ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓవరాక్షన్ చూడలేకపోతున్నామనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తానేదో తెలంగాణలో అధికారాన్ని దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉన్నాననే రీతిలో పొంగులేటి బిల్డప్ ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విభేదించిన పొంగులేటి… కొన్ని నెలలుగా రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఆత్మీయ సమావేశాల పేరుతో జనానికి చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు.
ఆత్మీయ సమావేశాల్లో తన తరపున ఫలానా అభ్యర్థి పోటీ చేస్తారని కూడా ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీంతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సొంత పార్టీ పెడుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. మొట్టమొదట వైసీపీ తరపున ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. వైసీపీ తరపున ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పొంగులేటి గెలుపొందారు. అనంతరం తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ వైపు ఆయన వెళ్లారు.
2019లో పొంగులేటికి కేసీఆర్ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎంపీ అయిన తనకు టికెట్ ఇవ్వలేదనే కోపం పొంగులేటిలో ఉంది. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఇక రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోవాలని ఆయన భావించారు. బీఆర్ఎస్‌పై విమర్శలు మొదలు పెట్టారు. చివరికి ఆయన్ను బీఆర్ఎస్ బహిష్కరించింది. అయితే ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఆయన సస్పెన్స్ మెయింటెన్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పొంగులేటి తదుపరి రాజకీయ అడుగులపై రకరకాల ప్రచారం జరిగింది.
వైఎస్ షర్మిల పార్టీలోకి పోతారనే కొంత కాలం అనుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ, సొంత పార్టీ… ఇలా కాలం గడిచేకొద్ది పొంగులేటికి సంబంధించి అనేక పార్టీలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ మార్పుపై ఎక్కువ రోజులు సమయం తీసుకోనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో చేరుతానని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ మాత్రం సంబరానికి ఇంత డ్రామా అవసరమా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.