ఏపీ బీజేపీలో టీడీపీ శ్రేయోభిలాషుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికై, ఏపీలో అధికారం పోగానే రాత్రికి రాత్రి బీజేపీలోకి నలుగురు జంప్ కావడం వెనుక చంద్రబాబు ఉన్నారనేది బహిరంగ రహస్యమే. చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు బీజేపీని నాశనం చేయడానికైనా ఆ నాయకులు వెనుకాడరు. అయితే ఏపీలో బీజేపీ నామమాత్రమే అని, ఇంకా ఏముందని ఆ పార్టీని ముంచాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఎంపీ సీఎం రమేశ్నాయుడిపై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీలో వుంటూ, చంద్రబాబు వ్యూహాల్ని అమలు చేయడానికి ఆ పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ అగ్రనేతల చాణక్యం ముందు, టీడీపీ అనుకూల బీజేపీ నేతల పప్పులు ఉడకడం లేదు. తాజాగా ఏపీలో అమిత్ షా, నడ్డా పర్యటనల నేపథ్యంలో సీఎం రమేశ్ తన మార్క్ రాజకీయ ప్రకటనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీలో ఆత్మాభిమానం లేకుండా ప్రజలు జీవించేలా వైసీపీ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికై, బీజేపీలోకి రాజకీయ ప్రయోజనాల కోసం ఫిరాయించిన వారు కూడా ఆత్మాభిమానం లాంటి పెద్దపెద్ద మాటలు వినాల్సిన దుస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
అలాగే ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వం ఏపీలో వస్తుందని సీఎం రమేశ్ జోస్యం చెప్పారు. పొత్తుల గురించి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తామని మనసులో మాట బయటపెట్టడానికి కూడా ఈయన గారికి ధైర్యం చాలడం లేదు. కనీసం బీజేపీకి ఓటు వేసే పరిస్థితి కూడా లేని నాయకులు, పొత్తుల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుంది.
ఎంతసేపూ చంద్రబాబుకు మళ్లీ రాజకీయంగా ఊపిరి పోసేందుకు, బీజేపీ ప్రాణం తీయడానికే సీఎం రమేశ్ పని చేస్తుంటారని సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఏపీలో బీజేపీ ఏముందని, దాని ప్రాణం తీయడానికి చూస్తున్నారని సీఎం రమేశ్ వ్యాఖ్యలపై సెటైర్స్ ప్రత్యక్షం కావడం విశేషం.