వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అన్ని రకాల దుష్ప్రచారాలను చేశారు. అయినప్పటికీ 2019లో అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు జగన్ పాలన సవ్యంగా సాగడాన్ని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా జీర్ణించుకోలేకున్నాయి. ఆర్థికంగా దెబ్బతీసి తద్వారా ప్రజలకు, రాష్ట్రానికి ఎలాంటి మంచి జరగకూడదని కోరుకుంటున్న శక్తులు ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిపోతున్నాయి. ఏపీలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందనే ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్‌కు సంబంధించి మరో ఆర్థిక మోసాన్ని బయట పెట్టామని టీడీపీ చంకలు గుద్దుకుంటోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్‌ను తెరపైకి తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 377 నిబంధన కింద టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రస్తావించిన అంశాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక సమాచారాన్ని అడ్డు పెట్టుకుని ఏపీ సర్కార్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని విమర్శిస్తున్నారు.
ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించినట్టు కాగ్ నిర్ధారించిందని కేంద్ర ఆర్థికశాఖ సమాధానం ఇచ్చింది. వైఎస్ గృహ వసతి ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారనేది సారాంశం. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులను మళ్లించారని కాగ్ నివేదిక ఇచ్చిందట. కష్టాల్లో ఉన్న పేదలు, రైతులకు ప్రయోజనాలే తప్ప నిబంధనలతో పనిలేదు.
అంతిమంగా మంచి జరుగుతున్నదనే వాస్తవాన్ని కాగ్ నివేదిక కూడా తెలియజేస్తోంది. ఏపీ సర్కార్‌పై విమర్శలు చేయడానికి ఇలాంటి నివేదికలు పనికొస్తాయో తప్ప, మరెందుకూ ఉపయోగపడవు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఆర్థిక అంశాల్లో ఏపీ సర్కార్‌ను దోషిగా నిలబెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తున్న సంగతిని రామ్మోహన్‌నాయుడి వివరాలతో వెల్లడవుతోంది. అయితే అన్ని విధాలా రాష్ట్ర ప్రజలకు ఆర్థిక చేయూత అందించేందుకే ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తోందని తెలుస్తోంది.