పరువు పోకుండా జాగ్రత్తపడుతున్న తెదేపా!

మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని ప్రారంభించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సిద్ధపడుతోంది. రాష్ట్రం లో ఒక్క నియోజకవర్గంలో…

మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని ప్రారంభించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సిద్ధపడుతోంది. రాష్ట్రం లో ఒక్క నియోజకవర్గంలో అయినా గెలవగలం అనే నమ్మకం వారికి ఉన్నదని అనుకోలేము. అయినా సరే సైకిల్ గుర్తును తెలంగాణ ప్రజలు మరిచిపోకుండా ఉండడానికి ఈ మాత్రం ప్రయత్నం అభినందించాల్సిందే.

విషయానికి వస్తే,  తాను సారధిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ  బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఆ పార్టీకి ఒక జోష్ తీసుకువచ్చిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్. తానేదో జాతీయ పార్టీ అధ్యక్షుడిని అని ట్యాగ్ లైన్ తగిలించుకుని తిరగడానికి వాడుకోవడమే గానీ.. తెలంగాణ తెలుగుదేశాన్ని చంద్రబాబునాయుడు కనీసమాత్రంగా కూడా పట్టించుకోవడం మానేశారు. అయినా సరే కాసాని.. ఏదో పార్టీకి కాస్త ఊపుతెచ్చే ప్రయత్నం చేశారు. 

ఇప్పుడు తొలుత మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ బరిలోకి దిగాలని అనుకున్నారు గానీ.. కొంత ఆలోచన తర్వాత.. అంతకంటె మూర్ఖత్వం మరొకటి ఉండదని వారికే బోధపడినట్టుంది. బావ జైల్లో ఉండగా.. తెలంగాణ ఎన్నికల ప్రచార బాధ్యతను తన భుజాన వేసుకున్న నందమూరి బాలకృష్ణ.. కూడా 119 నియోజకవర్గాల్లో పోటీకి అభ్యంతరం వ్యక్తం చేశారని, బలంగా ఉన్న చోట్ల చేస్తే చాలునని సూచించారని సమాచారం. ఆయనే ప్రచారంలో కీలకంగా వ్యవహరించబోతున్న సమయంలో.. రాష్ట్రమంతా ఆయన తిరగడం కూడా అసాధ్యం కనుక ఈ జాగ్రత్త తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఇంకో ట్విస్టు ఏంటంటే.. జనసేనతో తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుని పోటీచేయాలా? లేదా, విడిగా పోటీచేయాలా? అనేది ఇంకా తేల్చుకోలేదని కాసాని ప్రకటించారు. ఆ మాటకొస్తే జనసేన పరిస్థితి కూడా అదే. తెదేపాలాగానే.. వాళ్లు ఇప్పటికే పోటీచేయగల సీట్ల సంఖ్యను మాత్రమే ప్రకటించారు. అభ్యర్థుల జాబితా రెండుచోట్ల సిద్ధం కాలేదు.. రెడీ అని మాటలు మాత్రమే చెబుతున్నారు. 

పొత్తులు పెట్టుకునే పరిస్థితి వస్తే గనుక.. కొన్ని సీట్లను పంచుకోవడంలో ఇరుపార్టీలకు తకరారు తప్పదు. జనసేన ఇప్పటికే తమ 32 స్థానాల పేర్లను కూడా ప్రకటించింది. వాటిలో చాలా వరకు తెలుగుదేశం- తమకు బలమైన స్థానాలు అనుకునే ప్రాంతాలు ఉన్నాయి. మరి గెలుపు జాడ దొరకని ప్రస్థానానికి తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద కసరత్తే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.