నిత్యం దైవచింతనలో ఉండే పూజారి హత్య చేశాడంటే నమ్ముతామా? భగవంతుడికి, భక్తుడికి అనుసంధానంగా ఉండే అర్చకుడు, అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే తట్టుకోగలమా? ఈ రెండూ చేసిన ఓ పూజారి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.
సరూర్ నగర్ కు చెందిన సాయికృష్ణకు అప్సర పరిచయమైంది. ఈమెతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే సాయికృష్ణకు ఆల్రెడీ పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్సర మాత్రం తగ్గలేదు. తనతో సంబంధం పెట్టుకున్న సాయికృష్ణను పెళ్లాడమంటూ వెంటపడింది.
దీంతో అప్సర అడ్డు తొలిగించుకోవాలని డిసైడ్ అయ్యాడు సాయికృష్ణ. 3 రోజుల కిందట అప్సరను కారు ఎక్కించుకున్నాడు. శంషాబాద్ లోని సుల్తాన్ పల్లికి తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి విషయంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సాయికృష్ణ కోపం పెరిగింది. పక్కనే ఉన్న రాయి తీసుకొని, అప్సర తలపై గట్టిగా కొట్టాడు.
అప్సర చనిపోయిందని నిర్థారించుకున్న తర్వాత, తన కారులోనే మృతదేహాన్ని శంషాబాద్ నుంచి సరూర్ నగర్ తీసుకొచ్చాడు. స్థానిక డిగ్రీ కాలేజీ వద్ద ఉన్న మ్యాన్ హోల్ లో పడేశాడు. దాన్ని కాంక్రీట్ తో కప్పేశాడు. ఆ తర్వాత తిరిగి శంషాబాద్ వచ్చి, తన మేనకోడలు అప్సర కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే కేసు నమోదుచేసిన పోలీసులు తమ విచారణను సాయికృష్ణ నుంచే మొదలుపెట్టారు. అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేశారు. సీసీటీవీ ఫూటేజ్ ను బయటకుతీశారు. దీంతో గంటల వ్యవథిలో సాయికృష్ణ చేసిన హత్య బయటకొచ్చింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు.
విచారణలో జరిగింది మొత్తం చెప్పేశాడు పూజారి సాయికృష్ణ. అంతేకాదు, చనిపోయిన అప్సర, అతడికి మేనకోడలు కూడా కాదు. కేవలం గుడిలో ఓ భక్తురాలిగా మాత్రమే పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు.
అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ వద్దకు చేరుకున్నారు పోలీసులు. జేసీబీ సహాయంతో కాంక్రీట్ ను తొలిగించి, అందులోంచి అప్సర మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు పంపించారు. ఏకంగా పూజారే హత్యకు పాల్పడడం స్థానికంగా సంచలనంగా మారింది.