వైసీపీ ఎంపీ కుమారుడికి సుప్రీంకోర్టు షాక్‌!

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి కుమారుడు రాఘ‌వ‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఆయ‌న్ను ఈడీ అరెస్ట్ చేసింది. అప్ప‌టి నుంచి ఆయ‌న జైల్లో ఉన్నారు.…

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి కుమారుడు రాఘ‌వ‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఆయ‌న్ను ఈడీ అరెస్ట్ చేసింది. అప్ప‌టి నుంచి ఆయ‌న జైల్లో ఉన్నారు. అమ్మ‌మ్మ అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న‌కు ఢిల్లీ హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్‌ను రెండు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. దీన్ని స‌వాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు  రాఘవరెడ్డి మద్యంతర బెయిల్‌ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 12వ తేదీలోపు లొంగిపోవాల‌ని ఆదేశించడం గ‌మ‌నార్హం. దీంతో రాఘ‌వ‌రెడ్డికి ఊర‌ట మూణ్ణాళ్ల ముచ్చ‌టైంది. ఢిల్లీ హైకోర్టులో మ‌ధ్యంత‌ర బెయిల్‌ను అడ్డుకునేందుకు ఈడీ శ‌క్తివంచ‌న లేకుండా వాదించింది.  

మాగుంట అమ్మ‌మ్మ బాగోగులు చూసుకోడా నికి చాలా మంది ఉన్నారంటూ ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాద‌న‌లు వినిపించింది. అయితే ఈడీ వాద‌న‌లు ప‌ట్టించుకోకుండా రెండు వారాల పాటు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసింది.

ఈ ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈడీ పిటిష‌న్ వేసింది. ఈడీ వాద‌న‌ల‌తో సుప్రీంకోర్టు ఏకీభ‌వించింది. ఢిల్లీ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేసింది. దీంతో మాగుంట రాఘ‌వ‌రెడ్డికి చుక్కెదురైంది. ఐదు నెల‌లుగా ఆయ‌న జైల్లోనే వుంటున్నారు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి అన్న శ‌ర‌త్‌చంద్రారెడ్డి అప్రూవ‌ర్‌గా మారారు. ప్ర‌స్తుతం ఆయ‌న బెయిల్‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే.