రాజకీయాలు- బడా వ్యాపారులు ఒకే సమాజంలో వేర్వేరు విభాగాలు కాదు! ఒకే వ్యవహారానికి రెండు పార్శ్వాలు. రాజకీయ నిర్ణయాలను వ్యాపారులు ప్రభావితం చేయడం, వ్యాపారుల నిర్ణయాలను రాజకీయ నాయకులు ప్రభావితం చేయడం చాలా తరచుగా జరుగుతూనే ఉంటుంది.
వ్యాపారులు అందించే ఫండింగ్, ఎంగిలిమెతుకులకు ఆశపడి రాజకీయ నాయకులు ప్రజా ఉద్యమాల ముసుగులో అనేక పోరాటాలను నెత్తికెత్తుకోవడం.. ఏదో ప్రజల కోసం ఉద్ధరిస్తున్న బిల్డప్ తో ఉద్యమాలు చేయడం చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది.
నలభై నాలుగేళ్ల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, సుదీర్ఘకాల ముఖ్యమంత్రి లాంటి బిళ్లలు తగిలించుకుని తిరుగుతూ ఉండే చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు లిక్కర్ సిండికేట్ విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడి కొత్త ప్రజాఉద్యమాలకు పిలుపునిస్తున్నారా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
ఏపీలో బ్రాండెడ్ లిక్కర్ దొరకడం లేదనే డిమాండ్ తో చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీ శ్రేణులతో ఉద్యమం చేయడానికి పిలుపు ఇచ్చారు. ఈ పోరాటానికి బ్రాండెడ్ లిక్కర్ సిండికేట్ నుంచి చంద్రబాబుకు చాలా పెద్దస్థాయిలోనే ఫండింగ్ ముడుతున్నదని ప్రజలు అనుమానిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. మద్యనిషేధం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకేసారి నిషేధం విధించి విపరిణామాలు చూడకుండా, అంచెల్లో నిషేధం తెచ్చేలా.. ముందు మద్యం వినియోగం తగ్గించే ఉద్దేశంతోన ధరలు పెంచారు. పన్నులు పెంచారు. ఖరీదైన మద్యం బ్రాండ్ లకు తోడుగా, ఇతర బ్రాండ్‌లకు కూడా అనుమతులు ఇచ్చారు.
మద్యం తాగడం ద్వారా వచ్చే ఆనందం దేనితోనైనా ఒకటే అని మందుబాబులు అనుకున్నారేమో గానీ, ఏపీలో ఖరీదైన బ్రాండెడ్ మద్యం అమ్మకాలు తగ్గాయి. ఆ విషయం చంద్రబాబునాయుడుకు తీవ్రమైన ఆవేదన కలిగిస్తున్నట్లుంది.
దేశంలో ఎక్కడా లేని బ్రాండ్ మద్యం ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంది.. బ్రాండెడ్ మద్యం దొరకడం లేదు అనే తరహా లేకి డిమాండ్లతో ఆయన రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్లాన్ చేశారు. వీడియో, టెలికాన్ఫరెన్సుల ద్వారా రాష్ట్రమంతా నిరసనలు చేయడానికి ఆయన పిలుపు ఇస్తున్నారు.
ఈ ఉద్యమానికి లోకల్ బ్రాండ్ల లిక్కర్ ద్వారా జగన్ కు కమిషన్లు వస్తున్నాయనే ఆరోపణను ముసుగులాగా తొడిగారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి, చంద్రబాబు చేసే పోరాటానికి.. ఏపీలో తగ్గిపోయిన అమ్మకాల ద్వారా నష్టపోయే బ్రాండెడ్ లిక్కర్ వ్యాపారుల, తయారీదార్ల సిండికేట్ భారీ ఫండింగ్ చేస్తున్నదని అంతా అనుకుంటున్నారు.
చంద్రబాబు లెవెల్లో బ్రాండెడ్ లిక్కర్ తయారీదార్లనుంచి వందలకోట్ల ఫండింగ్ తీసుకుని.. తమకు రూపాయైనా విదిలించకుండా రాష్ట్రమంతా పోరాటాలు చేయాలని పిలుపునివ్వడం కామెడీ ఉన్నదని తెలుగు తమ్ముళ్లు పాపం వాపోతున్నారు.