మిషన్ రాయలసీమ పేరుతో నారా లోకేశ్ హడావుడి చేయడంపై రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. లోకేశ్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరో రాయించిన స్క్రిప్ట్‌ను లోకేశ్ చదువుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ రాయలసీమ పేరుతో లోకేశ్ నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రైవేట్ ఈవెంట్‌తో శ్రీకాంత్‌రెడ్డి పోల్చారు.
రాయలసీమలో అభివృద్ధిని వైఎస్సార్‌కు ముందు, ఆ తర్వాత అని చూడాల్సి వుంటుందన్నారు. టీడీపీ హయాంలో పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేదని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి టీడీపీకి మాట్లాడే నైతిక అర్హత లేదని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. రాయలసీమకు అన్యాయం చేసిన పాలకులుగా ముక్కు నేలకు రాసి సీమ ప్రజానీకానికి తండ్రీకొడుకులు క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రెండు రోజుల్లో రాయలసీమలో లోకేశ్ పాదయాత్ర పూర్తి కానుందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతానికి చేసిన మోసానికి బాధ్యత వహించి చంద్రబాబును లోకేశ్ పిలిపించి క్షమాపణ చెప్పించాలని ఆయన కోరారు. గతంలో చంద్రబాబుకు మూడుసార్లు అవకాశం ఇస్తే రాయలసీమకు ఏం చేశారని గడికోట నిలదీశారు. రాయలసీమను ఉద్ధరిస్తామంటే జనం నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుని, ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమకు ఏమీ చేయకుండా ఇప్పుడు ఆరోపణలు చేయడం సబబా అని శ్రీకాంత్ ప్రశ్నించారు. బాధ్యత లేని తండ్రీకొడుకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు రాకుండా సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం చేశారని విమర్శించారు. అలాగే రాయలసీమ ప్రజలకు వ్యతిరేకంగా సినిమాలు తీయించి కించపరిచారని, ఇందుకు క్షమాపణ చెప్పాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.