తెలంగాణలో అత్యంత ప్రభావశీలియైన నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు. కేసీఆర్ కొడుకు కాబట్టి.. మంత్రి పదవుల్లోకి వచ్చినప్పటికీ.. అలాగని ఎవ్వరూ వేలెత్తి చూపే అవకాశమే లేకుండా.. మంత్రిత్వ బాధ్యతల నిర్వహణలో తనను తాను సమర్థుడిగా నిరూపించుకున్న వ్యక్తి కూడా.
ఐటీ మునిసిపల్ శాఖను కేటీఆర్ నిర్వహిస్తుంటారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు. మునిసిపల్ శాఖ మంత్రిగా హైదరాబాదు నగర రూపురేఖలను ఈ తొమ్మిదేళ్లలో గణనీయంగా మార్చేయడంలో కేటీఆర్ ది కీలక పాత్ర. రాజధాని నగరంలో ఏదైనా ఒక ప్రాంతానికి ఓ ఏడాది తర్వాత వెళితే గనుక.. అక్కడ ఏదో ఒక కొత్త ఫ్లైఓవర్, అండర్ పాస్ లతో కొత్తరూపు సంతరించుకుని ఉంటుంది. అంతగా పనులు జరిపిస్తుంటారు.
అయితే కేటీఆర్ జమానాలో అధికారులు సాగించే అడ్డగోలు దోపిడీల పర్వం గురించి, బిల్డర్లు సాగించే అనధికార నిర్మాణాలు, విచ్చలవిడి అతిక్రమణల గురించి ఆయనకు తెలుసో లేదో అనే సందేహం ప్రజలకు కలుగుతూ ఉంటుంది. అప్రూవల్ లేని లేఅవుట్లు ఉన్న అనేక ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి.
జీహెచ్ఎంసీకి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం పద్ధతి ప్రకారం ఫీజులు, రుసుములు అన్నీ చెల్లించాల్సి వస్తే.. సదరు బిల్డర్లు అన్ని నిబంధనలూ పాటించాలి. కానీ, కేవలం జీహెచ్ఎంసీ అధికారులకి లక్షలకు లక్షలు లంచాలు సమర్పించుకుంటే.. అస్సలు ఏ నిబంధనలూ పాటించక్కర్లేదు. ఉండే స్థలంలో సెట్ బ్యాక్స్ లాంటివి అంగుళం కూడా వదలకుండా నిర్మాణాలు చేపట్ల వచ్చు. అడిగే వాడు ఉండడు.
సాధారణంగా జీహెచ్ఎంసీ కి రుసుములు చెల్లిస్తే ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి. కట్టబోయే బిల్డింగులో కొంత భాగం ముందుగా కార్పొరేషన్ కు తనఖా పెట్టాలి. బిల్డింగ్ నాలుగువైపులా విస్తీర్ణాన్ని బట్టి సెట్ బ్యాక్స్ ఖాళీ వదలాలి. విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని అంతస్తులు నిర్మించాలో కూడా నిబంధన ఉంటుంది.
కానీ అసలు అప్రూవల్ లేకుండా కట్టేట్లయితే జస్ట్ లక్షల లంచాలు ఇచ్చేస్తే చాలు. ఏ నిబంధన పాటించక్కర్లేదు. అయిదు అంతస్తులకు కూడా అనుమతి రాని జాగాలో.. ఏడెనిమిది అంతస్తులు కూడా కట్టేయొచ్చు. జీహెచ్ఎంసీ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని చూస్తూ ఉంటారు. వచ్చే లంచాలను స్వాహా చేస్తుంటారు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే.. జీహెచ్ఎంసీ ఒక ప్రహసనం నడిపిస్తుంది. నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు జేసీబీలతో వెళ్లి కూల్చివేతలు చేపడుతుంది. పిల్లర్లను, బీమ్ లను ముట్టుకోకుండా, కేవలం శ్లాబ్ లను మాత్రం కొంచెం పగలగొట్టేసి.. తద్వారా కూల్చివేశాం అని రికార్డుల్లో రాసుకుని.. సదరు బిల్డరుకు ఆ మేరకు లాభం చేకూర్చినందుకు మరికొన్ని లక్షలను లంచంగా పుచ్చుకుని వెళుతుంటారు.
ఈ రూపంలో జీహెచ్ఎంసీ ఖజానాకు అధికారికంగా రావాల్సిన రుసుముల రూపంలో కోట్లకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంటుంది. వాటిల్లే నష్టానికి పదీ ఇరవై రెట్లు అధికారులు లంచాలు తినేస్తుంటారు. ప్రధానంగా అప్రూవల్స్ లేని ఏ ప్రాంతంలో చూసినా ఇలాంటి స్వాహాపర్వాలు అడుగడుగులనా కనిపిస్తాయి.
మాధాపూర్ లో ఉండే అయ్యప్ప సొసైటీలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు పదుల సంఖ్యలో కనిపిస్తాయి. మామూలు ప్రజలకు కనిపిస్తాయి. కానీ జీహెచ్ఎంసీ వారికి కనిపించవు. కనీసం తన ఏలుబడిలోని శాఖలో అధికారులు ఎన్నెన్ని కోట్లు లంచాలు స్వాహా చేస్తున్నారో.. సర్కారు ఖజానాకు ఎంత నష్టం చేస్తున్నారో.. కనీసం మునిసిల్ మంత్రి కేటీఆర్ కు తెలుసో లేదో అని ప్రజలు అనుకుంటున్నారు.