రెండేళ్ల క్రితం వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు ఒక ఆర్టికల్ రాశాను. అప్పుడు ఏ సందేహాలు వెలిబుచ్చానో రెండేళ్లు గడిచినా అవే సందేహాలు యిప్పుడూ గాల్లో తేలుతున్నాయి. టిడిపి ప్రభుత్వం వెళ్లింది, వైసిపి ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర పోలీసుల నుంచి విచారణ సిబిఐకు మారింది. ఇప్పటిదాకా కేసు ముందుకు సాగలేదు. పైగా ఒక సాక్షి చచ్చిపోయాడు – ఆత్మహత్యా, హత్యా అన్నది తేలకుండా! ఏదీ తేల్చకుండానే కేసు క్లోజ్ చేసేస్తారేమో కూడా తెలియదు. సాధారణంగా అనామకుల విషయంలో యిలా జరుగుతుంది. కానీ పోయినది మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, మరో ముఖ్యమంత్రికి బాబాయి. అయినా కేసు ముందుకు నడవటం లేదంటే ఏమనాలి? క్రిమినాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ యింత అభివృద్ధి చెందిన యీ రోజుల్లో కూడా పరిశోధన ముందుకు సాగడం లేదంటే ఏమనుకోవాలి?
ఇదేమైనా ఒక్క క్లూ కూడా దొరక్కుండా చేసిన సోఫిస్టికేటెడ్ మర్డరా ఏమన్నానా? అతి మొరటుగా సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించి, వివేకా చేత స్వహస్తాలతో ఉత్తరాలు రాయించి, భీకరహత్యను గుండెపోటుగా పొరబడ్డామని బుకాయించి దొరికిపోయిన కేసు. ఇలా తారుమారు చేయడంలో మోటివ్ ఏమిటి అన్నదాని దగ్గర మొదలుపెడితే యీ పాటికి కనీసం కొందరి పేర్లయినా బయటకు వచ్చేవి. అది కూడా రాలేదంటే ‘చేతిలో ఎన్ని ఆధునిక సాధనాలున్నా మీరు చేతకాని దద్దమ్మలర్రా’ అని వివేకా హంతకుడు వెక్కిరిస్తున్నట్లు ఉంది. అబ్బే చేతకాని వాళ్లం కాము, కావాలనే నిజాలను తొక్కిపెడుతున్నాం అని అనదలచుకుంటే ఆ మాట స్పష్టంగా చెప్పేయండి. ఎంత ప్రముఖవ్యక్తిని భీకరంగా హత్య చేసినా మేం నిశ్చలంగా చూస్తూ కూర్చుంటాం, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడుతున్నాం అని డప్పు వేసుకుంటూనే వుంటాం అని చెప్పదలచుకుంటే చెప్పండి.
తండ్రి హత్య జరిగిన రెండేళ్ల తర్వాత వివేకా కుమార్తె డా. సునీత దిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి యీ ప్రశ్నలన్నీ అడగవలసి వచ్చిందంటేనే రాష్ట్రం పరువు పోయినట్లయింది. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో వున్నది హతుడి బంధువా, హత్య జరిగినపుడు ఉన్నది రాజకీయ ప్రత్యర్థా అన్నది ప్రశ్న కాదు. ఇది రాష్ట్రం పరువుప్రతిష్ఠలకు సంబంధించిన విషయం. చంద్రబాబు హయాంలో విచారణ ప్రారంభమైంది. అప్పుడు వాళ్లు యిచ్చిన ప్రకటనలు కూడా స్పష్టత నివ్వకపోగా గందరగోళాన్ని సృష్టించాయి. ఎన్నికలు ముంగిట్లో వున్నా అవి నిర్వహించే టీము వేరు, యీ టీము వేరు. వీళ్ల పని వీళ్లు చేయాల్సింది. అధికారం చేతులు మారింది. అప్పటివరకు జరిగిన విచారణ ఏమైంది అని అడిగినవారు లేరు. కథ ముందుకు సాగటమే లేదని సిబిఐకు అప్పగించాలని వివేకా భార్య కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. బాబు హయాంలో సిబిఐ చేపట్టాలని అడిగిన జగన్, యిప్పుడు అక్కరలేదన్నారు. అలా అని విచారణలో ఏమైనా ప్రగతి చూపించగలిగారా? లేదే! కొన్ని కేసులు గంటల్లో పట్టుకున్నామంటారు, మరి యివి ఏళ్లూ, పూళ్లూ పడుతున్నాయేం?
చివరకు కోర్టు ద్వారా సిబిఐకు వెళ్లింది. ఓ టీము వచ్చి కాస్త యిన్వెస్టిగేట్ చేశారు అంటూండగానే వాళ్లకు కరోనా వచ్చిందట. వాళ్లు వెళ్లిపోయి కొత్త టీము వచ్చిందట. కరోనా వస్తే మాత్రం కొన్ని వారాల్లో తగ్గిపోతుందిగా, ఆ మాత్రం దానికే టీము మారిపోవాలా? వీళ్లు వచ్చి రెడ్డొచ్చె మొదలాడు అన్నట్లు మళ్లీ మొదలెట్టాలా? జాప్యం చేయడానికి సాకులనిపించటం లేదూ! విచారణ జాప్యం చేస్తే ఎంత అనర్థమో జగన్‌కు స్వానుభవం వుంది కదా! జగన్‌పై వున్న కేసులు ఓ రూపానికి రాకుండానే జైల్లో నెలలపాటు వుంచారు. విచారణ ప్రారంభించిన తర్వాతా వేగంగా నడవటం లేదు. జగన్ నెత్తిమీద కేసుల కత్తి అలాగే వేళ్లాడదీసి వుంచారు తప్ప, అటోయిటో తేల్చలేదు. కోర్టు హాజరీ తప్పించుకోవడానికి ప్రతి శుక్రవారం ఈయన ఏదో ఒక కారణం వెతుక్కోవలసి వస్తోంది. తనకు జరిగినది యింకోరికి జరగకుండా చూడాలి కదా!
జస్టిస్ డిలేడ్ యీజ్ జస్టిస్ డినైడ్ అనేది పాత సామెతే కావచ్చు. ఇప్పటికీ వర్తిస్తుంది. జాప్యం వలన అమాయకుడికి క్షోభ, అసలు నేరస్తుడికి మరిన్ని నేరాలు చేయడానికి అదనపు అవకాశం! ఈ కేసులో విచారణ వేగవంతం చేయండని జగన్ ప్రభుత్వం సిబిఐకు లేదా హోం శాఖకు రిమైండర్లు పంపిందా? రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సాక్ష్యాధారాలన్నీ అప్పగించిందా? అన్నీ డౌట్లే… అనుకుంటూండగా వివేకా కూతురు డా. సునీత కుండబద్దలు కొట్టేశారు. తనకు ఎవరిమీద అనుమానం వుందో స్పష్టంగా చెప్పేశారు. బయటి టాక్ కూడా అదే. అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డికి దీనిలో ప్రమేయం వుందనే అంటున్నారు. వారు స్వయంగా చేయించకపోయినా, చేయించినవారెవరో వారికి తెలుసని, వారిని రక్షించడానికి చూస్తున్నారనీ తేటతెల్లంగా తెలుస్తోంది. రక్తసిక్తంగా వున్న శరీరాన్ని చూసి గుండెపోటుతో పోయారని చెప్పినవాళ్లని, బెడ్‌రూమ్ కడిగించినవాళ్లని తీసుకెళ్లి శుభ్రంగా ఝాడిస్తే వెనక్కాల వున్నవాళ్ల పేర్లు తెలుస్తాయి. అవినాశ్, భారతికి బావ అవుతారు కాబట్టి భారతి జగన్‌పై ఒత్తిడి తెచ్చి కేసు ముందుకు సాగకుండా చేస్తున్నారనే టాక్ కూడా వుంది.
వైయస్ వుండేటప్పుడు రాజ్యాంగేతర శక్తిగా జగన్ పేరు వినబడేది. జగన్ సిఎం అయ్యాక భారతికి ఆ ఖ్యాతి దక్కుతోంది. షర్మిల ఆగ్రహానికీ ఆవిడ పేరే, దీనికీ ఆవిడ పేరే! ఇంట్లో వాళ్లు ఏం చెప్పినా పదవిలో వున్నవాళ్లు ఏం చెయ్యాలో అది చేయకపోతే అది వారి తప్పే. వైయస్ వుండగా జరిగిన పనులకు ఆయనే బాధ్యుడు. జగన్ వుండగా జరిగిన లేదా జరగని పనులకు ఆయనే బాధ్యుడు. పక్కవాళ్లని ఆడిపోసుకోవడం అనవసరం. తమను పాలించమని ప్రజలు అధికారం యిచ్చింది జగన్‌కు. ఆయన భార్యకు, కజిన్స్‌కు కాదు. కేసును అపరిష్కృతంగా వుంచడం ఏ మాత్రం శోభ నివ్వదు. ముఖ్యంగా సునీత బహిరంగంగా తన అనుమానాలు వెలిబుచ్చినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఏదో ఒక ప్రకటన రావాలి. సిబిఐ చూస్తోంది, ప్రాథమిక విచారణ పూర్తయింది, అనుమానితులు దొరికారు.. లాటిదేదో చెప్పాలి. ఇక్కడ కుటుంబబాంధవ్యం పక్కన పెడదాం. ఒక హతుడి కుటుంబసభ్యులకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి వుంది. ఒక యాక్సిడెంటులో వైయస్ చనిపోతే దుఃఖించినవారందరి యిళ్లకూ ఊరూరూ వెళ్లి పరామర్శించి వచ్చిన వ్యక్తి జగన్. అలాటిది యిప్పుడు దారుణంగా హత్యకు గురైన వ్యక్తి కూతురు రెండేళ్లు ఓపిక పట్టి, యిప్పుడు బయటకు వచ్చి ప్రశ్నలు అడిగితే అన్‌జాన్ కొట్టడమేమిటి?
సీరియస్‌గా విచారణ జరిపితే ముఖ్యమంత్రి ఆత్మీయులే యిరుక్కునే స్కోప్ వుందనుకుందాం. సాధారణంగా యిలాటి వాటిల్లో ఏ డ్రైవరో, పనివాడో నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడు. అతను ఎలాగూ నేరం చేయలేదు కాబట్టి ప్రాసిక్యూషన్ వాళ్లు సరైన ఆధారాలు సబ్మిట్ చేయలేక పోతారు. కోర్టు కేసు కొట్టివేయడమో, లేదా రెండు మూడేళ్ల శిక్షతో సరిపెట్టడమో చేస్తుంది. వివేకా కేసులో అలాటి ప్రయత్నం కూడా చేయకపోవడం హంతకుల ధీమాను చాటి చెప్తోంది. ఇంతోటి హత్యకు డ్రైవర్‌ను యిరికించడం కూడా వేస్టు అనుకున్నారేమో! కేసు నానబెడితే అడిగేవాడెవడు అనే పొగరు కనబడుతోంది. అంతగా అడిగితే కేంద్రం చేతిలో వుంది కేసు, మమ్మల్ని అడుగుతావేం అనవచ్చు, కేంద్రం ఎప్పుడు దేన్ని పరిగెత్తిస్తుందో, ఎప్పుడు నిలుపుతుందో, ఎప్పుడు పాతరేస్తుందో ఎవరూ చెప్పలేరు కదాని వాదించవచ్చు– అనుకుంటూండవచ్చు.
ఈ కేసే కాదు, ‘కోడి కత్తి కేసు’గా పేరుబడిన వైజాగ్ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి కేసు కూడా చూడండి. అదీ కేంద్ర విచారణ సంస్థల దగ్గరే మూలుగుతోంది. రెండేళ్ల క్రితం వివేకా ఆర్టికల్‌లోనే దాని గురించి ఎందుకింత ఆలస్యం అని రాశాను. అది కూడా మామూలు కేసు కాదు, ఒక మాజీ ఎంపీ, అప్పటి ఎమ్మెల్యే, ప్రతిపక్షనాయకుడు, ప్రజాదరణ వున్న నేతపై జరిగిన దాడి. దానిలో అన్నీ వివరంగా అందరికీ తెలుసు. అయినా విచారణ పూర్తి చేయలేదు, యిప్పటికీ! అంటే అర్థమేమిటి? మన కేంద్ర విచారణ సంస్థలు అంత అసమర్థవ్యవస్థలా? చిత్రమేమిటంటే కోడి కత్తి విషయంలో కానీ, వివేకా విషయంలో కానీ రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు విచ్చలవిడిగా తమ రాజకీయ ప్రచారానికి వాడుకున్నాయి. టిడిపి వైసిపిని కోడికత్తి పార్టీ అని వెక్కిరిస్తూ పోయింది. ప్రచారం కోసం జగన్ కావాలనే తనపై దాడి చేయించుకున్నారని ఆరోపించింది. ఇక వైసిపి అయితే ఎయిర్‌పోర్టులో కాంటీన్ యజమానికి, లోకేశ్‌కు బంధం వుందని, కావాలని చేయించిన దాడి అనీ తెగ ప్రచారం చేసింది. వివేకా హత్యలోనూ ఒకరినొకరు నిందించుకున్నారు.
కేంద్ర సంస్థలు విచారణ చేస్తున్నా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా విచారణ జరిపించవచ్చనుకుంటా. మహారాష్ట్ర ప్రభుత్వం అలాగే చేస్తోంది. వివేకా జగన్‌కు సాక్షాత్తూ బాబాయి. ఎయిర్‌పోర్టు దాడి సాక్షాత్తూ తన మీదనే. ఇవి ప్రచారానికి పనికి వస్తాయి తప్ప విచారణకు పనికి రావా? ఒక గూండాను చంపినా.. చంపనక్కరలేదు, గాయపరిచినా చేసినవారెవరో బయటకు తీయాలి. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. నేరస్తులకు దండన పడాలి. లేకపోతే న్యాయవ్యవస్థపై, పోలీసు వ్యవస్థపై, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుంది. దాచినకొద్దీ కుతూహలం పెరుగుతుంది. అనుమానాలు విజృంభిస్తాయి. ఆరోపణలు వెల్లువెత్తుతాయి. ముఖ్యమంత్రి అస్మదీయులు కిరాతకంగా చంపేసి కూడా తప్పించుకోగలరనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఎన్ని సంక్షేమ పథకాలతో జోకొట్టాలని చూసినా ప్రజలు మెలకువగానే వుంటారు. అది జగన్ తెలుసుకోవాలి. ఇంతకీ కేంద్రంలోని బిజెపి యీ కేసుల విషయంలో తాత్సారం ఎందుకు చేస్తోంది? కీలకమైన ఆధారాలన్నీ సేకరించి, ఎన్నికల ముందు అస్త్రంగా వాడుకోవడానికా? వాళ్లకు ఎన్నికల సమయంలోనే ప్రత్యర్థులపై కేసులు గుర్తొస్తాయి. వైసిపిని లేదా టిడిపిని వంచడానికి వీటిని యిస్తోకు ముక్కల్లా దాచుకుంటున్నారా? ఏమో, మోదీ లేదా అమిత్ హృదయం తెలిసినవారికే అసలు సంగతి తెలుస్తుంది.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్)