2021 సంవత్సరంలో బైక్ పై ప్రయాణిస్తూ హెల్మెట్ ధరించకపోవడం, కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 63 వేల మంది అని కేంద్ర ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. మరణించిన వారిలో సెఫ్టీ మెజర్స్ పాటించని వారి సంఖ్య ఇదని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వివరిస్తున్నాయి.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. బైక్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ ను ధరించడం ద్వారా.. ప్రమాదం జరిగినా ప్రాణ హాని 74 శాతం వరకూ తగ్గుతుందని డబ్ల్యూహెచ్ వో గణాంకాలు చెబుతున్నాయి. హెల్మెట్ ధారణ అనేది ప్రాణాన్ని నిలబెట్టే అంశం కూడా అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీనికి అనుగుణంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో హెల్మెట్ తప్పనిసరి నిర్బంధన ఉంది.
బెంగళూరు సిటీలో అయితే డ్రైవింగ్ చేసే వారితో పాటు వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాల్సిందే అనే నిబంధనను స్ట్రిక్ట్ గానే అమలు చేస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల నిర్బంధ హెల్మెట్ ధారణ నియమం ఉంది. అయినప్పటికీ ఇండియాలో కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించిన వారి సంఖ్య వేలలో ఉంది.
కేవలం బైక్ ప్రమాదాలనే తీసుకుంటే.. బైక్ యాక్సిడెంట్లలో 2021లో 47 వేల మంది మరణించారట. డబ్ల్యూహెచ్ వో లెక్కల ప్రకారం తీసుకుంటే.. వీరిలో హెల్మెట్ ధరించి ఉంటే 74 శాతం మందికి ప్రాణాపాయం తప్పేది. అయితే వీరిలో హెల్మెట్ ధరించి ఉంటే కనీసం 13 వేల మందికి ప్రాణహాని తప్పేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
డబ్ల్యూహెచ్వో చెప్పిన స్థాయిలో కాకపోయినా.. బైక్ యాక్సిడెంట్లలో మరణించిన 47 వేల మందిలో కనీసం 13 వేల మంది హెల్మెట్ ధరించి ఉంటే.. బతికి బట్టకట్టే వారని మాత్రం కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. 13 వేల ప్రాణాలు అంటే మాటలా! బైకర్లు హెల్మెట్ ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి ఈ గణాంకాలు చాలు!