నితిన్ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషించబోతున్నాడనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇదివరకే వెల్లడించింది. ఇప్పుడా విషయాన్ని యూనిట్ కన్ ఫర్మ్ చేసింది. 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్' సెట్స్ పైకి రాజశేఖర్ వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన యూనిట్, యాంగ్రీ మేన్ కు సాదరంగా స్వాగతం పలికింది.
వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్'. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. అది ప్రతినాయకుడి పాత్ర కావొచ్చు. కాకపోతే ఆ విషయాన్ని మేకర్స్ చెప్పడం లేదు. కీలకమైన పాత్ర అని మాత్రమే చెబుతోంది. ఈ పాత్ర కోసం రాజశేఖర్ ను ఒప్పించడంలో దర్శకుడు వక్కంతం వంశీ పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు.
ఎందుకంటే, ఇంతకుముందు చాలామంది దర్శకులు ప్రత్యేక పాత్రల కోసం రాజశేఖర్ ను సంప్రదించారు. అంతెందుకు, గోపీచంద్ సినిమాలో కీలక పాత్ర కోసం రాజశేఖర్ ను దాదాపు ఓకే అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకున్నారు రాజశేఖర్.
అలా ప్రత్యేక పాత్రల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్న రాజశేఖర్, 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్' లో నటించేందుకు ఒప్పుకున్నారంటే, కచ్చితంగా ఆ పాత్ర అంతోఇంతో స్పెషల్ అయి ఉంటుంది. ఈ సినిమాతో క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లిన రాజశేఖర్, సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో చూడాలి.