తమిళ సినిమా తెరి విడుదలైనప్పుడు దానిపై భారీ హైపే ఉన్నా, విడుదలైన తర్వాత మాత్రం ఆ సినిమా పట్ల తెలుగు నుంచి పెదవి విరుపే వినిపించింది. పోలీసోడు పేరుతో ఆ సినిమా తెలుగులో విడుదలైనట్టుంది. వాస్తవానికి ఆ సినిమా ఎప్పుడో 90లలో తమిళులే వాడేసిన థీమే. అప్పట్లో మణిరత్నం కంపెనీ నుంచి విజయ్ కాంత్ హీరోగా వచ్చిన ఛత్రియన్ లైన్ లోనే తెరి సాగుతుంది.
తమిళనాట తెరి మంచి హిట్ అయ్యింది. తెలుగు వెర్షన్ మాత్రం పెద్దగా ఆడలేదు. అయితే ఆ సినిమాపై తెలుగు హీరోలకు కన్నుందనే వార్తలు తరచూ వస్తున్నాయి. ఆ సినిమా విడుదలై ఇప్పటికే ఆరేళ్లు గడిచినా.. దాన్ని తెలుగులో రీమేక్ చేయడం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల పాటు రవితేజ ఆ సినిమాను రీమేక్ చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పేరు వినిపిస్తోంది.
ఆ సినిమా రీమేక్ గురించి పవన్ అప్పట్లోనే ప్రయత్నంలో ఉన్నట్టుగా టాక్ వినిపించింది. అది కార్యరూపం దాల్చలేదు కానీ, ఈ సారి మాత్రం పవన్ ఆ సినిమాను రీమేక్ చేయడం ఖాయమట. ఎన్నికల్లోగా వీలైనన్ని సినిమాలు చేసేలా ఉన్న పవన్ కల్యాణ్, ఇదే వేగంలో తెరి రీమేక్ కూడా చేసేయవచ్చు కూడా!
ఆ సంగతలా ఉంటే.. ఈ సినిమా హిందీ రీమేక్ ప్రయత్నాలు ఊపందుకున్నాయని సమాచారం. వరుణ్ ధావన్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఒరిజినల్ వెర్షన్ ను తీసిన అట్లీ దర్శకత్వంలోనే ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని సమాచారం.
విశేషం ఏమిటంటే.. ఒక దశలో తెరిని షారూక్ ఖాన్ కూడా రీమేక్ చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. అట్లీ దర్శకత్వంలో షారూక్ ఈ సినిమాను తీస్తాడనే టాక్ వచ్చింది. అయితే ఈ కాంబోలోనే ఆ తర్వాత వేరే కథతో సినిమా మొదలైంది. ఇది పూర్తి కాగానే.. తెరి హిందీ వెర్షన్ కు అట్లీ దర్శకత్వం వహించనున్నాడట.