తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఒక పట్టాన ఎవరికీ అంతుబట్టవు. ఎప్పుడు, ఎలా అడుగులు వేస్తారో ఆయనకు తప్ప మరొకరికి తెలియదు. ఈ నేపథ్యంలో తన ఫాంహౌస్‌లో మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అత్యవసర భేటీ సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కేసీఆర్‌తో భేటీకి అత్యవసరంగా ఫాంహౌస్‌కు రావాలని ప్రగతి భవన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో మంత్రులంతా అటు వైపు క్యూ కట్టారు. మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు కూడా కాల్స్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఉన్నారని సమాచారం. అలాగే మరో మంత్రి నిరంజన్‌రెడ్డి కూడా తెలంగాణ వెలుపల ఉన్నట్టు తెలిసింది.
ఇక మిగిలిన మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులంతా ఫాం హౌస్‌కు వెళ్లారు. వీరితో పాటు సీఎస్ సోమేష్‌కుమార్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఇదే ఫాంహౌస్‌లో కేసీఆర్ సమావేశం కావడం, ఆ తర్వాత సర్వే చేయించారని, నివేదిక కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేటి అత్యవసర భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎంతో ముఖ్యమైన అంశం లేకపోతే, ఇంత అత్యవసరంగా కేసీఆర్ పిలిపించి వుండేవారు కాని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఏదైనా ఉందా? అనే చర్చకు తెరలేచింది. గతంలో కూడా ఇలాగే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చారు. అదే సెంటిమెంట్‌ను మరోసారి కొనసాగించనున్నారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.