పొత్తులపై ఇంకా చర్చల దశలో ఉండగానే జనసేనను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చావు దెబ్బతీసింది. జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు నిద్రలేని రాత్రుల్ని టీడీపీ మిగిల్చింది. పొత్తులో భాగంగా తెనాలి నుంచి పోటీ చేయాలని నాదెండ్ల ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదుర్చడంలో నాదెండ్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని జనసేనలోని మెజార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.
సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్‌కల్యాణ్ జనంలోకి వెళితే ఆదరణ లభిస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు నమ్ముతున్నారు. అయితే పొత్తు లేకుండా వెళితే తెనాలి నుంచి తాను గెలవలేనని నాదెండ్ల భయపడుతున్నారు. అలాగే పవన్‌ను కూడా ఇదే రీతిలో నాదెండ్ల భయపెడుతున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఒంటరిగా వెళితే 2019లో మాదిరిగానే మరోసారి ఓటమి ఖాయమని పవన్‌ను నాదెండ్ల పదేపదే హెచ్చరిస్తున్నారని సమాచారం.
నాదెండ్లను గుడ్డిగా పవన్ నమ్ముతూ, మోసపోతున్నారని జనసేన నేతల అభిప్రాయం. పవన్‌కు నమ్మకంగా ఉంటూ, ఆయన్ను వెన్నుపోటు పొడుస్తున్నారని జనసేన ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాలన్నీ తెలిసే, ఇటీవల పవన్ బహిరంగంగానే నాదెండ్లకు మద్దతుగా నిలిచారు. నాదెండ్లను ఎవరైనా ఒక్క మాట విమర్శించినా పార్టీ నుంచి బయటికి పంపుతానని వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మధ్య సాగుతున్న చర్చలతో సంబంధం లేకుండానే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తెనాలి నుంచే పోటీ చేస్తానని బహిరంగ ప్రకటన చేయడంతో నాదెండ్ల మనోహర్ అవాక్కయ్యారు. పొత్తు పెట్టుకుంటే తనకు సీటు గ్యారెంటీ అని ఇన్నాళ్లు నాదెండ్ల నమ్మకంగా వుంటూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకుల అభిప్రాయాలు భిన్నంగా వున్నాయని ఆలపాటి రాజా వ్యాఖ్యలతో నాదెండ్లకు తెలిసొచ్చింది.
ఆలపాటి రాజా కామెంట్స్‌ను పవన్‌కల్యాణ్ దృష్టికి నాదెండ్ల తీసుకెళ్లినట్టు సమాచారం. తనకే సీటు లేకపోతే, రేపు మీరు పోటీ చేసినా మరొక నాయకుడిని చంద్రబాబు నిలుపుతారనే అనుమానాల్ని పవన్ ఎదుట నాదెండ్ల పెట్టినట్టు తెలిసింది. దీంతో పొత్తు పెట్టుకుని, నట్టేట ముంచేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తారనే సందేహాలు పవన్, నాదెండ్ల మనోహర్‌లో కలుగుతున్నాయి. మరోవైపు ఆలపాటి రాజాతో పాటు టీడీపీ నేతల అభిప్రాయాలు ఆలోచన రేకెత్తిస్తున్నాయి. తెనాలితో నాదెండ్ల బంధం తెగిపోయి చాలా కాలమైందని, ఆయన పోటీ చేస్తే మరోసారి వైసీపీ విజయం ఖాయమని ఆయన అంటున్నారు.
తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడూ పర్యటించకుండా, పొత్తులో భాగంగా టీడీపీ బలాన్నంతా జనసేన గెలుపు కోసం వాడుకుంటామంటే ఎలా అని ఆలపాటి ప్రశ్నిస్తున్నారు. తెనాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కోరుకుంటున్న అన్ని సీట్లలోనూ టీడీపీ ఇన్‌చార్జ్‌లు ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. టీడీపీ అధికారంలో లేకపోయినా, పార్టీని కాపాడుకునేందుకు నాలుగేళ్లుగా ఎన్నెన్నో కష్టనష్టాలు పడుతున్న తాము, అప్పనంగా జనసేన కోసం నాయకత్వాన్ని బలిపెట్టాలంటే కుదరదని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు తెగేసి చెబుతున్నారు.