో మంది తెలంగాణా ప్రజలకు ఆయనొక ఆశాకిరణమయ్యారప్పుడు. మునుపటికంటే తమ బతుకులు ఎన్నో రెట్లు బాగుపడతాయని ఆశపడ్డారు ప్రజలు. 

సీమాంధ్రా నేతల కబందహస్తాల్లోంచి తమ ప్రాంతం సొంత ప్రాంతీయ నాయకత్వంలోకి వెళ్లినందుకు పండుగ చేసుకున్నారు. ఆ సంఘటన జరిగి పదేళ్లయ్యింది. 

సాధారణంగా పదేళ్లకి ప్రభుత్వవ్యతిరేకత సహజం. 

అయితే అది కేసీయార్ లాంటి తెలంగాణా జాతిపితకి కూడా వర్తిస్తుందా? ఒకవేళ వర్తిస్తే కారణాలేవిటి? 

ఎన్నికలు నెల రోజులకు దగ్గర పడుతున్న వేళ అసలు జనం నాడి ఏవిటి? ఎవరెలా అనుకుంటున్నారు తెలంగాణా రాష్ట్ర సమితి పరిపాలనని? 

ఒక్కసారి పరిశీలిద్దాం!

పాలన అంటే మంచీ, చెడూ రెండూ ఉంటాయి. ముందు మంచి చెప్పుకుందాం. 

1. పశ్చిమ హైదరాబాదు రూపురేఖలు మారిపోయి అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలని తలపిస్తోంది. 

2. ప్రజలు మతకలహాలు, టెర్రరిజం భయాలు లేకుండా శాంతిభద్రతలతో ఉన్నారు. 

3. మీడియాలో పాలన పట్ల ప్రతికూల వార్తలు కనపడక అంతా సస్యశ్యామలంగా ఉందన్న భావన అర్బన్ ఒటర్ కి కలుగుతూ వస్తోంది. 

4. కేటీయార్ తన వాగ్ధాటితో, భాషా పరిజ్ఞానంతో ఆకట్టుకుంటూ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక సమాధానంగా కనిపించడం ఒక సానుకూల విషయం. 

5. మెట్రో రైల్ అర్బన్ జనాలకి కొత్త సుఖాన్నిచ్చింది. 

6. అభివృద్ధి కనిపిస్తూ ఉంది. 

ఇక చెడు చెప్పుకోవాలంటే ఇలా ఉంది: 

1. చాలామంది ఎమ్మెల్యేలు భూకబ్జాలతో అడ్డంగా సంపాదించారన్న అభిప్రాయం ప్రజల్లో విపరీతంగా ఉంది. 

2. కేసీయార్ సామాన్య జనానికి అందుబాటులో లేకపోవడం, “దొర”లాగ ఎక్కడో కూర్చోవడం, మీడియాలో మాత్రమే వారి దర్శనం కావడం ప్రజలకి నచ్చడం లేదు. 

3. సంక్షేమ పథకాలు అందరికీ అందడంలేదన్నది రూరల్ తెలంగాణాలో వినిపిస్తున్న అంశం. 

4. నేటికి అర్హతగల లబ్ధిదారుల్లో పలువురికి రెండు బెడ్రూం ఇళ్లు పంచగలిగినా అధికశాతం మందికి పంచకపోవడం ఈ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. దీనివల్ల ఇల్లు పొందని అనేకమంది కేసీయార్ అభిమానులు కూడా ఈ సారి ఆయన పార్టీకి ఓటు వేసేందుకు సుముఖంగా లేకపోవడం ఆ పార్టీ ఆందోళన పాడాల్సిన విషయం. పైగా ఇళ్ల కేటాయింపులు రాజకీయ నాయకులు వాళ్లకి కావాల్సిన వాళ్లకే చేసుకున్నారని పలువురు పేదలు వాపోతున్నారు. 

ఇదే పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశులో ముప్పై లక్షల పై చిలుకు ఇళ్లు పంచడం జరిగింది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశులో ఇల్లు పొందడానికి ఏ రాజకీయ నాయకుడి ప్రమేయం లేదు. విలేజ్ వాలంటీర్ కి ఇల్లు లేదన్న విషయం ఆధారాలతో సహా ఇస్తే, ఇల్లు కేటాయింపడిందంతే. అక్కడ కులాల ప్రస్తావన కూడా లేదు. 

5. రైతుబంధు తప్పితే మరే ఇతర సంక్షేమ పథకం అందరికీ అందడం లేదన్న ఫిర్యాదు కూడా చెబుతున్నారు. బహుశా ఆంధ్రాలో మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం దీనికి కారణయ్యి ఉండొచ్చు. 

మొత్తమ్మీద పలు కారణాల వల్ల ఓటర్లు గులాబీ జెండా కి ఓటు వేయడానికి మనస్ఫూర్తిగా అయితే లేరు. అలాగని కాంగ్రెసుకి వేస్తామంటున్నారా అంటే కానే కాదు. 

ఈ సారి అసలు ఓటే వేయమని కొందరంటుంటే, అన్ని పార్టీలు ఈ ప్రాంతాన్ని ఏలాయి కానీ ఇప్పటివరకు బీజేపీ ఏలలేదు..దానికొక ఛాన్సిస్తే బాగుంటుందనుకుంటున్నామని కొందరంటున్నారు. 

కొందరైతే ఈ సారైనా తమ ఆశలు నెరవేరుస్తుందేమోనని మరొక్క ఛాన్స్ గులాబీ జెండాకే ఇద్దామనుకుంటున్నట్టు తెలిపారు. 

వ్యవహారం ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఆన్నేసి పాజిటివ్ సర్వేలు ఎలా వచ్చాయో అర్ధంకావడం లేదు. బహుశా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెసుకే పడతాయని సర్వేయర్లు అనుకున్నారేమో. వ్యతిరేకత ఉన్నంత మాత్రాన అసలు ఓటే వేయరన్నది నిజం కాదని పై స్పందనల్ని బట్టి తెలుస్తోంది. 

ఇంతకీ ఏం జరుగుతుందో చూడాలి. మరొక్క సారి గెలిస్తే మాత్రం తమ పరిపాలనా విధానంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం గులాబీ పార్టీకుంది. ఒకవేళ ఓడిపోతే చేసేదేం లేదు. పై తప్పుల్ని మరొక్క సారి చదువుకుని అవే కొంప ముంచాయని అనుకుంటూ నిట్టూర్చాలంతే. 

ఏం జరుగుతుందో కాలం తీర్పు కోసం చూద్దాం. 

శ్రీనివాసమూర్తి