Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: జస్టిస్ లక్ష్మణ్ వెలిబుచ్చిన సందేహాలు

 ఎమ్బీయస్‍: జస్టిస్ లక్ష్మణ్ వెలిబుచ్చిన సందేహాలు

టీనేజి అమ్మాయి ‘హీ లవ్స్ మీ, హీ లవ్స్ మీ నాట్’ అంటూ ఆకులు తుంపి పోసినట్లు అవినాశ్ అరెస్టు అవుతాడు, కాదు అంటూ మీడియా అదే పనిగా చర్చిస్తూ పోయింది, అది తప్ప వేరే పని లేనట్లు! వివేకాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? సిబిఐ విచారణ సవ్యంగా సాగుతోందా? అనే చర్చకు ఆస్కారం యివ్వకుండా ఎంతసేపూ అవినాశ్ అరెస్టవుతాడా లేదా, దీనిలో జగన్‌ హస్తం ఉందా లేదా అన్న దానిమీదనే ఫోకస్ పెట్టారు. అదిగో పులి అంటే, యిదిగో తోక అన్నట్లు, సిబిఐ కదలికల గురించి కథనాలు అల్లేశారు. వినివిని మొహం మొత్తేసి, వీళ్లకు యిది తప్ప వేరే పనే లేదా అనిపించేసింది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వేరే అనేక సంగతులు నడుస్తున్నాయి కానీ దీనిపై గంటలగంటల చర్చలు జరిపారు. చివరకు దీనిపై జూదరులు పందాలు వేసుకునే స్థితికి తీసుకుని వచ్చారు.

చివరకు జస్టిస్ లక్ష్మణ్ అవినాశ్‌కు ముందస్తు బెయిలు యిచ్చారు. ఆ సందర్బంగా ఆయన చేసిన పరిశీలనలు చాలా చక్కగా ఉన్నాయి. ఆయన యిచ్చిన ఆదేశమే ఫైనల్ కాకపోవచ్చు. సునీత సుప్రీం కోర్టుకి వెళ్లి దానిపై పునర్వచారణ చేయమంటున్నారు. సుప్రీం కోర్టు తిరగతోడనూ వచ్చు. కానీ యీ తీర్పు సందర్బంగా ఆయన ప్రదర్శించిన కామన్‌సెన్స్ నాకు నచ్చింది. సామాన్యుడి మనసులో ఉన్న అనేక సందేహాలను ఆయన వ్యక్తం చేశారు. మీడియాలో యిన్నేసి గంటలు చర్చలు జరిగినా యీ సందేహాలకు, ప్రశ్నలకు సమాధానా లిచ్చినవారెవరూ లేకపోయారు. తదుపరి హియరింగ్ ‌కైనా సిబిఐ సమాధానాలతో రెడీ కావాలి.

బెయిలు యిస్తూ ఆయన చెప్పిన కారణాలు చాలా సహేతుకంగా చెప్పారు. హత్య చేయడానికి అవినాశ్‌కు మోటివ్ ఉందని నాలుగేళ్ల తర్వాత కూడా సిబిఐ ఎస్టాబ్లిష్ చేయలేక పోయింది. ఆధారాలు సేకరించకుండా అప్రూవర్‌గా మారిన దస్తగిరి మాటల మీద, హియర్‌సే మీద ఆధారపడింది. ఎంపీ టిక్కెట్టుకై వివేకా అవినాశ్‌కు అడ్డు కాదన్న విషయాన్ని సిబిఐ కొత్తగా తెచ్చిన రహస్యసాక్షి కూడా ధృవీకరించారు. ఎ5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర రెడ్డితో వివేకాకు 2009 నుంచి రాజకీయ విభేదాలున్నాయి. 2017లో ఎమ్మెల్సీ టిక్కెట్టుకై ఎ5 ప్రయత్నించి విఫలమై, టిడిపి అభ్యర్థి వద్ద డబ్బులు తీసుకుని వివేకా ఓటమికి కారకుడయ్యాడని ఆధారాలు చెప్తున్నాయి. అయితే యీ విషయం అవినాశ్‌కు తెలిసే జరిగిందని, వివేకా ఓటమిలో అవినాశ్ పాత్ర ఉందని చెప్పడానికీ ప్రత్యేక ఆధారాలు లేవు.

ఇక హత్య జరిగినట్లు చూపించే ఆధారాలను అవినాశ్ టేంపర్ చేశారు, చేయించారు అనడానికి కూడా సిబిఐ సాక్ష్యాలు చూపలేక పోయింది. రక్తాన్ని తుడిచే సమయానికి అవినాశ్ అక్కడ ఉన్నారనే అందరూ చెప్పారు తప్ప, తుడవమని ఆదేశించినట్లు, ఆ చర్యలో ప్రమేయం ఉన్నట్లు నిరూపితం కాలేదు. ఆ పని చేసినది ఎర్ర గంగిరెడ్డి అని స్పష్టంగా తెలుస్తోంది. సాక్ష్యాల చెరిపివేత వలన లబ్ధి పొందేది నలుగురు నిందితులే. చెరిపివేత వలన అవినాశ్‌కు ఏం లాభం? రక్తం తుడిచినంత మాత్రాన సాక్ష్యాలు తారుమారవుతాయా? శరీరంపై గాయాలు చూసినా హత్య అని తెలుస్తోంది కదా, యిక బయట రక్తపు మరకలు తుడిచి నిందితులు ఏ ప్రయోజనం సాధిద్దామనుకున్నారు? అని అడిగారు. నాలుగేళ్లగా అవినాశ్ సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు లేనప్పుడు బెయిలు ఎందుకివ్వకూడదు అని అడిగారు.

బెయిలు తెచ్చుకోవడం నిందితుడి ప్రాథమిక హక్కు. బెయిలు యివ్వడం విశేషం కాదు, యివ్వకపోవడమే విశేషం. ఎందుకు యిస్తున్నారో న్యాయమూర్తి చెప్పనక్కరలేదు, ఎందుకు నిరాకరిస్తున్నారో మాత్రం చెప్పాలి. ఈ విషయంలో నిరాకరించడానికి తనకు కారణాలు కనబడలేదన్నారు లక్ష్మణ్. అవినాశ్ విచారణకు సహకరిస్తున్నాడు. ఇప్పటికే ఏడు సార్లు సిబిఐ పిలిచినప్పుడు వచ్చాడు. అతని మీద ఉన్న ఆరోపణలేమిటి? పోలీసులకు గుండెపోటు అని చెప్పడం, సాక్ష్యాలు తుడిచేసేటప్పుడు అక్కడ ఉండడం! గుండెపోటు గురించి అతను యిప్పటికే తన వెర్షన్ చెప్పాడు. వివేకా పెద్ద బావమరిది శివప్రకాశ రెడ్డి తనకు చెప్పినదే తను పోలీసులకు చెప్పానని! కస్టడీలోకి తీసుకుని యింటరాగేట్ చేయవలసినంత సందర్భం తనకేమీ కనబడలేదని జజ్ ఫీలయ్యారు.

అలా అని యిక విచారణ ఆపేయవచ్చు అని ఆయనేమీ అనలేదు. శుబ్భరంగా అడిగేందుకు వీలుగా అవినాశ్‌కు అనేక షరతులు విధించారు. జూన్ నెలాఖరు వరకు ప్రతీ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ ఆఫీసుకి హాజరవ్వాలన్నారు. వాళ్లు ఎప్పుడు కోరితే అప్పుడు వచ్చి విచారణకు సహకరించాలి. దేశం విడిచి వెళ్లకూడదు.. యిలా పలు నిబంధనలతో బెయిలు యిచ్చారు. దీన్ని ఎవరూ తప్పు పట్టడానికి లేదు. అవినాశ్ విషయంలో సిబిఐ యిటీవల కాస్త హడావుడి చేసిన మాట నిజం. ఓ సోమవారం నాడు మర్నాడు ఉదయం వచ్చి హాజరవ్వు అని చెప్పడం దేనికి? ఒక్క రోజు వ్యవధిలో హాజరు కావడం నా బోటి సామాన్యుడికే కాని పని. ఏవేవో పనులుంటాయి. రాలేనని చెప్తాం. ఆ మాత్రానికే అవినాశ్ తప్పించుకుని తిరుగుతున్నాడు అని మీడియా హడావుడి చేసేసింది.

ఆయన తర్వాత వెళతానని బయలు దేరిన రోజు వాళ్ల అమ్మకు సుస్తీ చేసింది. అంతా నాటకం అని కొట్టేయడానికి లేదు. భర్త జైల్లో ఉన్నాడు. కొడుకు జైలుకి వెళ్లడం ఖాయం అని పేపర్లలో, టీవీల్లో ఊదరగొట్టేస్తున్నారు. గాబరాగా ఉండదా? 60 దాటిన వ్యక్తికి బిపి, సుగర్‌, గుండెలో బ్లాక్స్ సహజమే. తీసుకెళ్లి పరీక్షలు చేయించడంలో అసహజమేమీ లేదు. ఆ విషయమేదో చూసుకుని ఆ తర్వాత సిబిఐ యింటరాగేషన్‌కు వెళ్తాననడంలో ఆశ్చర్యమేముంది? ఇప్పటికిప్పుడు సిబిఐకి అర్జంటుగా తట్టిన ప్రశ్నలేముంటాయి? రాబట్టవలసిన సమాధానాలేముంటాయి? తల్లికి అనారోగ్యం ఉన్నపుడే వచ్చి పీకల మీద కూర్చుని నిందితుడిపై జాలి కలిగేట్లా చేయడమెందుకు? ఈ లోపుగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా! అవేమిటో లక్ష్మణ్ గారు చెప్పారు కూడా.

జజ్ గారు సిబిఐని అడిగిన మంచి పాయింటు ఏమిటంటే, ఎ1 నుంచి ఎ4 వరకు అందరికీ మోటివ్స్ స్పష్టంగా కనబడుతున్నాయి. వీరి వెనక ఉన్నవారి పేర్లలో ఆదినారాయణ రెడ్డి, రహమతుల్లా పేర్లు వినబడ్డాయి. కుటుంబ సభ్యులే చంపించారని అప్పటి ముఖ్యమంత్రి స్టేటుమెంటు యిచ్చారు. హత్యానంతరం ఎ1, ఎ2 బీరువా తెరిచి, డాక్యుమెంట్లు తీసుకున్నారని అప్రూవరు చెప్పినా వాటిని యిప్పటిదాకా ఎందుకు రికవర్ చేయలేదని అడిగారు. హత్యకు ముందు 2019 ఫిబ్రవరి 10న ఎ5 శివశంకర రెడ్డి యింట్లో జరిగిన కుట్రలో యింకో ముగ్గురు ఉన్నారన్న వివరాల జోలికి సిబిఐ ఎందుకు వెళ్లలేదు అని అడిగారు. అంతేకాదు, హత్యకు కొద్ది రోజుల ముందు ఎ1 యింటికి బ్లాక్ కలర్ బొలెరో వాహనం ఎందుకు వచ్చిందని సిబిఐ ఆరా తీయలేదేమని కూడా అడిగారు. దస్తగిరి మిత్రుడు మున్నా దగ్గర రూ.46 లక్షలు దొరికాయన్నారు. మున్నాను ఎందుకు విచారించలేదు అని అడిగారు.

దస్తగిరి తనకు కోటి రూ.లు అడ్వాన్సుగా ముట్టిందన్నాడు. దానిలో రూ.25 లక్షలు సునీల్ యాదవ్‌కు యిచ్చానన్నాడు. సిబిఐ రికవరీ చేసినది రూ.46 లక్షలు. మరి మిగతా డబ్బు ఎక్కడకు పోయిందో, దస్తగిరి ఎలా ఖర్చు పెట్టాడో, లేక వేరే ఎవరి వద్దనైనా దాచాడో సిబిఐ ఎందుకు పట్టించుకోవటం లేదు అని ‘‘సాక్షి’’ అడుగుతోంది. ఇలాటి కుటుంబ, ఆర్థిక కోణాలను వదిలేసి రాజకీయ కోణం మాత్రమే పట్టుకుని సిబిఐ వేళ్లాడడం ఆయన్ను ఆశ్చర్యపరిచింది. ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఆయన ఎబిఎన్, మహా టీవీల్లో జరిగిన చర్చల గురించి, వాటిలో ఒక తీతా, మరొకరు చేసిన వ్యాఖ్య గురించి ప్రస్తావించి ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశారు.

దానిపై యూట్యూబుల్లో చాలా చర్చలు జరిగాయి కాబట్టి వివరాల జోలికి పోవటం లేదు కానీ యిక్కడ ఓ విషయంలో జస్టిస్ లక్ష్మణ్ గార్ని మెచ్చుకుని తీరాలి. తెలుగు మీడియా (సోషల్ మీడియాతో కలిపి) ఎలా తయారైందంటే తమకు తామే కథలు అల్లేసి, ఒక స్క్రీన్‌ప్లే రాసేసుకుని, కథాగమనం దాని ప్రకారమే జరుగుతుందని పాఠకులను, ప్రేక్షకులను ఊదరగొట్టి కాబోసు అనుకునేట్టు చేస్తుంది. కానీ వాస్తవాలు వేరేలా ఉండడం చేత నెక్స్ట్ సీన్ మరోలా ఉందనుకోండి, అంతే, యిది ఘోరం, అన్యాయం, ఎవరో వచ్చి స్క్రీన్‌ప్లే మార్చేశారు. దీని వెనక్కాల పెద్ద తలకాయలున్నాయి, కుట్రలున్నాయి, రహస్య ఒప్పందాలున్నాయి అని గగ్గోలు పెట్టేస్తున్నారు. తాము చెప్పిన స్క్రీన్‌ప్లే ప్రకారం సంబంధిత వ్యక్తి నడుచుకోక పోతే అతనికి మోటివ్‌లు అంటగట్టేస్తున్నారు.

వాటిని ప్రూవ్ చేయలేరు కాబట్టి ‘నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోకపోతే నువ్వు అధముడివని అనుకుంటాం, అనుకుంటామో లేదో కానీ అలా ప్రచారం చేస్తాం’ అని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఒక యూట్యూబు వీడియోలో ఒకాయన పంచతంత్రంలో కథతో పోలిక తెచ్చారు. మేకను తీసుకుని వెళుతున్న బ్రాహ్మడికి నలుగురు దొంగలు ఒకరి తర్వాత మరొకరు ఎదురై అది కుక్క అని నమ్మించబోయారు. కుక్కో, మేకో ఎందుకొచ్చిన గొడవ, దీన్ని ఊళ్లోకి తీసుకెళితే అనవసరంగా మాట పడతాం అని మేకను వదిలేస్తాడతను. దొంగల పంట పండుతుంది. అలాగే ఉద్యోగాలిచ్చే అధికారి ప్రతిభ ఉన్న సాటి కులస్తుడిని ఎంపిక చేయడానికి జంకుతాడు. నీ కులస్తుడు కాబట్టి ఉద్యోగం యిచ్చావనే మాట పడతామోనని భయపడి అతనికి అన్యాయం చేస్తాడు. ఎవరో ఎందుకు, నా మీదా యిలా ఒత్తిడి చేస్తూంటారు. తాము అభిమానించిన పార్టీ గురించి అనుకున్న విధంగా రాయకపోతే ‘నువ్వు పేటిఎమ్ బ్యాచ్’ అంటారు.

అది ఎలాగూ ప్రూవ్ చేయలేరు కాబట్టి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. ‘మీరు యిదివరకు నిష్పక్షపాతంగా రాసేవారు, యిప్పుడు దిగజారిపోయారు. ఈ వయసులో డబ్బు కక్కుర్తితో యిలా మారడం అవసరమా?’ అని టాంట్ చేస్తారు, ‘మీమీద ఎంతో గౌరవం ఉండేది, అది పోగొట్టు కుంటున్నారు. దాన్ని మళ్లీ తెచ్చుకోవాలంటే మేం చెప్పినట్లు రాయండం’టూ ఊరిస్తారు. వాళ్లనుకున్నట్లు రాస్తేనే నేను నిష్పక్షపాతిని, రాయకపోతే పక్షపాతిని! నేను అప్పుడూ, యిప్పుడూ, ఎప్పుడూ నాకు తోచినదే రాస్తున్నాను. ఎవరి మెప్పు కోసమో పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం లేదు. పాఠకుడికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అది వారిష్టం. వారి మెప్పు కోసం మనసుకు విరుద్ధంగా రాస్తే నా వ్యక్తిత్వం మాటేమిటి? నేనేమైనా రాజకీయ నాయకుణ్నా, ఇండియన్ ఐడాల్ అభ్యర్థినా.. నాకు ఆమోదముద్ర వేయండి అని కోరడానికి? చాలాసార్లు మన ఆలోచనలకు కుటుంబసభ్యుల అంగీకారమే దొరకదు. ఇక బయటివాళ్ల సర్టిఫికెట్ల గురించి పాకులాడడం ఎంత అవివేకం?

ఇలాటి మానసిక సంఘర్షణే జస్టిస్ లక్ష్మణ్ కూడా ఎదుర్కున్నారు. తన తీర్పు రాగానే ఎల్లో మీడియా ఏమంటుందో ఆయన ఊహించారు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. మర్యాదకు పోయి, మౌనంగా ఉండకుండా తెర చించేసి, బయటకు వచ్చి నా అంతరాత్మ ప్రబోధం ప్రకారం నా విధిని నేను నిర్వర్తించాను. మీరు చేసే వ్యక్తిత్వహననాన్ని ఖాతరు చేయను అని ప్రకటించారు. న్యాయమూర్తుల విషయంలో మనం వారి తీర్పులతో విభేదించవచ్చు, వాటిని విమర్శించవచ్చు, పై కోర్టుకి వెళ్లవచ్చు. ఆ మాట కొస్తే పై కోర్టు జజ్, క్రింది కోర్టు జజ్‌ తీర్పుపై వ్యాఖ్యానిస్తారు. ‘ఆయన మైండ్ సరిగ్గా అప్లయ్ చేయలేదు’ అంటారు. అంతేకాని డబ్బు తీసుకుని లేదా ఒత్తిళ్లకు లొంగి యిలాటి తీర్పు యిచ్చారు అని మోటివ్స్ ఎట్రిబ్యూట్ చేయరు. మనమూ అనకూడదు. ఈ యింగితం లోపించినవారు టీవీ ఛానెళ్లలో వ్యాఖ్యాతలుగా అవతరించి పరిస్థితిని యింత దాకా తెచ్చారు.

ఇక కేసు గురించిన మిగతా విషయాల గురించి కూడా యీ సందర్భంలో మాట్లాడుకుందాం. అవినాశ్ చుట్టూనే కేసు తిరుగుతోంది. అతనిపై ప్రధాన ఆరోపణ సాక్ష్యాలు తారుమారు చేయడం. అది నేరమైతే సాక్ష్యాన్ని దాచడమూ నేరమే. లేఖ, సెల్‌ఫోన్ దాచి పెట్టమని చెప్పిన సునీత భర్త రాజశేఖర రెడ్డి కూడా నేరస్తుడవుతాడు. దాచడానికి రాజశేఖర రెడ్డి చెప్పిన సాకు చాలా బలహీనంగా ఉంది. లేఖ బయటపడితే డ్రైవర్ ప్రసాద్‌కు హాని తలపెడతారని భయపడ్డాం అన్నారు. వాళ్లు వచ్చిన తర్వాత బయట పెడితే మాత్రం హాని తలపెట్టేవాళ్లు మానేస్తారా? ఈయనేమైనా ఆ ప్రసాద్ ప్రాణానికి రక్షగా సుదర్శన చక్రం పట్టుకుని నిలబడతాడా? లేఖ బయటపడ్డాక ఎవరైనా ప్రసాద్‌పై దండెత్తి వచ్చారా? పోలీసులు అతనికి ఏమైనా రక్షణ కల్పించారా?

లేఖ మాట సరే, సెల్‌ఫోన్ ఎందుకు దాచమన్నారు? దానిలో ప్రసాద్‌కు హాని కలిగించే విషయమేమీ లేదు కదా! ఈ రోజుల్లో సెల్ అనేది అత్యంత ముఖ్యమైన ఆధారం కదా! చివరిగా ఎవరికి ఫోన్ చేశారు, మెసెజీలు ఏమున్నాయి? ఏ లొకేషన్లో ఉన్నారు? ఇవన్నీ దాని ద్వారానే తెలుస్తాయి కదా! దాన్ని పోలీసులకు అందకుండా చేయడంలో మతలబు ఏమిటి? దానికి ఏ సాకు చెప్తారు? ఇది బెయిలు పిటిషన్ మాత్రమే కాబట్టి లక్ష్మణ్ గారు దీని విషయమై అడగలేదు కానీ కేసు విచారణకు వచ్చినపుడు దీని విషయమై డిఫెన్సు లాయరో, న్యాయమూర్తో తప్పకుండా అడుగుతారు. సునీత, భర్త ఫోన్‌ను పోలీసులకు అప్పగించేముందు దానిలో సమాచారాన్ని తుడిచేసి మరీ యిచ్చారు అని ‘‘సాక్షి’’ రాస్తోంది. నిజమో కాదో ఈ విషయమై సిబిఐ ఏ క్లారిఫికేషనూ యివ్వలేదు.

వివేకా ఫోన్ ద్వారా సేకరించిన సమాచారం ఏమిటో తెలియదు. దానిలో మెసేజిలను చూస్తే బెంగుళూరు సెటిల్‌మెంటు లావాదేవీలు, రంగురాళ్ల గొడవ, షమీమ్‌తో జరిగిన సంభాషణలు అన్నీ తెలుస్తాయి. ఎంతసేపూ అవినాశ్ ఫోన్ డేటా గురించే మాట్లాడుతున్న సిబిఐ వివేకా ఫోన్ గురించి మాట్లాడటం లేదు. తన చార్జిషీటులో ఏమైనా చెప్పిందేమో తెలియదు. ఆ డాక్యుమెంట్లు చేజిక్కించుకుంటే కాస్త క్లారిటీ వస్తుంది. బెంగుళూరు డాక్యుమెంట్లయితే ఆర్థిక కోణం, షమీమ్ పేర రాసారని చెప్తున్న యింటి డాక్యుమెంట్లయితే ఫ్యామిలీ కోణం బయటకు వస్తాయి.

బెంగుళూరు డాక్యుమెంట్లు బోగస్‌వి అని యిప్పటికే అన్నారు కాబట్టి, పనికిరాని డాక్యుమెంట్లు ఎందుకు తీసుకుంటారు? అనే కోణంలో ఆలోచిస్తే, అవి షమీమ్‌ పేరన రాసిన డాక్యుమెంట్లు కావాలి. అలా అయితే ఫోకస్ కూతురు, అల్లుడు మీద పడుతుంది. ఎందుకంటే వాటి వలన నిందితులకు వ్యక్తిగత లాభం లేదు. వాళ్లు కిరాయి హంతకులుగానే తేలతారు. ఆ డాక్యుమెంట్లు షమీమ్‌కు చేరకుండా ప్రయత్నించినవారు కుటుంబసభ్యులే అవుతారు. మున్నా వద్ద దొరికిన డబ్బుకి సోర్స్ ఎక్కడిది అనేది సిబిఐ చెప్పలేక పోతోంది. ఆ తీగ పట్టుకుని లాగితే డొంక కదులుతుంది.

ఇక మరో కీలకమైన వ్యక్తి వివేకా పెద్ద బావమరిది శివప్రకాశరెడ్డి. ఆయనకు ఎప్పుడు తెలిసింది, ఎవరెవరికి ఫోన్ చేశారు, మృత్యుకారణం ఏమిటని చెప్పారు అనే విషయమే సిబిఐ చెప్పటం లేదు. గుండెపోటు కారణంగా మరణం అని చెప్పినందుకు ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాశ్‌ ఆ విషయం తనకు చెప్పినది శివప్రకాశ్ అని చెప్పినపుడు, అప్పటి టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి కూడా తనకూ గుండెపోటు అనే శివప్రకాశ్ చెప్పారని చెప్పినపుడు, ‘అలా చెప్పారా? ఎందుకు చెప్పారు? ఎప్పుడు చెప్పారు?’ అని సిబిఐ సూర్యప్రకాశ్‌ను అడిగి వుండాలి. ఆయన సమాధానమేమిటో యిప్పటిదాకా మీడియాలో రాలేదు. ఇవేమీ అందుబాటులో లేనిదే మనలాటి సామాన్యులు హత్య ఎలా జరిగిందో ఊహించడం కష్టం. అందువలన ఎవరికి వారే ఊహించుకునే ఆస్కారం ఏర్పడుతోంది.

ముందస్తు బెయిలు యిస్తూ జస్టిస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల ప్రకారం సిబిఐ విచారణ సక్రమంగా జరగటం లేదని మాత్రం అందరికీ అర్థమైంది. నిజానికి ఆయన అడిగినవి కామన్‌సెన్స్ పాయింట్లు. అవి కూడా దానికి తట్టలేదంటే కావాలనే అలా చేస్తోందా అనే సందేహమూ కలుగుతోంది. సంస్థ పరంగా సిబిఐను తప్పుపట్టేస్తున్నాం కానీ, లోతుగా వెళితే దానిలోని వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ప్రవర్తించారని అర్థమౌతోంది. సుధా సింగ్ రాజకీయ కోణంలో పస లేదని పక్కకు పెట్టి ఆర్థిక కోణం (మర్డర్ ఫర్ గెయిన్) కారణమని చెప్తే, రాంసింగ్ వచ్చి కథ పూర్తిగా మార్చేసి రాజకీయ కోణాన్నే పట్టుకుని తక్కినవి వదిలేసినట్లు తేలుతోంది. ఆయన ప్రవర్తనపై చాలామందే ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టుకి కూడా ఆయన తీరు నచ్చలేదు. అందుకే కొత్త టీముకి వేరే వాళ్లను నేతృత్వం వహించమంది.

కానీ వీళ్లు కూడా ఆయన నోట్సు ప్రకారమే తమ వాదన వినిపించి, కోర్టులో ప్రశ్నలు ఎదుర్కుంటున్నారు. ఈ నెలాఖరులోగా తుది చార్జిషీటు వేయాలంటే, వీళ్లు యిప్పటికైనా కొత్త ఆధారాలు చూపించాలి. సగంలో వదిలేసిన దారాలను కొస దాకా తీసుకుని వచ్చి ముడివేయాలి. కానీ ఆ పని చేస్తారా, లేక యిలాగే తప్పులతడకల వాదనలతో ముందుకు సాగుతారా అన్నది వేచి చూడాలి. నేను యిటీవల రాసిన ‘వివేకా హత్య కేసు తేలేనా?’ అనే వ్యాసంలో వెలిబుచ్చిన సందేహాలు నిజమైనా నేను ఆశ్చర్యపడను. గతంలో కూడా చెప్పాను. పెద్దవాళ్లు యిన్వాల్వ్ అయిన కేసుల్లో విచారణ సంస్థలు వింతగా ప్రవర్తిస్తాయి. ఎవడైనా ఓ అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకుంటే వాడిపై ఆ మేరకు కేసు పెడితే, గెలవవచ్చు. కానీ యీ సంస్థలు ఆమెను మానభంగం చేశాడు అని కేసు పెడతాయి. దానికి ఆధారాలు చూపలేవు, చూపవు. కోర్టువారు కేసు కొట్టేస్తారు. అదే ఆ సంస్థకు కావలసినది! ముద్దు పెట్టాడనే కేసు పెడితే ఆధారాలు దొరుకుతాయి, ఆ మేరకు శిక్ష పడుతుంది. కానీ ముద్దాయిని కాపాడాలంటే పెద్ద కేసు పెట్టాలి, అది వీగిపోయేట్లు చేయాలి.

ఇప్పుడు యీ కేసులో కూడా అవినాశ్ పైనే దృష్టి పెట్టి కేసు ముందుకు నడిపిస్తే ఏమవుతుంది? ఇదిగో యిప్పుడు జస్టిస్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలనే విచారణ సమయంలో కోర్టు కూడా అడుగుతుంది. అవినాశ్ హార్ట్ ఎటాక్ అని మొదట్లోనే చెప్పినా, సునీత అతనిపై అప్పుడే ఎందుకు అనుమానం వ్యక్తం చేయలేదు? చంద్రబాబు మీదనే ఎందుకు ఆరోపణలు చేసింది? ఆ సందర్భంగా దిల్లీ వెళ్లినపుడు అవినాశ్ క్వార్టర్స్‌లో ఎందుకుంది? అవినాశ్‌కు టిక్కెట్టు ఖాయమైందని, తన తండ్రికి ఆ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు కాబట్టే అతని తరఫున పొద్దుపోయేదాకా ప్రచారం చేశాడని ఎందుకు చెప్పింది? అలాటి మనిషి యిప్పుడు అవినాశ్‌పై వేలెందుకు చూపుతోంది? ఈ కోణంలో దర్యాప్తు ఎందుకు చేయలేదు? అని ఆ న్యాయమూర్తి అడిగి, ‘రాజకీయ కోణం బలహీనంగా ఉంది, అవినాశ్‌ను నిర్దోషిగా విడుదల చేస్తున్నాం, తక్కిన కోణాలలో విచారించి, ఫ్రెష్‌గా చార్జిషీటు వేయండి’ అని సిబిఐను ఆదేశించవచ్చు.

అప్పుడు సిబిఐ మళ్లీ విచారణ చేపడుతుందా? అబ్బే, ‘ఇప్పటికే దీనిపై చాలా కాలాన్ని, శ్రమను వెచ్చించాం. సిబ్బంది కొరత ఉంది. కొత్త కేసులు వచ్చి పడుతున్నాయి. వీలున్నపుడు చూస్తాం.’ అనేసి అటకెక్కించేస్తారు. ఆ పాటికి 2024 ఎన్నికలు అయిపోయి ఉంటే, దీనిలోంచి పిండదగిన రాజకీయ ప్రయోజనం యింకేమీ కనబడక, టిడిపి వైసిపి రెండిటికీ దానిపై ఆసక్తి పోతుంది,. తవ్విన కొద్దీ వివేకా సెటిల్‌మెంట్ వ్యవహారాలు, స్త్రీలోలత్వం బయటకు వచ్చి వైయస్ రాజారెడ్డి కుటుంబం పరువు పోతుందని, ప్రత్యర్థులు ఎద్దేవా చేయడానికి పనికి వస్తుందని అనుకుని కుటుంబమంతా గప్‌చుప్ అయిపోతారు. హత్య చేయించినవారు ముసుగులోనే ఉండిపోతారు. వాళ్ల పేర్లు బయటకు రావు. అనేక అపరిష్కృత కేసుల్లో ఒకటిగా యిది మిగిలిపోవచ్చు.  (సశేషం) 

- ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2023)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా