తెలంగాణలో ఈమధ్యే టికెట్ రేట్లు ఒకసారి పెంచారు. ఆమధ్య శ్రీవిష్ణు సినిమాకు కూడా 320 రూపాయల టికెట్ అనేసరికి ఓ రేంజ్ లో విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు మరోసారి తెలంగాణలో టికెట్ రేట్లు పెంచారు. ఈసారి ప్రత్యేకంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జీవో విడుదల చేసింది కేసీఆర్ సర్కారు. తెలంగాణ అంతటా ఈ సినిమా కోసం అదనంగా వంద రూపాయల వరకు ఛార్జ్ చేసుకోవచ్చనేది ఈ జీవో సారాంశం. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విమర్శలు చెలరేగుతున్నాయి.
తెలంగాణలో ఆల్రెడీ గరిష్ట టికెట్ ధర 295 రూపాయలుంది. బుక్ మై షోలో ఈ టికెట్ బుక్ చేసుకుంటే అటుఇటుగా 330 రూపాయలు అవుతోంది. ఇప్పుడు దీనికి అదనంగా గరిష్ఠంగా వంద రూపాయల వరకు పెంచుకోవచ్చంటోంది కొత్త జీవో. అంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణలో గరిష్టంగా టికెట్ ధర 430 వరకు ఉండబోతోంది. ఇది అధికారికంగా మాత్రమే. మల్టీప్లెక్సులు కాస్త కక్కుర్తిపడి రౌండాఫ్ చేస్తే 450 రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇలా తలా ఒక్కింటికి 430 రూపాయలు టికెట్ అంటే.. కుటుంబం అంతా కలిసి ఆర్ఆర్ఆర్ చూడాలంటే వేలకు వేలు వదిలించుకోవాల్సిందే. అయితే అన్ని సినిమాలకు ఈ జీవో వర్తించదని, ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ సినిమా కాబట్టే ప్రత్యేక జీవో విడుదల చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను 336 కోట్ల రూపాయల బడ్జెట్ (రెమ్యూనరేషన్లు, జీఎస్టీ కాకుండా) అయింది కాబట్టి వంద రూపాయలు పెంచుకోమన్నారు. మరి భవిష్యత్తులో వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కితే, దానికి వెయ్యి రూపాయల టికెట్ పెట్టుకోమంటారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఇలా..!
తాజా జీవో ప్రకారం తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఇలా ఉండబోతోంది. విడుదల రోజు నుంచి మొదటి 3 రోజులు (ఫస్ట్ వీకెండ్) రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్ ధరను 50 రూపాయలు పెంచుకోవచ్చు. మొదటి వారాంతం తర్వాత 7 రోజుల పాటు ప్రతి థియేటర్ లో గరిష్టంగా 30 రూపాయల వరకు పెంచుకోవచ్చు. ఈ విషయంలో ఎ-సెంటర్, బి-సెంటర్, సి-సెంటర్ అనే తేడాల్లేవు. ఫ్లాట్ గా పెంచుకోవచ్చన్నమాట.
అయితే రిక్లయినర్ సీట్ల విషయంలో మాత్రం పెంపు ఇంకాస్త ఎక్కువ ఉంది. విడుదలైన తొలి 3 రోజులు రిక్లెయినర్ సీట్లపై వంద రూపాయలు పెంచుకోవచ్చు. ఆ తర్వాత వారం రోజుల పాటు 50 రూపాయలు పెంచుకోవచ్చు. ఈ విషయంలో ఏపీ, నాన్-ఏసీ మధ్య తేడా కూడా చూపించలేదు ప్రభుత్వం.
వీటికితోడు విడుదల రోజు నుంచి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్స్ తో రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఇలా ఆర్ఆర్ఆర్ కోసం కొత్తగా జీవో విడుదల చేసి మరీ గేట్లు బార్లా తెరిచేశారు. ఇప్పుడీ రేట్ల పైన బుక్ మై షో.. తన కన్వేయన్స్ ఫీజు కూడా వేసుకొని, మరికొద్దిసేపట్లో బుకింగ్స్ ఓపెన్ చేయబోతోంది. సో… 600 రూపాయలు ఎకౌంట్లో పెట్టుకొని 2 సీట్లు బుక్ చేసేద్దాం అనుకుంటే అది మీ భ్రమే అవుతుంది.