బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అంటే రాయలసీమలో ఎవరికీ తెలియదు. కానీ అసత్యకుమార్ గురించి మాత్రం సీమ ప్రజానీకానికి బాగా తెలుసు. బీజేపీలో ఓ పెద్దాయన లేని లోటును భర్తీ చేసేందుకు అసత్యకుమార్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారనే అభిప్రాయాలు సొంత పార్టీలో ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నివాసైన సత్యకుమార్ జన్మనిచ్చిన గడ్డ కోసం చేసేందేమీ లేదని సొంత వాళ్లు కూడా ఆవేదన చెందుతున్నారు.
బీజేపీలో జాతీయ పదవిలో ఉంటున్న సత్యకుమార్ ఏపీలో సొంత పార్టీ బలోపేతం కోసం పని చేయడం తక్కువనే విమర్శలున్నాయి. టీడీపీ ఎజెండాను మోసే పనిలో ఆయన తలమునకలై ఉన్నారనేందుకు ప్రతి వారం ఆయన ఎల్లో పత్రికలో రాసే వ్యాసాలు, మీడియా సమావేశాల్లో చేసే విమర్శలే నిదర్శనమనే వాళ్లు లేకపోలేదు. ఇదిలా ఉంటే ఇవాళ కడపలో సీమ రణభేరి పేరుతో బీజేపీ ఓ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ సమావేశం సాకుతో సత్యకుమార్ ప్రతిరోజూ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీకి జాతీయ నాయకుడైన సత్యకుమార్ వెనుకబడిన ప్రాంతానికి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో ఎందుకు విఫలమయ్యారో మాత్రం చెప్పరు. ఇలా ఒకటని కాదు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎందుకు చేయలేదో సమాధానం ఉండదు.
తాము చేయాల్సినవేవీ చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎదురు దాడి చేయడం బీజేపీ నేతలకే చెల్లింది. ఇవాళ కడపలో బీజేపీ రణభేరి నిర్వహిస్తున్న నేపథ్యంలో సరిగ్గా నాలుగేళ్ల క్రితం వెలువరించిన కర్నూలు డిక్లరేషన్ సీమ ప్రజానీకం గుర్తు చేస్తోంది. 2018, ఫిబ్రవరి 23న కర్నూలులో రాయలసీమ ముఖ్య నేతల సమావేశం. ఈ సందర్భంగా కర్నూలు డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలు ఏంటంటే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. వెంటనే ప్రకటించి భూసేకరణ చేయాలి. అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి ఆరు నెలలకి ఒకసారి కర్ణాటక, మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సెక్రటేరియట్, ఇతర శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి నివాస భవనం ఉండాలి. గవర్నర్ తాత్కాలిక విడిదికి నివాసం ఇక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న తాత్కాలిక హైకోర్టు సైతం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి.
కర్నూలు డిక్లరేషన్‌ను బీజేపీ మరిచిపోయినా, సీమ సమాజం గుర్తించుకుంది. ఎప్పటికీ మరిచిపోదు. విభజన హామీలను మరిచిపోవడం, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కడం బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజల డిమాండ్లకు విరుద్ధంగా నిర్ణయాలు, పాలన సాగించడం బీజేపీకి పరిపాటైంది.
ఇవాళ కడపలో సీమ రణభేరి నిర్వహిస్తున్న తరుణంలో, గతంలో కర్నూల్ డిక్లరేషన్ అమలు మాటేంటి? అది ఏమైంది. దాన్ని పక్కన పెట్టేశారా? గతంలో హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ, నేటి ప్రభుత్వం అందుకు సానుకూలంగా తీసుకున్న నిర్ణయంపై బీజేపీ స్టాండ్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాయలసీమపై బీజేపీ తన చిత్తశుద్ధిని ఆచరణలో చూపాల్సిన సమయం ఆసన్నమైంది.