రామానుజ చినజీయర్, పాపం, కొన్ని దశాబ్దాల సన్యాసజీవితంలో ఆధ్యాత్మిక వేత్తగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతటి శ్రమార్జితమైన గుర్తింపు కంటె.. ఇప్పుడు రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా.. చాలా చాలా పెద్ద గుర్తింపును మూటగట్టుకున్నారు.
కేసీఆర్తో సున్నం పెట్టుకున్నట్టుగా జరుగుతున్న ప్రచారం దగ్గరినుంచీ.. సమ్మక్క సారక్క లపై చేసిన వ్యాఖ్యల కారణంగా రేగుతున్న రచ్చ వరకు ఆయన చుట్టూ తాజా వివాదాలు అనేకం. ఈ నిత్య కాషాయాంబరధారి.. రాజకీయ వివాదాలకు, విమర్శలకు టార్గెట్ అవుతున్నారు.
తాజాగా ఆయన సమ్మక్క సారక్కలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి వివరణ ఇచ్చారు. ఆ వివరణలో అచ్చమైన పొలిటికల్ స్టైల్ డైలాగులతో అలరించారు. ‘నా మాటలను వక్రీకరించారు’ అన్నదే.. ఆయన తాజా పొలిటికల్ స్టైల్ ఆన్సర్.
సమ్మక్క సారక్కపై చినజీయర్ చేసిన వ్యాఖ్యలు చాలా కాలం కిందటివే అయినప్పటికీ.. తాజాగా వాటిచుట్టూ పెనువివాదం రేగింది. అది వీడియో! ‘నా వ్యాఖ్యలు కాదు’ అని ఆయన తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే వివరణ ఇవ్వడానికి దిగివచ్చారు గానీ.. చేసిన తప్పును దిద్దుకునే ప్రయత్నం ఆయన వివరణలో ఏమాత్రం లేకపోవడం గమనార్హం.
నేను అన్న మాటల పూర్వాపరాలు చూడకుండా, ఒక్క మాటను పట్టుకుని వివాదం చేస్తున్నారు అంటూ ఎదుటివారిమీదనే నింద వేసే ప్రయత్నం చేశారు. ఇవి కూడా అచ్చమైన పొలిటికల్ స్టంట్ డైలాగులే. ‘ఉచిత విద్యుత్తు ఇస్తే, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే’ అని తాను చేసిన వ్యాఖ్యల గురించి చంద్రబాబు కూడా ఇలాగే బుకాయించారు.
తన వ్యాఖ్యలు వక్రీకరించారని, సుదీర్ఘమైన మాటల్లో ఒక ముక్కను మాత్రమే ప్రచారంలో పెట్టారని డబాయించారు. ఇప్పుడు చినజీయర్ కూడా అచ్చంగా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నట్టుగా ఆయన వివరణ ఉంది.
సమ్మక్క సారక్క గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నట్టుగా ఇరవయ్యేళ్ల తర్వాత అయినా, తాజాగా మేలుకున్న తెలంగాణ సమాజం ఆయన నుంచి క్షమాపణ కోరుకున్నది. ఆయనకు సౌహార్దగుణం ఉంటే, చినజీయర్ సామరస్యాన్ని కోరుకుంటే క్షమాపణ చెప్పాలి. లేదంటే మిన్నకుండాలి. అంతేతప్ప వివరణ కోసం వచ్చి.. ఎదుటివారినే తప్పుపట్టే ప్రయత్నం చేశారు.
‘వాళ్లు స్వర్గంలోంచి దిగి రాలా’ అనే మాటలతో మళ్లీ గాయపరిచారు. నా వ్యాఖ్యల పూర్వాపరాలు చూపించకుండా వివాదం చేశారని అన్నాడు. ఆ వీడియో చూసినట్లయితే.. ఆ వ్యాఖ్యల పూర్వాపరాలు చూడాల్పిన అవసరమే లేదు.
‘సారక్క సమ్మక్క ఎవరు? పోనీ వాళ్లేమైనా దేవతలా? వారేమైనా బ్రహ్మలోకం నుంచి దిగివచ్చారా? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత. అదేదో ఒక గ్రామదేవత. సరే చేసుకోనీ అక్కడ ఉండేవాళ్లని.. చదువుకున్న వాళ్లు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఆ పేరిట బ్యాంకులు పెట్టేశారండి తర్వాత.. దట్ బికేమ్ ఏ బిజినెస్ నౌ’ అంటూ సాగిన ఆయన మాటలు గర్హించదగినవి.
అక్షరాల్లో ఈ మాటలు ఎలా కనిపించినా.. ఆ మాటలు అనడంలో ఆయన హావభావాలు, సమ్మక్క సారక్క ల గురించిన ప్రస్తావనలో గేలిగా వెకిలి నవ్వులు ఇవన్నీ కూడా ఎవరినైనా బాధిస్తాయి.
‘వక్రీకరించారు..’ అనే మాటతో చంద్రబాబు లాగా పొలిటికల్ స్టయిల్లో మాటలను వల్లిస్తే.. చేసిన తప్పు నుంచి ఆయన తప్పించుకోజాలరు.