Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: వివేకా హత్య ఏం చెపుతోంది?

ఎమ్బీయస్‌: వివేకా హత్య ఏం చెపుతోంది?

వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య గురించి యీ దశలో రాయడమంటే సాహసమే. ఎందుకంటే ఎవరేమంటున్నారో సరిగ్గా తెలియటం లేదు, బయటకు వస్తున్న సమాచారం కూడా గందరగోళంగా ఉంది. అసలువాళ్లు మాట్లాడరు, కొసరువాళ్లు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందువలన హత్య ఎవరు చేశారో, ఎలా జరిగిందో నేనేమీ చెప్పటం లేదు, ఊహించటం లేదు. మరెందుకు రాయడం అంటే రాబోయే రోజుల్లో మరి కొన్ని విషయాలు బయటకు వస్తే మరీ వాటిని సరైన తీరులో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని! ఇది రాసేవరకు తెలిసిన సమాచారం ప్రకారం, హత్య ఆర్థిక కారణాలతో జరిగి వుంటుందని 'సిట్‌' భావిస్తోంది. అది నిజం కావచ్చు కూడా. అయితే అప్పుడు మరో ప్రశ్న ఉదయిస్తుంది - ఆర్థిక కారణాలే అయితే హత్యను మామూలు మరణంగా చిత్రీకరించడానికి ఎందుకు ప్రయత్నించారు? అని. అసలు హత్య అంటేనే మిస్టరీ, చాలా హత్య కేసులు ఎవరు చేశారో తెలియకుండానే మూత పడుతూ ఉంటాయి. ఒకవేళ తెలిసినా ఆధారాలు దొరకవు, దొరికినా కోర్టులో నిలవవు. అలాటప్పుడు హత్య జరిగిన మూడు, నాలుగు రోజుల్లోనే సర్వం తెలిసిపోవడం అసాధ్యం. పైగా యీ హత్య కేసు చుట్టూ రాజకీయపు పొగమంచు దట్టంగా అలుముకుని ఉంది. ఆ పొగమంచు క్లియర్‌ చేసుకుంటే కాస్తయినా కేసు అర్థమవుతుందని నా భావన.

ముందుగా అసత్యాలగా, అతిశయోక్తులుగా అనిపించినవి తీసి పక్కన పెడదాం. ముందుగా బాబు తన కుటుంబసభ్యులందరినీ వరుసగా చంపించి వేస్తున్నారనే జగన్‌ వాదన గురించి. ఆయన చెపుతున్నదేమిటంటే తన తాత రాజారెడ్డి హత్య జరిగినపుడు బాబు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడైన తన తండ్రిని జిల్లాకు కట్టడి చేయడానికై తాతను చంపించాడని! రాజారెడ్డి ఫ్యాక్షనిస్టు, ఆయన చేతిలో చాలామంది చనిపోయారని ప్రతీతి. వారిలో ఒకరు పగ తీసుకున్నారు కాబట్టే వైయస్‌ ఊరుకున్నారని అంటారు. హత్యారాజకీయాలకు ఫుల్‌స్టాపు పెడదామనుకున్నాను కాబట్టే తన తండ్రి హంతకులు కళ్లెదురుగా ఉన్నా వదిలేశానని వైయస్సే చెప్పుకున్నారు. ఆయన బతికున్నపుడు తన తండ్రిని బాబు చంపించాడని ఎన్నడూ ఆరోపించలేదు. కేసు పెట్టలేదు. రాష్ట్రంలో జరిగే హత్యలన్నిటినీ ముఖ్యమంత్రి ఖాతాలో వేయడం అసమంజసం. గత కొన్ని దశాబ్దాలలో కడప జిల్లాలోనే వేలాది హత్యలు జరిగి వుంటాయి. అవన్నీ ఆ యా కాలాల ముఖ్యమంత్రుల నెత్తిపై రుద్దేస్తే ఎవరి రికార్డూ క్లీన్‌గా ఉండదు.

ఇక వైయస్‌ హత్య కూడా బాబే చేయించారనే ఆరోపణ. వైయస్‌ పోయాక, ఆ తర్వాత కూడా రిలయన్సు వాళ్లే చేయించారని జగన్‌ అంటూ వచ్చారు. సోనియాతో చెడాక ఆవిడ పేరు కూడా కలిపినట్లున్నారు. బాబు పేరు మాత్రం రాలేదు. ఇవాళ ఆ ముచ్చటా తీరిపోయింది. పోవడానికి రెండు రోజుల ముందు రోజు 'అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా' అన్నారట. వెంటనే ప్రమాదం జరిపించారట! ఇది బొత్తిగా నమ్మశక్యంగా లేదు. ఆ నాటి రష్యన్‌ వెబ్‌సైట్‌ కూడా బాబు పేరు ఎత్తినట్లు లేదు. ఎన్నికల సమయం కదాని యిలాటి నిరాధార ఆరోపణలు చేస్తే అసలైన ఆరోపణలకు కూడా విశ్వసనీయత పోతుంది. ఇక తనపై ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి గురించి కూడా జగన్‌ ప్రస్తావించారు. దాని గురించి యిదివరకే చర్చించాం. ఏమీ లేని దానిపై జగన్‌ అడావుడి చేస్తున్నాడనుకున్నాను కానీ ఘటన జరగగానే ముఖ్యమంత్రి, డిజిపిలు మాట్లాడిన తీరు, తర్వాత రాష్ట్రప్రభుత్వం కేంద్ర సంస్థ విచారణకు అడ్డుపడడంతో అనుమానం వచ్చిందని. ప్రస్తుతం విచారణ కేంద్ర సంస్థ చేతికి వెళ్లింది. వాళ్లూ ఏమీ బయట పెట్టటం లేదు. ఏమనుకోవాలో అర్థం కావటం లేదు.

చూడబోతే పెద్ద కేసేమీ కాదు, ఘటన జరగ్గానే దాడి చేసినవాడు దొరికాడు. ఆయుధమూ దొరికింది. ఎన్నాళ్లు విచారణ చేస్తారు? రాష్ట్రప్రభుత్వపు సిట్‌ వాళ్లే నెలల తరబడి చేశారు. ఎన్‌ఐఏ వాళ్లు చేపట్టి 2 నెలలైంది. ఇప్పటిదాకా విషయం బయట పడలేదా? నిందితుడు నోరు విప్పటం లేదా? ఎన్నాళ్లు తమ కస్టడీలో ఉంచుకుంటారు? అతను టిడిపికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పి వుంటే కేంద్రంలో ఉన్న బిజెపి యీ పాటికే దానిని బయటకు పెట్టి టిడిపిని యిరకాటంలో పెట్టి వుండేదిగా! లేకపోతే ఎన్నికల సమయం దాకా దాన్ని తురఫు ముక్కలా దాచుకుంటున్నారా? ఏది ఏమైనా ఆ సంఘటన విషయంలో టిడిపి నెత్తి మీద ఒక ప్రశ్నార్థకం వేళ్లాడుతోందని మాత్రం ఒప్పుకోవాలి. ఇక యీ హత్య విషయంలో 'మా చిన్నాన్న జమ్మలమడుగు ఇన్‌చార్జిగా ఉండి మా పార్టీనుంచి నెగ్గి మీ పార్టీలో చేరి మంత్రి ఐన ఆదినారాయణరెడ్డిని ఓడించాలని చూడడం నేరమా?' అని జగన్‌ ప్రశ్న. మహా అయితే స్థానిక టిడిపి నాయకుల హస్తం ఉండి వుండవచ్చు తప్ప బాబు, లోకేశ్‌ల హస్తం ఉందనడం చాలా ఫార్‌ఫెచ్‌డ్‌ ఐడియా.

ఇలా ఎందుకంటున్నానంటే ఇప్పటికే జగన్‌పై దాడి విషయంలో టిడిపి రికార్డు బాగా లేదు. ఇప్పుడీ సాహసం కూడా ఎందుకు చేస్తారు? సర్వే ఫలితాలన్నీ జగన్‌ పక్షాన ఉన్నాయి. అవన్నీ తప్పనుకున్నా, రెండు పార్టీల మధ్య మార్జిన్‌ అతి తక్కువగా ఉందన్న విషయం బాబుకే అర్థమవుతోంది. ఎవరిని కలుపుకుందామా, ఏ వర్గాన్ని మంచి చేసుకుందామా అని తాపత్రయ పడే సమయంలో అనవసరంగా యీ హత్య చేయించి, జగన్‌కు ఎడ్వాంటేజి ఎందుకిస్తారు? ఎయిర్‌పోర్టులో దాడి విషయంలోనే టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ జగన్‌ను అతని తల్లి, సోదరి చంపించబోయారని ఆరోపించి, నిరూపించలేక నవ్వులపాలయ్యారు. ఇప్పుడీ హత్య చేసి, దీన్ని జగన్‌ ఖాతాలో రాయించేద్దామని ప్రణాళిక రచించి ఉంటే, దాన్ని పక్కాగానే ప్లాన్‌ చేసి ఉండేవారు. ''ముత్యాల ముగ్గు''లో చెప్పినట్లు ఆ శవాన్ని ఎదుటోడి కారు డిక్కీలో పడుక్కోబెట్టించేసి.. అన్నట్లు యీ గొడ్డలినో, కత్తినో జగన్‌ పెరట్లో పడేయించేవారేమో.

అప్పటికీ అవినాశ్‌ రెడ్డిని దీనిలోకి లాగుదామని టిడిపి వారు ప్రయత్నిస్తూన్నారు. ఎంపీ టిక్కెట్టు కోసం అవినాశ్‌కు, వివేకాకు మధ్య స్పర్ధ ఉందని మీడియాలో రాయిస్తున్నారు. వివేకా దగ్గర డబ్బు లేదని, యిచ్చిన అప్పులు వసూలు చేసుకోలేక నానా అవస్థలూ పడుతున్నాడని అందరూ చెప్తూనే వున్నారు. అలాటాయన ఖరీదైన ఎన్నికల గోదాలోకి దిగి, ఏకంగా పార్లమెంటు సీటుకి పోటీ చేస్తారా? అన్ని కోట్లు ఆయన దగ్గర ఉన్నాయా? జగన్‌ యిచ్చి నిలబెడతాడా అనుకుంటే చిన్నాన్నను పార్టీలో మళ్లీ చేర్చుకోవడమే ఎక్కువ, డబ్బు యివ్వడం కూడానా అనే అభిప్రాయంలో ఉన్నాడనీ అంటున్నారు. అందువలన పార్లమెంటు టిక్కెట్టు హత్యాకారణమనడం హాస్యాస్పదం. నిజానికి హత్య సీను దగ్గర అస్పష్టతకు కారణం - వివేకా బావమరిది శివప్రకాశరెడ్డి, పిఏ కృష్ణారెడ్డి వగైరాలు. వారికి రాజకీయ ప్రాధాన్యత లేదు కాబట్టి అవినాశ్‌పై ఎక్కుపెట్టి ఉంటారనుకోవాలి. గుండెపోటుతో మరణించారని అవినాశ్‌ రెడ్డి చెప్పారని ఎస్పీ మీడియా ఎదుట చెపితే, తను అలా చెప్పలేదని, చనిపోయారని మాత్రమే చెప్పాననీ అవినాశ్‌ అంటున్నారు. శవం చూడగానే నోటిలో నుంచి రక్తం వచ్చి చనిపోయారని అనుకున్నానని అంటున్నారు.

శవం కనబడ్డాక నిజానికి ఎవరు ఏమి చేశారో, సరిగ్గా అర్థం కావటం లేదు. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి 'వాళ్లు', 'కుటుంబసభ్యులు', 'బంధువులు' అంటూ సర్వనామాల్లో మాట్లాడుతున్నారు. ఫలానా వ్యక్తి రక్తం కడిగించాడు, ఫలానా వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి, కేసు అక్కరలేదు, సహజమరణమే అన్నాడు అని చెప్పటం లేదు. నిజానికి అవన్నీ పోలీసులు చెప్పాలి. ఇక మొదట్లో గుండెపోటు అని సాక్షి టీవీ ప్రచారం చేసింది అని టిడిపి అంటోంది. సాక్షి మాత్రమే కాదు, అన్ని టీవీలు అదే ప్రసారం చేశాయి. మధ్యాహ్నానికే అన్నీ ఒకేసారి స్వరం మార్చాయి. పోస్టు మార్టమ్‌ రిపోర్టు ఎప్పుడో సాయంత్రం వచ్చింది. అప్పటిదాకా సాక్షి సహజమరణం అంటూ వచ్చింది అని చెప్పడం సరి కాదు. ఇంతకీ మీడియా వాళ్లకు సహజమరణం అని ఎవరు చెప్పారు? పోలీసులా? పోలీసుల్లో ఎవరు? బంధువులా? బంధువుల్లో ఎవరు? స్టాఫా? అయితే ఎవరు? శవానికి కట్లు కట్టిన తీరు చూసి మీడియా వాళ్లకు అనుమానం రాలేదా? ఎన్నో 'ఇన్‌సైడ్‌ స్టోరీ'లు, ఇన్వెస్టిగేటివ్‌ కథనాలు యిచ్చేసే టీవీ మీడియా 'అసలేం జరిగింది?' అని పనివాళ్లనైనా అడిగి కథనాలు వేయలేదేం?

ఒకటి మాత్రం నిజం. శవాన్ని చూడగానే అది హత్య అని స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా పులివెందుల వాసులకు, అందరూ కాకపోయినా కనీసం వైయస్‌ రాజారెడ్డి కుటుంబసభ్యులకు! ఏ కత్తితో నరికితే ఎంత లోతుకి దిగుతుందో వాళ్లకు సులభంగా తెలుసు. కమోడ్‌ మీద నుండి పడితే చితికే తలకు, కత్తితో నరికిన తలకు తేడా ఒక్క క్షణంలో చెప్పగలరు. క్రిమినల్‌ కేసుల్లో కూడా రాటుదేలిన ఘటాలు చాలా ఉంటాయక్కడ. సాక్ష్యాధారాలు తుడిచివేయకూడదనే ప్రాథమిక జ్ఞానం కూడా పుష్కలంగా ఉంటుంది. మరి హాల్లో రక్తం ఎందుకు కడిగించారు? అది కడిగినవాళ్లు బాత్‌రూములో ఎందుకు కడిగించలేదు? అంటే హాలులో కడుగుతూండగానే దీన్ని హత్యగా చూపిస్తేనే మంచిది అనుకున్నారా? ఈ విషయంపై టిడిపి ఎంత అఫెన్సివ్‌గా ఉందో, వైసిపి అంత డిఫెన్సివ్‌గా ఉంది. సాధారణ మరణంగా చెపుదామని ముందు అనుకుని, దానికి తగ్గట్టుగా ఆధారాలు చెరిపేస్తూ, మధ్యలో మనసు మార్చుకుని, హత్యగా చెప్పేస్తేనే మేలు అనుకున్నారనేది ఖచ్చితం.

హత్యంటూ చెప్పేశారు కాబట్టి యిక ధారాళంగా ఆరోపప్రత్యారోపణలు చేసుకోవచ్చు. బాబు, లోకేశ్‌ ప్లాను చేశారని, ఆదినారాయణరెడ్డి అమలు చేశారని వైసిపి వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర పోలీసుల 'సిట్‌'పై నమ్మకం లేదు కాబట్టి సిబిఐ విచారణ కోసం పట్టుబడతామని, కాదంటే కోర్టుకి వెళతామని జగన్‌ అంటున్నారు.  చిన్నాన్న హత్యకు గురైతే గుండెపోటుగా చిత్రీకరించి, రక్తపు మరకలు తుడిచేసి, పంచనామా లేకుండా మృతదేహాన్ని తరలించి, వాస్తవాలు చెప్పలేక తమపై నింద వేస్తున్నారనీ, నిజానికి జవాబు చెప్పవలసినది జగనేనని టిడిపి వర్గాలు మాటలు రువ్వుకున్నారు. వివేకా హత్యలో ఆర్థిక కోణం ముందుకు వస్తూన్నకొద్దీ ''సాక్షి'' దాని గురించి పెద్దగా మాట్లాడడం మానేసిన విషయం గమనార్హం. సిబిఐ విచారణ గురించి లాంఛనంగా ఓ మాట అంటున్నారు తప్ప ప్రదర్శనలు అవీ నిర్వహించటం లేదు. అంతమాత్రాన వాళ్లే హత్య చేయించారనడానికి లేదు.

జగన్‌కు కానీ అతని అనుయాయులకు కానీ వివేకాను చంపించవలసిన అవసరం ఉందా? అప్పుడెప్పుడో ఎంపీ సీటు తనకై ఖాళీ చేయమని జగన్‌ వివేకాపై ఒత్తిడి తెచ్చాడనీ, ఆ సందర్భంగా దురుసుగా ప్రవర్తించాడనీ (చెంపదెబ్బ కొట్టాడని కూడా ప్రచారంలో ఉంది).. యిలాటివన్నీ ప్రస్తావిస్తున్నారు. చెంపదెబ్బ కొట్టినా కిక్కురుమననివాడిని చంపవలసిన అవసరం ఉంటుందా? మాటలతోనే భయపెట్టవచ్చు కదా! పోనీ అప్పుడు అణగి ఉన్నాడు కానీ యిప్పుడు తల ఎగరేస్తున్నాడు అనుకోవడానికి అప్పటి కంటె వివేకా స్థితి దిగజారింది తప్ప ఎదగలేదు. ఆయన మంచి కార్యకర్త కావచ్చు కానీ రాజకీయంగా బలమైనవాడు కాడు. అధికారంలో ఉన్న కాంగ్రెసువాళ్లు ఉసి కొలిపితే వాళ్ల మాయలో పడి 2012 ఉపయెన్నికలో వదిన గారి మీదే పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు. ఇటీవల 2017లో స్థానిక ఎన్నికలలో వైసిపి తరఫున కూడా ఓడిపోయాడు. ఇక ఆయన వలన రాజకీయంగా పార్టీలో వారికి కానీ, బయటివారికి కానీ - ఎవరికి థ్రెట్‌ ఉంటుంది? ఉండదు అనుకుంటే వైసిపి వాళ్లనూ అనుమానించకూడదు, టిడిపి వాళ్లనూ అనుమానించకూడదు. ఈయన వెళ్లి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏవో అద్భుతాలు చేయబోయాడని, దానితో భయపడి ఆదినారాయణరెడ్డి యీయన్ను యిలా తప్పించివేశాడనీ అనే వెర్షన్‌ కూడా నమ్మనక్కరలేదు.

వివేకాను చంపడానికి రాజకీయ కారణాలు అక్కరలేదు అనుకుంటే వ్యక్తిగత కారణాలు ఉండి తీరాలి. అవి ఏమిటై ఉంటాయి అనేదే ఆసక్తికరం. రాజకీయాలైతే అందరికీ తెలుస్తాయి, వ్యక్తిగత విషయాలు పబ్లిక్‌లో రావు కాబట్టి వాటిని కనిపెట్టడం మరీ కష్టం. ఆయన మెతక మనిషి, అజాతశత్రువు, చంపడానికి ఎవరికి చేతులు వస్తాయి? అనుకోకూడదు. అజాతశత్రువు అనే పదం అందంగా ఉందని వాడేస్తాం కానీ మన ప్రమేయం లేకుండా మన పట్ల ఎవరో ఒకరు శత్రుత్వం పూనుతూనే ఉంటారు. మన పాటికి మనం స్వయంకృషితో పైకి వచ్చినా పక్కింటివాడు అసూయతో శత్రువు కావచ్చు. నా బోటి వాడు ఒట్టి రాతలతోనే బోల్డుమంది శత్రువులను పోగేసుకోగలడు. ఎవరికైనా అప్పిచ్చి తిరిగి యిమ్మంటే వాడికి శత్రువై పోతాం. శాంతి కావాలని కోరినా శత్రువులను తయారుచేసుకునే సందర్భాలు వస్తాయి. నాకు తెలిసున్న మాస్టారు గుర్తుకు వస్తున్నారు.

ఆయనది కడప జిల్లాయే, బహు సౌమ్యుడు, ఊళ్లో అందరి గౌరవమూ పొందే పెద్దమనిషి. దురదృష్టవశాత్తూ ఆయన కొడుకు ఫ్యాక్షన్‌ గొడవలలో యిరుక్కుని ఫ్యాక్షనిస్టుగా మారాడు. అది యీయనను బాధించింది. నలుగురికి సుద్దులు చెప్పే తను కొడుకు కారణంగా తల వంచుకోవాల్సి వస్తోందే అని. కొడుక్కి నచ్చచెప్పి, అవతలివాళ్లకు కబురు పెట్టి హైదరాబాదులో యిరు వర్గాలను కూర్చోబెట్టి రాజీచేశాడు. ఇకపై హింసకు పాల్పడమని అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఆయన ఆనందంగా సొంత ఊరుకి తిరిగి వెళ్లాడు. ఈ రాజీ ఆ వూళ్లో వున్న కొందరు కుర్రాళ్లకు నచ్చలేదు. వాళ్లకు చదువుసంధ్య లబ్బక ఎవరో ఒక ఫ్యాక్షనిస్టు నీడలో పడి వుంటూ తిండికి, తాగుడికి వాళ్లపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు కొట్లాటలు మానేసి, అంతా శాంతంగా ఉంటే వాళ్ల నోట్లో కరక్కాయే! అందువలన యీ రాజీ కుదిర్చిన మేస్టారిపై కసి పట్టారు. ఈయన బస్సు దిగుతూండగానే 'ఏం పెద్దాయనా, రాజీలు చేస్తూండావే' అంటూ చేతి బాంబు వేసి చంపేశారు.

అందువలన వివేకా కూడా డబ్బు లావాదేవీల విషయంలోనో, మరో దానిలోనో శత్రువులను సంపాదించుకుని ఉండవచ్చు. అది బయటకు రాదగిన విషయం కాదని కుటుంబం ఫీలై ఉంటుంది. అందుకే దాన్ని సహజమరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. 'వివేకా హత్య విషయం బయటకు వస్తే పులివెందులలో అల్లర్లు జరుగుతాయని, వాటిని నివారించడానికే గుండెపోటని పోలీసులకు చెప్పా' అని అవినాశ్‌, జగన్‌తో చెప్పినట్లు, జగన్‌ అతన్ని మందలించినట్లు ఓ పత్రికలో వార్త వచ్చింది. ఇది కాస్త వింతగా ఉంది. ఊళ్లో శాంతిభద్రతలు కాపాడే బాధ్యతను ప్రతిపక్షం తీసుకుందని అనుకోవడానికే తమాషాగా ఉంది. శాంతిభద్రతలు భగ్నమైతేనే వాళ్లకు పండగ, వెంటనే గవర్నరు వద్దకు పరిగెత్తుకెళ్లి రాష్ట్రపతి పాలన డిమాండ్‌ చేయవచ్చు. అసలిలాటి హత్యలు జరిగితే వెంటనే ప్రతిపక్షం సిబిఐ విచారణ కోరుతుంది. అధికారపక్షం అక్కరలేదంటుంది. బాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు సిబిఐ ఎంక్వయిరీ ఎన్నిసార్లు అడగలేదు? అలాటి అవకాశం వైసిపి వదులుకుంటుందా? నిజానికి మధ్యాహ్నానికల్లా హత్యే అని ఊరంతా తెలిసింది. అల్లర్లు జరిగాయా? ఎవరైనా నల్లజండాలు పట్టుకుని పోలీసు స్టేషన్‌పై దాడి చేశారా? అల్లర్ల పేరు చెప్పి కేసు కామాపు చేయబోయారనడం కూడా నప్పదు.

పోలీసులు చెప్పినదాని ప్రకారం - అవినాశ్‌ కార్యాలయంలో పనిచేసే భరత్‌ రెడ్డి పోలీసులకు ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో పోయారని చెప్పాడు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లేసరికి అక్కడ వివేకా పిఏ కృష్ణారెడ్డి,  వైయస్‌ మనోహర్‌రెడ్డి, అవినాశ్‌ రెడ్డి, డా. నాయక్‌, డా. గంగిరెడ్డి, ఆయన ఆసుపత్రిలో కాంపౌండరు వగైరా 20 మంది ఉన్నారు. వీరిలో కొంతమంది (ఎవరో స్పష్టంగా చెప్పలేదు) వివేకా రక్తపు వాంతులు చేసుకుని కమోడ్‌పై పడి గాయాలై చనిపోయారని చెప్పారు. (అక్కడున్న డాక్టర్లు ఆ వాదనను బలపరచారా? - తెలియదు) అంతకుముందే బెడ్‌రూములో రక్తపు మరకలు కడిగేశారు, (బెడ్‌రూమ్‌లో కడిగినవారు బాత్‌రూములో ఎందుకు కడగలేదు? పనివాళ్లు తక్కువయ్యారా?) రక్తపు మరకల దుప్పటి మారుస్తున్నారు, వివేకా తలకు, చేతికి గంగిరెడ్డి సిబ్బంది బ్యాండేజి కట్టి వున్నారు. ఇంత భీకరంగా చనిపోయిన వ్యక్తి శవాన్ని కదిలించకూడదన్న యింగిత జ్ఞానం కూడా మీకు లేదా అని పోలీసులు అడిగినట్లు తోచదు. ఈ కామాపు వ్యవహారం మోటివ్‌ ఏమిటో తెలిసేదాకా మనకు క్లారిటీ రాదు.

హత్యకు బలమైన రాజకీయకారణం కనబడటం లేదు కాబట్టి వేరే ఏదో వ్యక్తిగతమైనది ఉందనుకోవాలి. వ్యక్తిగతమైనది అనగానే కాంత, కనకం రెండిట్లో ఒకటి కావచ్చు. కాంత విషయాన్ని ఆంధ్రజ్యోతి వ్యాప్తి చేస్తోంది. షమీన్‌ లేదా సమీరా అనే ముస్లింను వివేకా 2010లో వివాహం చేసుకున్నారనీ, ఆమె ద్వారా ఒక కొడుకు ఉన్నాడనీ, వారి తరఫు వాళ్లు యీయనపై దాడి చేశారనీ కథనం. (దీన్ని పరమేశ్వరరెడ్డి ఖండించాడు) సమీరా నుంచి యీయన సెల్‌ఫోన్‌కు నాలుగు మెసేజులు వచ్చాయని, వాటిని యీయన డిలీట్‌ చేశాడనీ కూడా ఆంధ్రజ్యోతి అంటోంది. అర్ధరాత్రి 1.30కు వచ్చిన మొదటి మెసేజిలో ''నీ కూతురు వలన మేం నాశనమయ్యాం. ఇందుకు తగిన శిక్ష అనుభవిస్తావు. దేవుడు ఉన్నాడు.'' అని ఉందట. సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని, డిలీట్‌ అయినవాటిని కూడా రెస్టోర్‌ చేయించారంటే అది పోలీసుల పనే అయివుండాలి. వాళ్లే ఆంధ్రజ్యోతికి చెప్పి వుండాలి.

షమీన్‌ ఫోన్‌ నుంచి కడప వైసిపి నేత అఫ్జల్‌ ఖాన్‌కు కాల్స్‌ వెళ్లాయని కూడా జ్యోతి అంటోంది. ఈ రెండో పెళ్లి మాట ఎంతవరకు నిజమో యిప్పటివరకు తెలియదు కానీ ఆ దారం పట్టుకుని కాస్త దూరం నడిస్తే చిక్కుముడి విడిపోవచ్చు. సాధారణంగా అలాటి వ్యవహారాలు మొదటి భార్య పిల్లలకు రుచించవు. హత్య యీ కారణంగా జరిగిందని తెలిస్తే, రెండో పెళ్లి విషయం లోకానికి వెల్లడవుతుంది. 'ఉంచుకున్నదాని యింట్లో చచ్చిపోయినట్లు...' అనే సామెత ఉంది. ఒకాయన ఊళ్లోవాళ్లకు తెలియకుండా అక్రమసంబంధం పెట్టుకున్నాడు. రాత్రి ఏ వేళలోనే వెళ్లి వచ్చేస్తూండేవాడు. ఓ రాత్రి అలా వెళ్లినపుడు అక్కడే చచ్చిపోయాడు. దాంతో అందరికీ సందేహం వచ్చింది - ఈ వేళప్పుడు యిక్కడెందుకు? అని. అన్నేళ్ల గుట్టు రట్టయింది. అలాగ హత్య అనగానే, హంతకులు ఆ రెండోభార్య తాలూకు వాళ్లు అని తెలియగానే, కుటుంబం పరువు పోతుందని భయపడి వివేకా భార్య, కూతురు, అల్లుడు దానికి పబ్లిసిటీ యివ్వకుండా మూసిపెడదామని చూశారేమో!

వివేకా కుమార్తె డా. సునీత బయటకు వచ్చి మీడియాతో ఏమీ చెప్పటం లేదు. తను వచ్చేవరకు పోస్టుమార్టమ్‌ చేయవద్దని కోరారని అన్నారు. అంత్యసమయంలో వివేకా రాసిన లేఖను తను వచ్చేవరకు పోలీసులకు యివ్వవద్దని చెప్పారని కూడా అన్నారు. వచ్చాక పిఏ నుండి తీసుకుని సునీత తనే డిఐజికి అందించారట. ఆ లేఖలో చేతిరాత తండ్రిదే అని చెప్పారట. (ఆ లేఖను సృష్టించారని జగన్‌ అంటున్నారు, జగన్‌, సునీతలు ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదా?) అసలు ఆ లేఖ కూడా వింతగా ఉంది. హంతకులు డ్రైవర్‌ ప్రసాద్‌ను ఎలాగైనా యిరికించాలని, కత్తి చూపి వివేకాను బెదిరించి రాయించినట్లుంది. అది కూడా పకడ్బందీగా రాయించలేదు. తనను త్వరగా డ్యూటీలో రమ్మనంత మాత్రాన యజమానిని డ్రైవరు కొడతాడా? చంపుతాడా? మహా అయితే ఉద్యోగం మానేసి పోతాడు తప్ప! బెడ్‌రూములో చంపి, దుస్తులు మార్చి, బాత్‌రూముకి లాక్కెళ్లి.. ఏమిటిదంతా? నిజంగా సహజమరణంగానే చిత్రీకరించదలచిన వాళ్లయితే, దిండుతో ఒత్తి ఊపిరాడకుండా చంపేసి ఉండేవారు. కత్తితో కిరాతకంగా చంపారంటే కసి ఉన్నట్లే లెక్క. దాన్ని డ్రైవరుపై తోసేయాలని చూడడం పిరికితనం.

ఇక రెండో కారణమైన కనకమే ప్రధానంగా ముందుకు వస్తోంది. వివేకాకు మైనింగు వ్యాపారం విషయంలో సోదరుడు వైయస్‌ ప్రతాపరెడ్డితో పేచీలున్నాయట, తన బంధువు కృష్ణారెడ్డికి రావలసిన డబ్బు కోసం బాధితులతో కలిసి ఆయన ప్రతాపరెడ్డి యింటిముందు ఆందోళన చేశారు. అది నిజమే కానీ, దానికి దీనికీ సంబంధం లేదంటున్నారు ప్రతాపరెడ్డి. సెటిల్‌మెంటు విషయాల్లో పరమేశ్వరరెడ్డితో గొడవలున్నాయట. ఉంటే మాత్రం, చంపేటంత పగ ఉందా? అనేదే ప్రశ్న. పరమేశ్వరరెడ్డి వివేకా తరఫున బెంగుళూరులో సెటిల్‌మెంట్లు చేయిస్తూంటారని, వాళ్లిద్దరి మధ్య యిటీవల డబ్బు గురించి గొడవ వచ్చిందని వార్త వచ్చింది. వివేకా సెటిల్‌మెంట్లు కూడా చేయిస్తారా అనేది ఎవరైనా నిర్ధారిస్తే తప్ప యీ వాదనకు బలం రాదు. ఆయన కున్న యిమేజికి వ్యాపారాలు, కాంట్రాక్టులు అతికినట్లు సెటిల్‌మెంట్లు అతకడం లేదు. 'నేను చెప్పినట్లు చేయకపోతే వివేకా నీ అంతు చూస్తారు' అని బెదిరించడానికి ఆ సౌమ్యుడి యిమేజి బొత్తిగా పనికిరాదు. హత్య తర్వాత పరమేశ్వరరెడ్డి, అతని భార్య కనబడకపోవడంతో అనుమానపు ముల్లు అటు తిరిగింది.

పరమేశ్వరరెడ్డి కుటుంబానికి, టిడిపికి చెందిన బిటెక్‌ రవి కుటుంబానికి మధ్య ఫ్యాక్షన్‌ గొడవలున్నాయట. సోదరుడు హత్యకు గురి కావడంతో యితను తన వూరు వదిలి పులివెందులలో నివాస ముంటున్నాడు. బిటెక్‌ రవి చిన్నాన్న కేసులో ముద్దాయిట. చివరకు అతను తిరుపతిలో ఆసుపత్రిలో తేలాడు. తనకూ, వివేకాకు గొడవలు లేవని, యింటి దొంగలే ఆయన్ని చంపి ఉంటారని అన్నాడు. హత్యకు రెండు రోజుల ముందే తిరుపతిలో ఆసుపత్రిలో చేరాడట. కంప్లెయింటు ఏమిటంటే బిపి, సుగర్‌, గుండెనొప్పి! చేరినది ప్రయివేటు ఆసుపత్రి. వీల్‌ ఛెయిర్‌లో కూర్చుని మీడియాతో మాట్లాడాడు. ఆ పాటి జబ్బులకు వారం రోజుల చికిత్స అంటే వింతగానే ఉంది. మొదట పులివెందులలో గంగిరెడ్డి ఆసుపత్రిలోనే చేరాడట, అక్కడి వాళ్లు కడపకు, కడపవాళ్లు తిరుపతికి పంపించారట. అది ఏ పాటి జబ్బో వివేకాకు కూడా ఆత్మీయుడైన డా. గంగిరెడ్డే చెప్పాలి.

రూ.125 కోట్ల సెటిల్‌మెంటుతో ముడిపడిన భూమిలో కొంత భాగాన్ని వివేకాకు తెలియకుండా గంగిరెడ్డి అనే అనుచరుడు అమ్ముకోవడంతో వివేకాకు కోపం వచ్చిందని, అనుచరులైన గంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డి యిద్దరూ కలిసి వివేకాను హతమార్చి ఉంటారని మరో కథనం వచ్చింది.. ఇప్పటిదాకా ఏమీ స్పష్టంగా తెలియరావటం లేదు కాబట్టి ఎవరి చిత్తం వచ్చినట్లు వారు ఊహించుకునే స్వేచ్ఛ ఉంది. మార్చి 18న కూడా జగన్‌ 'ఎన్నికల సమయంలో నన్ను యిబ్బంది పెట్టాలని మా చిన్నాన్నను బాబు చంపించాడు' అంటున్నాడు.

నా మట్టుకు నేను రాజకీయకారణాలు ఏమీ వుండి వుండవని, వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగిందని అనుకుంటున్నాను. అది నిజమని తేలితే మాత్రం, యిప్పుడు ఎదుటివాళ్లకు రాజకీయ దురుద్దేశాలంటగడుతున్న వారందరూ నాలిక కరుచుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నా ఉద్దేశంలో వివేకా హత్య చెపుతున్న పాఠమేమిటంటే - తొందరపడి ప్రతీదీ రాజకీయం చేయవద్దని! అంతేకాదు, ఉన్నదున్నట్లుగా చూపకుండా మసిబూసి మారేడుకాయ చేయబోతే బాధితులే నిందితులవుతారని కూడా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?