ఇది చదివే ముందు ఎమ్బీయస్: జస్టిస్ లక్ష్మణ్ వెలిబుచ్చిన సందేహాలు వ్యాసం చదవ ప్రార్థన. ఒక సామాన్యుడిగా మీకూ, నాకూ ఆసక్తి రగిలించి పెట్టింది మీడియా. నిజానికి కేసు గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. హత్య జరగగానే పరాయి స్త్రీ వ్యవహారం ఉందనే మాట బయటకు వచ్చేసింది. ఆంధ్రజ్యోతే రాసింది. అలాటి వ్యవహారం కాబట్టి, చనిపోయిన వ్యక్తి స్టేచర్‌ను దృష్టిలో పెట్టుకుని కారణాలు బయటకు రానివ్వరు, ఏ డ్రైవరు మీదో, పనివాడి మీదో నెట్టేసి కేసు క్లోజ్ చేస్తారు అనుకుని ఉదాసీనంగానే ఉన్నాను. కేసు నానుస్తున్నారంటూ మధ్యలో ‘వివేకా హంతకుడు వెక్కిరిస్తున్నాడు’ అనే ఆర్టికల్ రాసానంతే! కానీ యీ మధ్య విపరీతంగా చర్చలోకి రావడంతో మూడు వ్యాసాలు వరసగా రాశాను. దానిపై కొందరు పాఠకులు నాకు కొంత సమాచారం పంపారు, శవానికి కట్లు కట్టినప్పుడు అక్కడ ఉన్నది డా. గంగిరెడ్డి అని రాస్తే అబ్బే కాదు, ఎర్ర గంగిరెడ్డి అని సవరించారు.
దీని కారణంగా కేసు నడిచిన విధానం గురించి నాకు ఒక రూపు తట్టింది. అది కరక్టని నేను చెప్పలేను. ఆధారాలు లేవు. అలా ఎందుక్కాకూడదు అని ప్రశ్న మాత్రమే వేయగలనంతే. సంశయరహితంగా కేసు బిల్డప్ చేయవలసిన సిబిఐ, న్యాయమూర్తికే సమాధానాలు చెప్పనప్పుడు మీకూ నాకూ ఏం చెప్తుంది? ఇకపై చెప్తే అప్పుడీ వెర్షన్‌కు సవరణలు చేసుకోవచ్చు. ఈ వెర్షన్ కెఎస్ ప్రసాద్ అనే యూట్యూబు టీవీ విశ్లేషకుడు అందించిన ఊహ ఆధారంగా ఏర్పరచుకున్నది. ఆయన చాలా గందరగోళంగా, అర్థం కాకుండా, రకరకాల పదాలతో, గడగడా వడగళ్ల వాన పడినట్లు మాట్లాడతాడు. వాన వెలిశాక వడగళ్లు ఏరుకోబోతే అవి కరిగిపోయినట్లు, వీడియో అయిపోయాక ఆయన ఏం చెప్పాడో గుర్తుకు రాదు, వచ్చినా ఓ పట్టాన అర్థం కాదు. నిదానంగా, విశదీకరిస్తూ చెప్పే ఓపిక లేనట్లు, అసహనంతో, వెక్కిరింతలతో మాట్లాడతాడు. జగన్ ఏం చేసినా చాలా అద్భుతమైన ప్రణాళికతో చేస్తాడని, అతనితో తలపడి బాబు, పవన్ చిత్తయిపోతారని ప్రగాఢంగా నమ్మినట్లు మాట్లాడతాడు. ఈ కేసు విషయంలో ఆయన చెప్పినదాన్ని నేను అర్థం చేసుకున్న రీతిలో చెప్తూ నా వివరణలు చేరుస్తున్నాను.
ఆయన చెప్పిన థియరీ ఏమిటంటే, బీరువాలోని డాక్యుమెంట్ల కోసమే వివేకాను చంపమని గంగిరెడ్డి అండ్ బ్యాచ్‌ను నియోగించారు. డాక్యుమెంట్లు తీసుకుని తలగడతో ఒత్తి వివేకాకు ఊపిరాడనట్లుగా చేసి, చంపేసి వచ్చేయండి అని చెప్పారు. అలా అయితే గుండెపోటుతో మరణించాడని చెప్పవచ్చు, ఎవరి మీదా అనుమానం రాదు. పని అయిపోతుంది అనుకున్నారు. దాని ప్రకారమే చావు వార్త తెలియగానే గుండెపోటుతో పోయాడు అని పబ్లిక్‌కు చెప్పనారంభించారు. అయితే మధ్యలో జరిగిన ట్విస్టు ఏమిటంటే యీ కిరాయి హంతకులు తమకున్న సొంత కక్షలతో ప్రోగ్రాం మార్చేసి, కిరాతకంగా హత్య చేశారు. దాంతో యీ గందరగోళం ఏర్పడింది. ఇదీ ఆయన థియరీ.
ఈ థియరీ ప్రకారమైతేనే కిరాయి హంతకుల ముఠా నాయకుడైన గంగిరెడ్డి తన టీము చేసిన తప్పుని సరి చేయడానికై, యిది మొదట అనుకున్నట్లు గుండెపోటు చావే అని నిరూపించడానికి సాక్ష్యాలు చెరపబోయాడని అర్థమవుతుంది. అంతేకాదు, గుండెపోటు అని మొదట్లో ప్రచారం కావడాన్నీ అర్థం చేసుకోవచ్చు. గుండెపోటు కథను హత్యకై ప్లాన్ చేసినవారు తమ ప్రయోజనం గురించి ప్రచారంలో పెట్టినా, కుటుంబం పరువు రచ్చకెక్కకూడదని గుండెపోటు కహానీనే బంధువులంతా వల్లించారని అనుకోవాలి. హత్య గుర్తులు బలంగా ఉండడంతో ఆ కహానీ చెల్లలేదన్నది వేరే సంగతి. ఏ డాక్టరూ నిర్ధారించకుండా గుండెపోటని ఎలా చెప్పారు? గుండెపోటు వస్తే రక్తం కక్కుకుంటారా? అనే సందేహాలు వస్తాయిగా. అందువలన గుండెపోటు కథను ప్రచారంలోకి తెచ్చినవారే సూత్రధారులనే సందేహం రావడం సహజం.
ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన ‘‘డయల్ ఎమ్ ఫర్ మర్డర్’’ (1954) అనే సినిమా ఉంది. దానిలో భార్యను చంపుదామనుకున్న భర్త ఒక కిరాయి హంతకుణ్ని నియోగిస్తాడు. ‘మా ఆవిడ దగ్గరుండే మా యింటి తాళంచెవిని డోర్‌మ్యాట్ కింద పెట్టి ఉంచుతాను. దాని సాయంతో ఫలానా రాత్రి యింట్లోకి వచ్చేసేయి. నేను ఆ సమయానికి ఓ పార్టీలో ఉంటాను. ఇంటికి ఫోన్ చేస్తాను. ఫోన్ ఆన్సర్ చేయడానికి నా భార్య నిద్రలేచి వస్తుంది. అప్పుడామెను స్కార్ఫ్‌తో చంపేయ్. ఎవడో దొంగ దొంగతనానికి వచ్చి, పట్టుబడి కంగారులో యింటావిణ్ని చంపేసి పారిపోయారనుకుంటారు.’ అని చెప్తాడు. తీరా ఏమౌతుందంటే దొంగ స్కార్ఫ్‌ని మెడకు బిగిస్తూంటే భార్య చేతిలో కత్తెరతో అతన్ని పొడిచి చంపేస్తుంది. దాంతో భర్త కథ మార్చేయాల్సి వస్తుంది. చచ్చినవాడు భార్యను బ్లాక్‌మెయిల్ చేసేవాడని, వాడితో విసిగి, ఆమె వాణ్ని రప్పించి చంపేసిందని పోలీసులు నమ్మేట్లా కథ అల్లుతాడు.
ఇక్కడా అదే జరిగినట్లుంది. డాక్యుమెంట్లు తీసుకున్నాక, దిండుతో చంపండ్రా నాయనలారా, చాలు అంటే వీళ్లు గొడ్డలి పట్టుకెళ్లారు, లేఖ రాయించారు. ఇలా చేసి కేసుని కంగాళీ చేశారు. అందరి దృష్టీ దానిపై పడేట్లు చేశారు. రక్తమూ, గాయాలు లేకపోతే బెంగుళూరు సెటిల్‌మెంటు గొడవ, షమీమ్ గొడవ ఏవీ పేపర్లలో వచ్చేవి కావు. ఏ కేసులోనైనా విచారణ ప్రారంభమయ్యాక ఎవరికి మోటివ్ ఉంది, ఎవరు హత్యాస్థలంలో ఉన్నారు అనేది చూస్తారు. ఇక్కడ హత్య చేసినవాళ్లు తెలిసిపోయారు. చేయించినవాళ్లు ఎవరనేదే ప్రశ్న. వాళ్లు ఆ స్థలంలో ఉండనక్కరలేదు. పురమాయించి పనులు చేయించుకుని ఉండవచ్చు. ఇక మోటివ్ అనేదే ప్రధానంగా చూడాలి. ఆ విధంగా చూస్తే అవినాశ్‌కి మోటివ్ ఉన్నట్లే తోచదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను ఓడించారన్న కోపంతో వివేకా అవినాశ్‌ను తిట్టారని ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని అవినాశ్ దీనికి పాల్పడ్డారన్న వాదన జస్టిస్ లక్ష్మణ్ తోసిపుచ్చారు. రెండేళ్లు పోయిన తర్వాత, ఎన్నిక ముంగిట్లో ఉండగా పాతపగలు తీర్చుకోవడానికి యీ సమయాన్ని ఎంచుకుంటారా? అని మనకే వచ్చే అనుమానం.
ఆర్థికపరమైన కోణాన్ని లెక్కలోకి తీసుకుంటే గంగిరెడ్డి ముఠాకు మోటివ్ ఉంది. బెంగుళూరు డీల్ విషయంలో వివేకా తమకు వాటా యివ్వనన్నాడన్న కోపం ఉండివుండవచ్చు. వివేకా బెంగుళూరు డీల్ ఒక్కటే చేశారని అనుకోవడానికి లేదు. నేను విన్నదాని ప్రకారం ఆయనకు యీ అలవాటు ముందు నుంచీ వుంది. అలవాటు లేకుండా హఠాత్తుగా ఫీల్డ్‌లోకి దిగితే ఎవరూ లక్ష్యపెట్టరు. గతంలో కూడా యీ ముఠాను వెంటేసుకుని వివేకా డీల్స్ చేసి ఉండవచ్చు. అప్పుడు వాటాలు సవ్యంగానే యిచ్చి ఉండవచ్చు కానీ యీసారి డబ్బుకి కటకట లాడుతున్నాడంటున్నారు కాబట్టి సవ్యమైన పంపకాలు చేసి ఉండకపోవచ్చు. గంగిరెడ్డి ముఠా ఆ కోపాన్ని యిప్పుడే ఎందుకు తీర్చుకోవాలి? సెటిల్‌మెంట్ల డబ్బు చేజిక్కించు కోవడానికైనా అయివుండాలి. లేదా డీల్ తాలూకు డాక్యుమెంట్లు సంపాదించడానికైనా అయివుండాలి. బెంగుళూరు డీల్ బోగస్ అని తేలిన తర్వాత ఆ డాక్యుమెంట్లు ఏం చేసుకుంటారు?
బీరువాలోంచి దొంగిలించిన డాక్యుమెంట్లు దేనికి సంబంధించినవో తెలిస్తే కానీ యీ చిక్కుముడి వీడదు. సిబిఐ ఆ డాక్యుమెంట్లు రికవర్ చేయడంలో ఆసక్తి చూపటం లేదని జస్టిస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గంగిరెడ్డి యీ విషయంలో సిబిఐకు ఏం చెప్పారో పేపర్లలో వచ్చినట్లు లేదు. ఒకవేళ ఆ డాక్యుమెంట్లు షమీమ్ పేర రాసిన యింటి డాక్యుమెంట్లే అయితే ముల్లు సునీత, ఆమె భర్త వైపు తిరుగుతుంది. కెఎస్ ప్రసాద్ గారు హడావుడిగా చెప్పినదాని బట్టి నాకు అర్థమైనదేమిటంటే వివేకా యిల్లేదో షమీమ్ పేర రాసి రిజిస్టర్ చేయబోతే కుటుంబసభ్యులు పడనీయ లేదు, దాంతో ఆయన నోటరీ వద్ద నోటిఫై చేయించారు. వాటిని చేజిక్కించుకోమని గంగిరెడ్డి ముఠాను సునీత, భర్త ఆదేశించారని అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఒక వృద్ధుడు రెండో వివాహం చేసుకుంటే కుటుంబం ఎంత దయారహితంగా ప్రవర్తిస్తుందో ‘షమీమ్ కోణం మాటేమిటి?’ వ్యాసంలో వివరంగా చర్చించాను. సునీత కూడా పట్టరాని ఆగ్రహంతో ఉన్నారని షమీమ్ ఫోన్‌లో మెసేజిలు (సిబిఐ వాటిని తన చార్జిషీటులో చేర్చిందో లేదో తెలియదు) తెలుపుతున్నాయి. తండ్రితో కొన్నేళ్లగా మాటలు లేకపోవడం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
డాక్యుమెంట్లు తీసుకోమనడం వరకు సరే కానీ, మళ్లీమళ్లీ యిలాటి డాక్యుమెంట్లు రాయకుండా చంపేయమని అంటారా అనే సందేహం సహజంగా వస్తుంది. కుమార్తె అనకపోవచ్చు కానీ అల్లుడు అనవచ్చేమో. కానీ యిక్కడ అల్లుడు బావమరిది కూడా. తన సోదరి పసుపుకుంకుమలు తుడిచిపెట్టేయడానికి ఆయన సంసిద్ధుడవుతాడా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. కానీ హత్యానంతరం ఆయన ప్రవర్తన మాత్రం అసహజంగా ఉందని చెప్పక తప్పదు. ఒక పాఠకుడు నాకు ఆయన సిబిఐకు యిచ్చిన స్టేటుమెంటు పంపారు. దానిలో సంబంధిత భాగాన్ని యిక్కడ చెప్తాను. అది చెప్పబోయే ముందు మరో విషయం చెప్పాలి.
అవినాశ్ రెడ్డిని అఫీషియల్‌గా ఎంపీ కాండిడేటుగా ప్రకటించకపోయినా, అనఫీషియల్‌గా అతన్ని ఎంపీ కాండిడేట్‌గా ఆమోదించారని రాజశేఖరే సిబిఐకు చెప్పాడు. వివేకా తన అభ్యర్థిత్వానికి అడ్డు వస్తాడని అవినాశ్ అనుకుని ఏదో చేశాడనే వాదన అక్కడే వీగిపోయింది. ఆ విషయం సునీత ఎప్పుడో చెప్పారని, తన తండ్రి అవినాశ్ కోసం ప్రచారం చేశారని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె భర్త కూడా చెప్పినది నాకు తెలియవచ్చింది. ఇక పిఏ కృష్ణారెడ్డి 6 గంటల ప్రాంతంలోనే రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశానని చెప్పాడు. వినగానే ఆయన ఉలిక్కిపడినట్లు కానీ, ఎలా పోయాడని అడిగినట్లు కానీ కృష్ణారెడ్డి చెప్పలేదు. లేఖ, సెల్‌ఫోన్ కనబడ్డాయని చెప్పగానే అది హత్య అని రాజశేఖర్‌కు తెలిసిపోయి ఉంటుంది. వాటిని దాచి పెట్టమని చెప్పినట్లు ఆయనే చెప్పాడు. ఇది సహజమరణం కాదనే సంగతి ఆయనకూ అర్థమైందని మనకు అర్థమౌతుంది.
అలాటప్పుడు కాస్సేపటికి గంగిరెడ్డి వచ్చి హత్య కాదని, గుండెపోటు, రక్తం కక్కుకున్నాడని చెప్తున్నాడు అని కృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినప్పుడు రాజశేఖర్ ఏం చేసి ఉండాలి? అలా ఎలా చెప్తాడు అని ఎగిరి ఉండాలి. అతన్ని లోపలకి రానివ్వవద్దని చెప్పి ఉండాలి. అలా చెప్పాడో లేదో నాకు తెలియదు. నాకు అందిన దానిలో పేజీ 181 నుంచి ఉంది. దానిలో సిఐ శంకరయ్య వచ్చిన తర్వాత జరిగిన విషయాల గురించే ఉంది. శంకరయ్య వచ్చినది 7.30కు. మధ్యలో గంటకు పైగా వ్యవధి ఉంది. ఈ లోపున హత్యాస్థలాన్ని కాపాడడానికి రాజశేఖర్ తీసుకున్న చర్యలేమిటి? గంగిరెడ్డి కేసు పెట్టనక్కరలేదని అంటున్నాడని కృష్ణారెడ్డి చెప్పినప్పుడు, రాజశేఖర్ శంకరయ్యతో ఫోన్లో మాట్లాడుతూ కేసు పెట్టాలని, పోస్టుమార్టమ్ చేయాలని చెప్పారు. అంతవరకూ బాగుంది. ఈ లోపుగా రక్తం కడగడం అవీ జరిగిపోతున్నాయని శంకరయ్య చెప్పినప్పుడు అవన్నీ ఆపించండి, అదనపు పోలీసు ఫోర్సు అవసరమైతే మీపై అధికారులతో మాట్లాడతాను అని యీయన అనాలి కదా!
గంగిరెడ్డితో యీయన ఎప్పుడు మాట్లాడాడు? ఆయన స్టేటుమెంటు ప్రకారం శంకరయ్యతో మాట్లాడాక సౌభాగ్యమ్మగారి సూచన మేరకు గంగిరెడ్డికి యీయన ఫోన్ చేశాడు. కానీ అతను తీయలేదు. ఆ తర్వాత మళ్లీమళ్లీ ప్రయత్నించానని యీయన చెప్పలేదు. 11.30 సమయంలో గంగిరెడ్డి ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగి, వెంటనే కాల్ కట్ చేశాడు అని చెప్పాడు తప్ప తను మళ్లీ ఫోన్ చేశాననో, మెసేజ్ చేశాననో చెప్పలేదు. కడప జైల్లో కనబడినప్పుడు అతని ప్రవర్తనపై నిలదీశానని చెప్పాడు కానీ యీ లోపునే అతన్ని నివారించడానికి ప్రయత్నాలు చేసినట్లు కనబడదు. ఎందుకంటే శంకరయ్యతో మాట్లాడిన కాస్సేపటికే ఇనాయత్ అనే కంప్యూటర్ ఆపరేటరు శవం ఫోటోలు యీయన వాట్సాప్‌కు పంపాడు. కారులో ఎండ ఉండటం చేత వాటిని సరిగ్గా చూడలేదు అంటాడీయన. పక్కకు తీసుకెళ్లి కారాపి చూడలేడా? మావగారే కాదు బావగారు కూడా అయిన వ్యక్తి మరణిస్తే ఎలా పోయాడన్న ఆతృత ఉండదా? ఆయన డాక్టరు భార్య కుండదా?
గంగిరెడ్డి ఫోన్ తీయలేదు సరే, యీయన ఇనాయత్‌కు ఫోన్ చేయవచ్చుగా! చేసి ఉంటే ఆతను గంగిరెడ్డి తన చేత కూడా క్లీన్ చేయిస్తున్నాడని చెప్పేవాడుగా! గంగిరెడ్డి ఫోన్ తీయకపోతే వివేకా యితర అనుచరులు లేరా? వాళ్లకి ఫోన్ చేసి ‘ఏవిటీ గంగిరెడ్డి వేషాలేస్తున్నాట్ట, ఆపమని చెప్పండి’ అని చెప్పనక్కరలేదా? ‘రాజశేఖర రెడ్డి లేఖ దాచడమంటే దాచడమేనా? పోలీసులకు యివ్వవద్దా?’ అని అడిగితే కృష్ణారెడ్డి ఒక మాట చెప్పాడు ‘వివేకా సార్ పోయాక, యింటిపెద్ద ఆయనే కదా. ఆయన మాట వినకపోతే ఎలా?’ అని. సునీత, సౌభాగ్యమ్మ యిద్దరూ తండ్రిని, భర్తను పోగొట్టుకుని విలపిస్తున్నవారు. ఈయనే యింటి పెద్ద. గంగిరెడ్డి మావగారి అనుయాయుడంతే. అతనొచ్చి పెత్తనం చలాయిస్తూంటే యీయన ఎందుకు ఊరుకున్నాడు? సాక్ష్యాలు రూపుమాపడానికి రాజశేఖర రెడ్డి సహకరించాడు అని డిఫెన్సు వాళ్లు యీ వాదనలు ముందు పెడితే ఆయనేం సంజాయిషీ చెప్తాడు?
వివేకా యింట్లో అవినాశ్‌కు ఏ పరపతీ లేదు. అతను చెప్తే జీహుజూర్ అని చేసేవాళ్లు లేరు. అతను వచ్చాడు, చూశాడు, వెళ్లాడు తప్ప యిలా చేయమని, అలా చేయమని ఎవరికీ ఆదేశాలు యివ్వలేదు. సాక్ష్యాల తుడిపివేతను అడ్డుకోలేదు అన్నదొక్కటే అతని దోషం. కానీ రాజశేఖర్‌కు ఆ యింటిపై పట్టు ఉంది. వివేకా ఉన్నపుడే సౌభాగ్యమ్మ గారు డబ్బు వ్యవహారాలన్నీ చూసేదని కృష్ణారెడ్డి చెప్పాడు. హత్యానంతరం ఆవిడ పట్టించుకునే మూడ్‌లో ఉండదు కాబట్టి, ఆవిడ తమ్ముడిగా, యింటి అల్లుడిగా రాజశేఖర్ మాటను ఎవరూ జవదాటలేరు. ఆ హక్కును ఉపయోగించుకుని ఆయన సాక్ష్యాల చెరిపివేతను ఆపాల్సింది. ఎందుకు ఆపలేదు అనే దగ్గర సందేహం ప్రారంభమైతే అది ఎక్కడిదాకానైనా వెళ్లవచ్చు. అవినాశ్‌కు మోటివ్ లేదు. ఈయనకైతే షమీమ్ ఆస్తి కారణంగా మోటివ్ ఉంది. మామ మరణానంతరం ఆస్తిలో కొంతభాగం భార్యకు వస్తుంది కాబట్టి బెనిఫిషియరీ కూడా! అందువలన యీయన మీదకి ముల్లు తిరిగే ప్రమాదం ఎక్కువుంది.
కెయస్ ప్రసాద్ గారు పులివెందుల వెళ్లి వచ్చి చాలా పరిశోధించి, వీడియోలు పెడుతున్నారు. మూడు రోజుల్లో సంచలనం సృష్టిస్తానంటున్నాడు. పెద్ద బావమరిది శివప్రకాశే కథ నడిపాడని ఆయన ఉద్దేశం. శివప్రకాశ్ తన మీద పగబట్టాడని, వివేకాను వదలకపోతే చంపుతానన్నాడని షమీమ్ కూడా ఆరోపించింది. కానీ ఆయన బెనిఫిషియరీ కాదు. షమీమ్ వ్యవహారం సునీతను, భర్తను బాధించినంతగా ఆయనను బాధించదు కాబట్టి మోటివ్ కూడా బలహీనమే. అవినాశ్ ఆరోపిస్తున్నట్లు గుండెపోటు వెర్షన్‌ను ప్రచారం పెట్టినది ఆయనే అనే మాట నిరూపించ బడాలి. ఆయనే ఉదయం 6.20కు నాకు ఫోన్ చేసి చెప్పాడు అంటాడు అవినాశ్. తెల్లవారు ఝామున 4.30కే అవినాశ్ జగన్‌కు ఫోన్ చేసి చెప్పాడని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రవేశపెట్టింది. సిబిఐ దానిని వల్లించింది. ఏ ఫోన్ నుంచి చేశాడో చెప్పలేక పోయిందని, అందుకే తన అఫిడవిట్‌లో ఫోన్ నెంబర్లను ప్రస్తావించలేక పోయిందని సాక్షి ఎత్తి చూపింది.
శివప్రకాశ్ గుండెపోటు అని తనకు కూడా చెప్పాడని ఆదినారాయణ ప్రసంగించిన సివిఆర్ న్యూస్ టీవీ వీడియో చూడండి అంటూ సాక్షి తన 060223 సంచికలో ఆ వీడియో లింకు యిచ్చింది. ఆ లింకు నొక్కితే ‘దిస్ వీడియో ఈజ్ నాట్ ఎవైలబుల్ ఎనీమోర్’ అని వస్తోంది. ఎవరు విత్‌డ్రా చేశారో, ఎందుకు చేశారో తెలియదు. ఒకవేళ శివప్రకాశ్ నుంచే గుండెపోటు మాట మొదటిసారిగా బయటకు వస్తే ఆయనకు అలా ఎవరు చెప్పారు? పిఏ కృష్ణారెడ్డి తను చెప్పలేదన్నాడు. అసలు గుండెపోటు న్యూస్ ఎలా ప్రారంభమైందో తెలియదంటున్నాడు. దీని విషయంలో స్పష్టత వచ్చేవరకు గుండెపోటు కథను ప్రారంభించినది శివప్రకాశరెడ్డే, అవినాశ్ కాదు అని సాక్షి వాదించడానికి యిది పనికివస్తోంది. ఇలా చూస్తే ఆయన తమ్ముడికి సహకరించాడని అనుకుని సునీత భర్త గురించే ఫోకస్ పెట్టాలి. ‘లోతుగా విచారిస్తే మీ ఆయన జైలుకి వెళతాడు’ అని జగన్ సునీతతో అన్నట్లుగా వార్తలు వచ్చాయి. జగన్ భావం యిదేనేమో!
కృష్ణారెడ్డి టీవీ యింటర్వ్యూలో చెప్పిన విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ‘సిబిఐ కేసు హేండోవర్ చేసుకున్నాక, రాంసింగ్ విచారణ మొదలు పెట్టాక నాకు కష్టాలు వచ్చాయి. నన్ను పట్టుకుని చావగొట్టి ‘దస్తగిరి, వాచ్‌మన్‌లలా మాకు సహకరిస్తే మంచిది. లేకపోతే అవస్థలు పడతావు. నువ్వు అవినాశ్ చేత మేనేజ్ చేయబడ్డావు’ అనసాగాడు. దిల్లీ రప్పించి నెల్లాళ్లు చావగొట్టాడు. సునీత, భర్త దిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. రాంసింగ్ చెప్పినట్లు చేయి అనసాగారు. నేను వినలేదు. కొన్నాళ్లకు సునీత, భర్త ఒకసారి తమ వద్ద పని చేసే నా కొడుకుకి చెప్పి నన్ను హైదరాబాదుకి రప్పించి బాగా తిట్టారు. సునీత నా ఫోన్ లాక్కుని తన వద్ద పెట్టుకుని, ‘రాంసింగ్ చెప్పినట్లు విను, దస్తగిరి లాగానే నువ్వూ బాగుంటావు, అవినాశ్ మాయలో పడకు’ అంటూ బాగా తిట్టింది. నేను కోపంగా జవాబు చెప్తే రాజశేఖర్ ‘కూల్, కూల్’ అన్నాడు. అప్పుడు సునీత భర్తతో ‘కృష్ణారెడ్డి సహకరించక పోతే నువ్వు జైలుకి పోతావు’ అంది.’ అని ఆయన చెప్పాడు. తమ మాట వినలేదని తన కొడుకు పెళ్లిని సునీత దంపతులు చెడగొట్టారని కూడా వాపోయాడు.
కేసును దారి మళ్లించకుండా దాని మానాన దాన్ని పోనిస్తే రాజశేఖర్‌కు ముప్పు అని గ్రహించాక సునీత సహజంగా తన భర్తనే కాపాడుకుందామని చూస్తుంది అని ఊహిస్తే ఆవిడ ఆరాటం, కోర్టులో పోరాటం అర్థమౌతుంది. అందుకే కేసును అవినాశ్‌పైకి తిప్పడానికి ప్రయత్నం జరిగిందనుకోవాలి. సిబిఐ కూడా అదే దారిలో వెళ్లింది. సినిమాల్లో చూడండి, వెంటాడేవారిని ఏమార్చడానికి తన టోపీ, కోటు వేరేవాళ్లకి తొడిగి వీళ్లు తప్పుకుంటారు. వెంటాడేవారు ఆ వ్యక్తిని వెంటాడి పట్టుకుని చివరకు అతని కోటులో తాము వెతుకుతున్న నెక్లెస్ లేదని గ్రహించి పెదవి విరుస్తారు. వీళ్లు బతికిపోతారు. అలాగే సిబిఐ అవినాశ్ దోషిత్వాన్ని నిరూపించబోయి, కోర్టులో విఫలమై, అంతిమంగా కేసు మూలన పడేస్తే రాజశేఖర్ పాత్ర ఏమిటి అనే దాని గురించి ఎవరూ ఆలోచించరు.
ఏది ఏమైనా యిది ఊహాగానం మాత్రమే. సిబిఐ పూర్తి చార్జిషీటు పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చి, కోర్టులో వాదోపవాదాలు ప్రారంభమైతే, న్యాయమూర్తికి ఏం తోచినా, మనకంటూ ఒక ఐడియా ఏర్పడుతుంది. ఈ వ్యాసంలో నేను ఏవైనా పాయింట్లు వదిలేసినా, పొరపాటు లాజిక్ చేసినా ఎత్తిచూప ప్రార్థన. మనలాటి సామాన్యులకు కావలసినది సత్యశోధనే తప్ప ఎవరి పక్షాన నిలబడవలసిన అవసరం మనకు లేదు. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2023)