తెలుగు న్యూస్ ఛానెళ్ల మధ్య నెంబర్ గేమ్ నడుస్తోంది. అన్నీ కాదనుకోండి. టాప్ రేంజిలో ఉండే ఛానెళ్లు రెండు నేనంటే నేను నెంబర్ వన్ అని టముకు వేసి చెప్పుకోడానికి తపన పడుతున్నాయి. ఛానెళ్లు మరీ రోడ్డున పడి ఈ ప్రచారం చేసుకుంటూ ఉండడం చూసేవారికి చిత్రంగా కనిపిస్తోంది.
తెలుగు న్యూస్ ఛానెళ్లలో టీవీ 9 అనేది నిజంగా ఒక సంచలనం. తొలిదశలో వచ్చిన న్యూస్ చానెళ్లలో అనేక రికార్డులు సృష్టించింది. ప్రతి విషయాన్నీ సంచలనంగా మార్చడంలో ఒక కొత్త దారిని టీవీ ఛానెళ్లకు చూపించింది. నిజం చెప్పాలంటే.. ఆ తర్వాత వచ్చిన న్యూస్ చానెళ్లన్నీ వారి బాటలనే ప్రయాణించడానికే ప్రయత్నించాయి. ఆ రకంగా సంచలనాల తెలుగు టీవీ జర్నలిజంలో తొలి అడుగు వేసిన చానెల్ గా మాత్రమే కాదు.. తొలిస్థానంలో నెంబర్ వన్ గా స్థిరపడిన చానెల్ గా కూడా వారు చాలాకాలం రాజ్యమేలారు.
అయితే.. న్యూస్ చానెళ్లను నిజంగా ఎవరు చూస్తున్నారు? ఎక్కడ చూస్తున్నారు? అనేవి అత్యంత స్పష్టంగా చెప్పగల ఆధారాలేమీ లేవు. కేవలం టీఆర్పీ రేటింగులను బట్టి మాత్రమే ఈ ర్యాంకులను అనుకుంటూ ఉంటారు. అయితే టీఆర్పీ రేటింగుల్లో బోలెడు రకాల మేనిప్యులేషన్ లు ఉంటాయని కూడా అందరూ చెబుతుంటారు.
సో, ఎవరు మేనిప్యులేట్ చేస్తున్నారో.. ఎవరు చేయడంలేదో.. ఎవరి టీఆర్పీ రేటింగులు నిజమైనవో తేల్చి చెప్పడం కష్టం. అదేసమయంలో యూట్యూబ్ లైవ్ యాప్ ల ద్వారా టీవీ చానెళ్లను వీక్షించే ప్రేక్షకుల సంఖ్య పెరిగిన తర్వాత.. చాలా కచ్చితమైన లెక్కలు వచ్చేస్తుంటాయి. యూట్యూబ్ లో లెక్కలను మేనిప్యులేట్ చేయడం చాలా కష్టం, ఒక రకంగా అసాధ్యం. అయితే చానెల్ ర్యాంకింగ్ ఎంతో డిసైడ్ చేయడానికి కేవలం యూట్యూబ్ లైవ్ యాప్ వీక్షకుల సంఖ్య ఒక్కటే ప్రామాణికం అనుకోకూడదు.
ఇటీవలి కాలంలో ఎన్ టీవీ తమదే నెంబర్ వన్ చానెల్ అని తమ చానెల్లోనే ప్రకటించుకోవడం ప్రారంభించింది. ప్రతి ప్రోగ్రాంకు ముందు వెనుక ‘నెంబర్ వన్ ఛానెల్’ అని తమ గురించి తాము చెప్పుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు ఇలా గడిచిన తర్వాత.. ఎన్ టీవీ ప్రచారానికి కౌంటర్ ప్రచారాన్ని టీవీ9 ప్రారంభించింది. అయితే వీరు రోడ్డున పడి ఫ్లెక్సి పోస్టర్ల ద్వారా ప్రచారానికి దిగడం విశేషం.
‘‘మోసం, దగా, కుట్ర ఇవేవీ నెంబర్ 1 కాజాలవు’’ అని అర్థం వచ్చేలాగా.. టీవీ 9 ఫ్లెక్సి పోస్టర్లను హైదరాబాదు నగరం నిండా ఏర్పాటుచేసింది. చాలా స్పష్టంగా ఇవి ఎన్ టీవీ చేసుకుంటున్న నెంబర్ 1 ప్రచారానికి కౌంటర్ అని అర్థమవుతుంది.
అయినా నెంబర్ 1 గేమ్ అనేది వారి చానెళ్ల వ్యాపారం కోసం యాడ్ టారిఫ్ పెంచుకోవడానికి ఉపయోగపడేదే తప్ప.. ప్రజల కోణంలోంచి చూస్తే.. రాజకీయ పార్టీలకు కొమ్ము కాయకుండా నిజాయితీగా నిజాలను, వేగంగా అందించే ఛానెల్ మాత్రమే నెంబర్ 1 అని మనం నమ్మాలి. వారి టీఆర్పీలు, యూట్యూబ్ వీక్షకులు ఎలా ఉన్నాసరే.. నిజాయితీలో నెంబర్ 1 ఎవరన్నది మాత్రమే ప్రజలు పరిశీలించాలి.
ఈ అగ్ర ఛానెళ్లు రెండూ ఇలా ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రజలకు చిత్రంగా అనిపిస్తోంది. రాజకీయ పార్టీల ధోరణిలోనే చానెళ్లు కూడా నడుస్తున్నాయని అనుకుంటున్నారు.