రావణుడ్ని ఎందుకు దాస్తున్నారు?

ఆదిపురుష్ సినిమా నుంచి రాఘవుడి లుక్ వచ్చేసింది, జానకి లుక్ కూడా బయటకొచ్చింది. చివరికి లక్ష్మణుడు, హనుమంతుడి లుక్స్ కూడా రివీల్ చేశారు. ఇక రెండు ట్రయిలర్స్ లో దాదాపు అందర్నీ చూపించారు. కానీ…

ఆదిపురుష్ సినిమా నుంచి రాఘవుడి లుక్ వచ్చేసింది, జానకి లుక్ కూడా బయటకొచ్చింది. చివరికి లక్ష్మణుడు, హనుమంతుడి లుక్స్ కూడా రివీల్ చేశారు. ఇక రెండు ట్రయిలర్స్ లో దాదాపు అందర్నీ చూపించారు. కానీ ఇప్పటివరకు రావణుడి పాత్రధారి సైఫ్ అలీఖాన్ లుక్ ను మాత్రం బయటపెట్టలేదు. ఎందుకు..?

నిజానికి ఈ రెండు ట్రయిలర్స్ లో సైఫ్ అలీఖాన్ ఉన్నాడు. రావణుడి పాత్ర ప్రస్తావన కూడా ఉంది. కానీ అది రావణ్ లుక్ కాదు. సీతను అపహరించడానికి మారువేషంలో వచ్చిన రావణుడి లుక్ మాత్రమే. అంటే.. రావణుడి ఒరిజినల్ గెటప్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఇంకా బయటపెట్టలేదన్నమాట.

వివాదాలకు దూరంగా ఉండేందుకేనా..

టీజర్ లో రావణుడ్ని చూపించిన విధానం చాలామందికి నచ్చలేదు. ఓ వింత పక్షిపై, వికృతమైన గెటప్ లో రావణుడ్ని చూపించారు. మరీ ముఖ్యంగా ఇంకో వర్గానికి చెందిన వ్యక్తిగా రావణుడ్ని చూపించే ప్రయత్నం జరిగింది. టీజర్ లో రావణుడి వాహనాన్ని కూడా తప్పుగా చూపించిన విషయం తెలిసిందే.

అప్పట్లో వీటిపై చాలా చర్చ జరిగింది. సరిగ్గా అప్పట్నుంచే రావణుడి గెటప్ ను బయటపెట్టకుండా జాగ్రత్తపడింది యూనిట్. రావణుడు కూడా హిందువేనని, మరీ ముఖ్యంగా పరమశివుని భక్తుడని, అతడి లుక్ ను మార్చాల్సిందేనంటూ టీజర్ రిలీజ్ టైమ్ లో డిమాండ్స్ వినిపించాయి. మరి ఆ లుక్ ను మార్చారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఎన్నో అంచనాలో.. మరెన్నో వివాదాలు..

ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే మూవీపై ఎన్ని అంచనాలున్నాయో, అదే స్థాయిలో వివాదాలు కూడా చెలరేగుతున్నాయి. రాముడి మీసాలపై, సీత చూడామణిపై, హనుమంతుడికి మీసాలు లేకపోవడంపై.. ఇలా రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రావణుడి గెటప్ ను విడుదల చేస్తే, అది మరిన్ని వివాదాలకు దారితీసే ప్రమాదముందని యూనిట్ భావించి ఉండొచ్చు.

అయితే మైథలాజికల్ మూవీ తీసినప్పుడు దాచిపెట్టడానికేం ఉండదు. ఇప్పుడు కాకపోతే, థియేటర్లలోకి వచ్చిన తర్వాతైనా ఇలాంటి అంశాలపై సినిమా వివాదాస్పదమౌతుంది. సో.. ఆదిపురుష్ లో రావణుడి గెటప్ వివాదాస్పదమవ్వకూడదనే కోరుకుందాం.