హాలీవుడ్ సినిమాలను ఓ మలుపు తిప్పిన ‘‘గాడ్‌ఫాదర్’’ సినిమా రిలీజై యీ మార్చికి 50 ఏళ్లయింది. మేరియో ప్యూజో (అతని గురించి వేరే వ్యాసం రాస్తాను) రాసిన నవల ఆధారంగా ఆ సినిమా సీరీస్ తయారైతే ఆ సినిమా ఆధారంగా ప్రపంచంలో అనేక భాషల్లో సినిమాలు తయారయ్యాయి. తమిళంలో తీసిన ‘‘నాయకన్’’ (1987 – తెలుగులో ‘‘నాయకుడు’’)లో దాన్ని కొంత మేరకు తీసుకుని వరదరాజ్ మొదలియార్ జీవితగాథకు కలిపారు. ఏ మేరకు ఏది కలిపారో యీ వ్యాసంలో చెపుతున్నాను. నాయకుడు సినిమాలో హీరోగా వేసినది కమలహాసన్. హీరో బొంబాయిలో ఓ అండర్‍వరల్డ్ డాన్. అతనా స్థితికి ఎలా వచ్చాడో సినిమా ప్రథమభాగంలో చూపించారు.
ఓ కుఱ్ఱవాడిది దక్షిణాదిన ఓ పల్లెటూరు. తన తండ్రిని చంపినవాణ్ని ఆవేశంలో చంపేసినంతటి ధైర్యం వున్నవాడు. బొంబాయి రైలెక్కి వచ్చేశాడు. ఈ అనాథకు ఓ స్నేహితుడు దొరికాడు. బొంబాయిలోని అతి పెద్ద మురికివాడ ఐన ధరావిలో స్మగ్లింగ్ చేసి బతికే హుస్సేన్ అనే అతని వద్దకు తీసుకెళ్లాడు. అతను యితన్ని కొడుకుగా స్వీకరించాడు. అతని కూతుర్ని యితను చెల్లెలుగా భావించాడు. హుస్సేన్ యిస్లాంను చాలా శ్రద్ధగా ఆచరిస్తాడు కానీ స్మగ్లర్లకై పనిచేస్తాడు. రాత్రివేళ బోటులో వెళ్లి స్మగ్లింగ్ గూడ్స్ తెస్తాడు. ఈ వైరుధ్యం గురించి హీరో అడిగాడతన్ని. నాకు వచ్చినదానితో అనేకమందికి సాయపడుతున్నాను. పదిమందికి వుపయోగపడేది ఏదీ చెడ్డది కాదని తన ఫిలాసఫీ చెప్పాడు. హీరో అదే నమ్ముకున్నాడు.
హీరో పెరిగి పెద్దవాడయ్యాడు. చదువు అబ్బలేదు. ఓ రోజు పెంపుడుతండ్రి జ్వరంతో పనిపై బయలుదేరితే తను వెళతానన్నాడు. చెకింగ్ బాగా జరుగుతోందని హెచ్చరించినా వినలేదు. సరుకులు తీసుకుని ఉప్పుమూటలతో సహా తాడు కట్టి సముద్రంలో పడేశాడు. చెకింగ్‍కి వచ్చినవాళ్లకు సరుకు దొరకలేదు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వాటిని బోటులోకి లాక్కున్నాడు. ఇతని తెలివితేటలకు స్నేహితుడు జనకరాజ్ మూర్ఛపోయాడు. అయితే హీరో యిక్కడ ఓ బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. ఎప్పుడూ యిచ్చేదాని కంటె ఎక్కువ వాటా యివ్వాలని స్మగ్లర్లతో బేరం పెట్టాడు. వాళ్లు కాదనలేక యిచ్చినా పగబట్టి పోలీసు యిన్‍స్పెక్టర్‍తో చెప్పి హుసేన్‍ను అరెస్టు చేయించారు.
అంతకుముందు ఓ సారి ఆ మురికివాడలో తనను ధైర్యంగా ఎదిరించాడని పోలీసు యిన్‍స్పెక్టర్‍కి హీరో అంటే ముందే కోపం. అదను చూసుకుని యిప్పుడు అతని పెంపుడుతండ్రిని స్టేషన్‍కు తీసుకెళ్లి హింసించాడు. చంపేసి ఆత్మహత్యగా చూపించాడు. హుసేన్ కుటుంబమే కాదు, అతని వలన సహాయం పొందే పది కుటుంబాలకు ఆధారం పోయిందని జనకరాజ్ హీరోని నిందించాడు. హీరో తన మొదటి హత్య చేశాడు. మురికివాడ ప్రజల్ని హింసిస్తున్న యిన్‍స్పెక్టరును చంపేశాడు. దానికి ప్రజలు ఎంత సంతోషించారంటే పోలీసు అధికారి వచ్చి సాక్ష్యం చెప్పమంటే ఒక్కరూ చెప్పలేదు. ఈ విధంగా ఓ డాన్ అవతరించాడు.
1987 నాటి ‘‘నాయకుడు’’ సినిమాకు వరదరాజ మొదలియార్ అనే ఓ స్మగ్లర్ జీవితానికి లింకు ఉంది. అతను తమిళనాడునుండి బొంబాయికి చిన్నప్పుడే వచ్చి హాజీ మస్తాన్ అనే ఓ పెద్ద స్మగ్లర్ ముఠాలో చేరాడు. తర్వాత కొన్నాళ్లకు సొంతంగా స్మగ్లర్‍గా ఎదిగాడు. ధరావిలో తమిళులు చాలామంది వుంటారు. వాళ్లు ఇతనికి బూట్‍లెగ్గింగ్ అంటే దొంగసారాయి సరఫరాలో బాగా తోడ్పడ్డారు. ఇతను వాళ్లకి బాగా సాయపడుతూ, సామాజిక కార్యకలాపాలు కూడా బాగానే చేసేవాడు. మాతుంగాలో ఇతను నిర్వహించే గణపతి పూజకు సినిమాతారలు, రాష్ట్రమంత్రులు కూడా వచ్చేవారు. బొట్టు అదీ పెట్టుకుని చాలా ధార్మికమైన వ్యక్తిగా కనబడుతూ పూజలూ అవీ చేస్తూ స్మగ్లింగ్ కార్యకలాపాలు చేసేవాడు. చట్టరీత్యా న్యాయం అందనివారు యితని వద్దకు వస్తే వాళ్లకు తన పద్ధతిలో న్యాయం చేసేవాడు. అందువలన అతనికి సామాన్య ప్రజల్లోనే కాదు, పోలీసులలో కూడా మద్దతుదారులు వుండేవారు.
ఇతని కథతో మాత్రమే తీస్తే డాక్యుమెంటరీలా వుంటుందనే భయంతో గాడ్‍ఫాదర్‍నుండి కొంత కథ కలిపారు కథకుడు, దర్శకుడు మణిరత్నం. గాడ్‍ఫాదర్ మేరియో ప్యూజో అమెరికన్ మాఫియా గురించి రాసిన ప్రసిద్ధ నవల. దాని ఆధారంగా ఫ్రాన్సిస్ కొపోలా దర్శకత్వంలో గాడ్‍ఫాదర్ సినిమా మూడు భాగాలుగా వచ్చింది. మొదటిభాగంలో డాన్ పెద్దవాడై పోయిన తర్వాత నుండి ప్రారంభమౌతుంది. అతని చిన్నకొడుకు మైకేల్ యీ వ్యాపారంలోకి రాకూడదనుకుంటూనే, చివరకు పరిస్థితుల ప్రభావం చేత డాన్‍గా మారడంతో అంతమౌతుంది. పెద్ద డాన్ – ఆ పాత్ర పేరు వితో కారోలిన్ – డాన్‍గా ఎలా మారాడో చూపుతుంది గాడ్‍ఫాదర్ రెండోభాగం. 1974 లో వచ్చిన ఆ భాగాన్ని చూస్తే, అది ‘‘నాయకుడు’’ సినిమాను ఎలా ప్రభావితం చేసిందో అర్థమౌతుంది.
నేరప్రపంచం, అండర్ వ(ర)ల్డ్ ఏదైనా అనండి. దానికి పుట్టినిల్లు ఇటలీలోని సిసిలీ ప్రాంతం. అక్కణ్నుంచే మాఫియా అనే పదం పుట్టింది. మన హీరో వితో అక్కడివాడే. పాత్రధారి రాబర్ట్ డీ నీరో. కథాకాలం 1901. హీరోకి తొమ్మిదేళ్లు. అతని తండ్రిని స్థానిక మాఫియా డాన్ చంపివేశాడు. హీరో అన్న పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి పారిపోయాడు. ఇక్కడ తండ్రికి అంత్యక్రియలు జరిగే సమయంలోనే అన్నగారిని చంపి పారేశాడు డాన్. చిన్నకొడుకునీ చంపేస్తాడని తల్లికి భయం వేసింది. వెళ్లి డాన్‍ను బతిమాలింది. వీడు చిన్నవాడు, పగబట్టడు, వదిలేయ్ అని. డాన్ వినలేదు. చంపి తీరుతానన్నాడు. అప్పుడు తల్లి దుస్తుల్లో దాచుకున్న కత్తి డాన్‍కు గురిపెట్టి పిల్లాణ్ని పారిపోమంది. డాన్ అనుచరులు ఆమెను చంపేసి కొడుకుకోసం వెతికారు. హీరో తండ్రి స్నేహితులు అతన్ని రహస్యంగా దాటించేసి అమెరికాకు వెళ్లే ఓడ ఎక్కించేశారు. ఇటాలియన్ భాష తప్ప మరో భాష రాని హీరో అనాథగా అమెరికాకు వచ్చి పడ్డాడు. వాళ్ల జాతివాళ్ల మధ్యనే పెరిగాడు.
హీరోకి పాతికేళ్ల వయసు వచ్చింది. మురికివాడల్లోనే బతుకుతున్నాడు. వినోదం కోసం చీప్ డ్రామా థియేటర్లకు వెళ్లేవాడు. గాడ్‍ఫాదర్‍లో హీరోకి ఇటాలియన్ భాష తప్ప ఇంగ్లీషు రానట్టే మన ‘నాయకుడు’కి కూడా తన మాతృభాష తప్ప హిందీ, ఇంగ్లీషు రాదు, బొంబాయిలో ఎంత పెద్దవాళ్లతో మసిలినా. అతనికి కండబలం అందించడానికి జనకరాజ్, బుద్ధిబలం అందించడానికి ఢిల్లీ గణేష్ వున్నారు. భాష విషయంలో వాళ్లే సాయపడతారు. తెలుగు సినిమాలో కూడా ఇంగ్లీషు సినిమాలో పెట్టినట్లే ఓ చీప్ డాన్సు ఒకటి పెట్టారు, హీరో వేశ్యావాటికకు వెళ్లినపుడు! ఇక్కడ మన హీరో ఒక వేశ్యను కలియడానికి వెళ్లాడు. చదువు మీద ఆమె శ్రద్ధ చూసి సహకరించాడు. ఆమె తీరు చూసి ముచ్చటపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. గాడ్‍ఫాదర్‍లో హీరో కూడా ఓ బీద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పొట్టగడవడానికి ఓ కిరాణా స్టోర్స్‌లో పనిచేసేవాడు. ఆ స్టోర్స్ యజమాని కొడుకు మన హీరో ఫ్రెండ్. అతన్ని చూసే యిక్కడ జనకరాజ్ పాత్రను తయారుచేశారు.
హీరో ఉద్యోగానికి ముప్పు వచ్చింది. ఆ ఏరియాలో ఫనూచీ అనే ఓ డాన్ వున్నాడు. అందర్ని బెదిరిస్తూ, హఫ్తా వసూలు చేస్తూ వుంటాడు. ఈ షాపతని వద్దకు వచ్చి హీరోని పీకేసి తన మేనల్లుణ్ని పెట్టుకోమన్నాడు. షాపు యజమానికి గత్యంతరం లేకపోయింది. హీరో పరిస్థితి అర్థం చేసుకున్నాడు, తప్పుకున్నాడు. మరి పూట గడవడం ఎలా? ఓ రోజు యింటిపక్కతను ఓ తుపాకీల మూట అందించి దాచమన్నాడు. ఆ ఉపకారానికి ప్రతిగా ఓ తివాచీ బహూకరిస్తానన్నాడు. ఎలా? దొంగతనం చేసి! ఓ మూసేసిన ఫ్లాట్ కెళ్లి తాళం బద్దలు కొట్టి ఓ తివాచీ ఎత్తుకొచ్చారు. ఇలా దొంగతనాలు చేసి బతుకుతూంటే దానికీ ముప్పు వచ్చిపడింది, ఫనాచీవలన. ఓ రోజు బట్టలు దొంగరవాణా చేస్తూంటే ఫనాచీ వచ్చిపడ్డాడు. మీరు దొంగతనాలు చేసుకోవచ్చు కానీ మీ ఆదాయంలో మూడోవంతు నాకు చెల్లించండి అన్నాడు. హీరో, అతని స్నేహితులు చర్చించారు. ఎంతో కొంత యివ్వకపోతే ఫనాచీ వూరుకోడని స్నేహితులన్నారు. హీరో ‘మీ వాటాలు నా కివ్వండి నేను చూసుకుంటా, అతను కాదనలేని ప్రతిపాదన చేస్తా’ అన్నాడు. కాదనలేని ప్రతిపాదన అనేది అతని వూతపదం అయిపోయింది తర్వాత్తర్వాత.
ఫనాచీ ఒక కఫేలో ఉండగా, హీరో వెళ్లి తన స్నేహితులు యిచ్చిన దాంట్లో కొంత అతని చేతిలో పెట్టి తక్కినది తర్వాత యిస్తానని చెప్పాడు. అతని ధైర్యానికి ఫనాచీ అబ్బురపడ్డాడు. అతనికి తెలియదు, కాస్సేపట్లోనే తన యింటికి వచ్చి తుపాకీ కాల్చి చంపి పారేస్తాడని, తనకు యిచ్చినదే కాదు, మిగతాదీ పట్టుకుపోతాడని! బయట జరుగుతున్న పండగ బాణసంచా చప్పుడులో తుపాకీ చప్పుడు ఎవరికీ వినబడలేదు. నిబ్బరంగా ఏమీ జరగనట్టు భార్యాపిల్లల వద్దకు వచ్చేశాడు. ఇలా అతను మొదటి హత్య చేసి గాడ్‍ఫాదర్ అయిపోయి ఫనాచీ స్థానంలోకి వచ్చేశాడు. ‘‘నాయకుడు’’లో కూడా ఫనాచీ వంటి లోకల్ లీడర్ వున్నాడు. అతను ఓ సేఠ్‍తో చేతులు కలిపాడు.
ఆ సేఠ్ ఈ స్లమ్‍ను యిక్కణ్నుంచి ఎత్తించేసి ఫ్యాక్టరీ కడదామని పోలీసులద్వారా ప్రయత్నించి అది సఫలం కాకపోతే యీ లీడర్ని కొనేశాడు. ఇతను మనం ఖాళీ చేయక తప్పదని వీళ్లందరినీ కన్విన్స్ చేస్తూ వుంటే హీరో అతన్ని ఆపి ‘ఇంతకీ మమ్మల్ని ఎంతకు అమ్మేశావ్?’ అని అడిగాడు. అక్కడితో ఆగలేదు. కొందర్ని వెంటేసుకుని వెళ్లి సేఠ్ యిల్లు పగలకొట్టి ‘నివాసముండే చోటు పోతే యిలా వుంటుంది’ అని ప్రత్యక్షంగా చూపించాడు. దెబ్బకి సేఠ్ తన ప్రయత్నం విరమించుకున్నాడు. హీరో డాన్‍గా ఎదిగాడు. పిల్లలు పుట్టుకొచ్చారు. ఓ సారి ఒక బీదవాడికి అవసరం పడితే డాక్టర్ని బెదిరించి వైద్యం చేయించడంతో బాటు మురికివాడలకు అందుబాటులో వుండేటందుకు అయిదు యాంబులెన్సులు ఏర్పాటు చేశాడు. వాటినే స్మగ్లింగ్‍కు కూడా వాడేవాడు.
ఇలా ఎదుగుతూ పోతున్న హీరోకి ఓ సారి ఆఫర్ వచ్చింది. బొంబాయిలోని పెద్ద డాన్‍లందరూ యితన్ని సమావేశానికి పిల్చారు. చెట్టియార్ బ్రదర్స్ అనేవాళ్లు హార్బర్లో స్మగ్లింగ్ కార్యకలాపాలు చూస్తున్నారు. అక్కడ నిఘా పెరిగి ఏమీ చేయలేకపోవడంతో స్మగ్లింగ్ ఆగిపోయే దశకు వచ్చింది. అప్పుడు హీరో తాను సరుకు పట్టుకొస్తాననీ, దానికి ప్రతిగా హార్బర్ వ్యాపారమంతా తనకు అప్పచెప్పాలనీ ఒక ప్రతిపాదన చేశాడు. ఉప్పుమూటల ట్రిక్కుతోనే అన్నది సాధించాడు కూడా. హార్బర్ వ్యాపారం చేజారడంతో చెట్టియార్ బ్రదర్స్కు కోపం వచ్చింది. హీరో యింటిమీద తుపాకులతో దాడి చేశారు. దాడిలో అతని భార్య చనిపోయింది. ఆమె అస్తికలు నీటిలో కలిపేలోపున హీరో ఆ ముగ్గుర్ని చంపించేశాడు. ఈ విధంగా హీరో యిష్టం లేకపోయినా హత్యావ్యవహారాల్లో పడ్డాడు. ఈ స్వభావం వరదరాజ మొదలియార్‍ది కాదు. గాడ్‍ఫాదర్ ప్రభావమే.
ఇక్కడుంటే ప్రమాదమని భావించి హీరో తన పిల్లల్ని వేరే వూరు పంపించి చదివించాడు. కూతురు పెరిగి పెద్దయి యింటికి తిరిగి వచ్చింది. ఆమెకు హింస అంటే పడదు. ఓ పోలీసు అధికారి కూతురు రేప్ చేయబడింది. నిందితులు మంత్రుల పిల్లలు. వారిని ఏమీ చేయలేని అధికారి హీరో సాయం అడిగాడు. హీరో వాళ్లని చంపించాడు. ఆ వార్త విని కూతురు మండిపడింది. నువ్వెవరివి న్యాయం చెప్పడానికి? అని నిలదీసింది. ఒకరికి ఒప్పయినది మరొకరికి తప్పవుతుంది. నువ్వు తప్పు చేసేవని అనుకున్న వారిని చంపే అధికారం నీకెక్కడిది? అని అడిగింది.
ఇతని కొడుకు మాత్రం యితనిలాటి వాడే. ఇతనిలాగానే డాన్ అవుదామని ఉవ్విళ్లూరుతున్నాడు. పోలీసు అధికారి పగ తీర్చే కేసులో ఎప్రూవర్‍గా మారిన తన సహచరుణ్ని కోర్టులోనే చంపించడానికి ప్లాన్ చేశాడు. తండ్రి సంతోషించాడు. కానీ యితను నియమించినవాడు చేసిన పొరబాటుతో పోలీసులకు ఆచూకీ తెలిసిపోయింది. వారినుండి తప్పించుకోబోయి హీరో కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోవడంతో హీరో కృంగిపోయాడు. దానికి తోడు కూతురు తిట్టిపోసింది. నీ చేష్టలతో అమ్మను, అన్నను చంపావ్. నేనెప్పుడు ఛస్తానో! ఇంట్లోంచి వెళ్లిపోతా. నీ పేరు చెప్పుకోను. అనాథనని చెప్పుకుంటా అంటూ వెళ్లిపోయింది. ఇంగ్లీషు ఒరిజినల్‍లో యిలా వుండదు.
ఫనాచీని హత్య చేశాక హీరో లోకల్ డాన్‍గా మారాడు. ఓ సారి అతని భార్య స్నేహితురాలు వచ్చి వాళ్ల యింటాయన సతాయిస్తున్న సంగతి చెప్పింది. హీరో అతన్ని కలిసి డబ్బిచ్చి నా గురించి చుట్టుపక్కల అడుగు అని చెప్పాడు. అడగ్గానే అతనికి హీరో సంగతి తెలిసింది. భయపడుతూ వచ్చి డబ్బు తిరిగిచ్చేసి క్షమాపణ చెప్పుకున్నాడు. హీరో వ్యాపారాలకు ఓ ముసుగు వుంది – జెన్‍కో ఇంపోర్ట్‌స్ అని. ఆ కంపెనీ ఓనర్‍గా చెప్పుకుంటూనే సొంత వూళ్లో చిన్నతనంలో తన కుటుంబసభ్యులను చంపిన మాఫియా లీడర్ వద్దకు వెళ్లాడు. తను ఫలానా అని చెప్పి అతన్ని చంపి పారేశాడు. ఈ విధంగా అతని పగ తీర్చుకున్నాడు. తెలుగు సినిమాలో హీరో తన తండ్రి హంతకుణ్ని చిన్నప్పుడే చంపేస్తాడు. ఒరిజినల్‍లో యిలా వుంటుంది. అమెరికాలో స్థిరపడి డాన్‍గా ఎదుగుతాడు. అతనిపై హత్యాయత్నం జరుగుతుంది. చివరకు ప్రశాంతంగానే చనిపోతాడు. అయితే తెలుగులో వేరే విధంగా చూపించారు.
‘నాయకుడు’ కథ వరదరాజ మొదలియార్ జీవితంలోంచి కొంత తీసుకున్నారని చెప్పాను కదా. 1982 లో బొంబాయిలోని మాతుంగా ఏరియాకు వైసి పవార్ అనే డిప్యూటీ కమిషనర్ వచ్చారు. ఆయన వరదరాజ్ ఆటలు కట్టించడానికి విశ్వప్రయత్నం చేశాడు. వరదరాజ్ అతని మీదనే దొంగ కేసులు పెట్టించాడు. అంతేకాదు పోలీసువాళ్లకు వున్న తాగుడు, వ్యభిచారం అలవాట్లను, క్రిమినల్స్‌తో వాళ్లకున్న సంబంధాలను సాక్ష్యాలతో సహా మీడియాకు లీక్ చేసి వాళ్ల పరువు తీశాడు. కానీ పవార్ పట్టుదలగా పోరాడాడు. వరదరాజన్‍పై అరెస్టు వారంటు తీసుకుని వచ్చాడు. వరదరాజన్ బొంబాయినుండి మద్రాసుకి పారిపోయి అజ్ఞాత జీవితం గడిపాడు. అజ్ఞాతంలో వుండగానే ‘‘నాయకుడు’’ సినిమాకు సహాయ సహకారాలు అందించాడని చెప్పుకుంటారు. ఏది ఏమైనా 1988లో అజ్ఞాతవాసంలోనే చనిపోయాడు. అదీ పవార్ ప్రజ్ఞ. సినిమాలో పవార్ కారెక్టరును హీరోకి అల్లుడిగా చేసి, కొన్ని ఘట్టాలు కల్పించి మంచి నాటకీయత సాధించారు.
ఊళ్లోకి కొత్తగా వచ్చిన డిప్యూటీ కమిషనర్ (ఈ పాత్ర నాజర్ వేశారు) తన కార్యకలాపాలు అడ్డుకుంటున్నాడని విని అతనితో బేరమాడడానికి, అది కుదరకపోతే బెదిరించడానికి హీరో అతని యింటికి వెళ్లాడు. తీరా చూడబోతే అది తన కూతురి యిల్లే. కూతురు చెప్పింది, నేను అనాథనని చెప్పుకుని నీకు పూర్తి వ్యతిరేకంగా వుండే మంచివాణ్ని కట్టుకున్నాను. నీ నీడ మా పిల్లవాడిపై పడనివ్వను. వెళ్లిపో అని. హీరో ఏమీ మాట్లాడలేక వెళ్లిపోయాడు. అల్లుడు ఘటికుడే. హీరోపై అరెస్టు వారంటు పుట్టించగలిగాడు. కానీ అరెస్టు చేద్దామంటే అతను దొరకలేదు. అతని వలన సాయం పొందిన వారందరూ అతని ఆచూకీ చెప్పలేదు. నాజర్ వాళ్లను చితక్కొడుతున్నా నోరు విప్పటం లేదు. ఇదంతా పై ఆఫీసరుకి చెప్పుకుంటే అతను ‘మీ యింట్లో వాళ్లే ఉప్పందిస్తున్నారు. ఆ డాన్ కూతురే నీ భార్య’ అని చెప్పాడు
తన ఆచూకీ చెప్పని కారణంగా పోలీసు వారిచే దెబ్బలు తింటున్న తన వారందరినీ చూసిన హీరో ‘ఒక్క ముసలాడి కోసం యింతమంది అవస్థలు పడడం న్యాయం కాదు’ అనుకున్నాడు. సరెండర్ అవుతానని నాజర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అన్నట్టుగానే అయ్యాడు కూడా. కానీ ఎవరూ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనన్నారు. చివరకు హీరో తొలిరోజుల్లో చంపిన పోలీసు అధికారి భార్య కూడా. అదేమిటన్నాడు అల్లుడు. ‘మందబుద్ధి అయిన నా కొడుకుని చేరదీసి, తన బాడీగార్డుగా పెట్టుకున్నాడు ఆ వుదారహృదయుడు’ అందామె. అప్పటిదాకా తన తండ్రిని చంపినవాడెవరో తెలియని ఆ పిల్లవాడికి యి కఠోరసత్యం అప్పుడే తెలిసింది. పగ తీర్చుకుందామనుకున్నాడు.
ఇంతమంది ఆరాధిస్తున్న వ్యక్తిపై అల్లుడికి గౌరవం కలిగింది. కోర్టుకి వెళ్లబోతున్న మావగార్ని ఆపి, తన కొడుకుని ఆశీర్వదించమని కోరాడు. కూతురు కూడా అడిగింది. మనవడిది తన పేరేనని తెలిసి సంతోషించాడు హీరో. బహుమతిగా యిద్దామంటే ఏమీ లేదు. మెడలోని రుద్రాక్షమాల పిల్లాడికి వేసి ముందుకు కదిలాడు. ఆరోపించిన నేరాలకు సాక్ష్యాలు చాలలేదని కోర్టు నిరపరాధిగా వదిలేసింది. కానీ సహజన్యాయం వదలలేదు. తను బాడీగార్డుగా పెట్టుకున్న పోలీసు అధికారి కొడుకే కాల్చి చంపేశాడు. ఆ విధంగా ఆ డాన్ కథ ముగిసింది. కత్తితో వ్యవహరించువాడు కత్తిచేతనే మరణించును అనే బైబిల్ వాక్యంలా హింసామార్గంలో వెళ్లిన వారికి యిటువంటి ముగింపు తప్పదు అని నిరూపిస్తూ తెలుగు సినిమా ముగుస్తుంది.
గాడ్‍ఫాదర్‍లో యీ నీతి కనబడదు. ఈ అండర్‍వరల్డ్, ఈ డాన్‍లు పుట్టడానికి కారణం న్యాయవ్యవస్థ వైఫల్యమే. నేరస్తులను సరైన సమయంలో శిక్షించడానికి వెరచి ఉపేక్షిస్తే సాధారణ ప్రజలకు వ్యవస్థపై నమ్మకం నశించి యిటువంటివారిని ఆశ్రస్తారు. వీరు చట్టాన్ని అధిగమించి న్యాయం చేసి అప్పటికి ఊరట కలిగించవచ్చు. కానీ దీర్ఘకాలంలో న్యాయపరిధిని అతిక్రమించినందుకు, విచక్షణాజ్ఞానం నశించినందుకు ఫలితం అనుభవిస్తారు. ఇదే యీ సినిమా అందించే సందేశం. సమాజంలో వ్యత్యాసాలు తగ్గిపోయినపుడే యి డాన్‍లు పుట్టరు. ‘‘గాడ్‌ఫాదర్’’ సీరీస్ మొదటి భాగంలోని కథ ఆధారంగా మరి కొన్ని సినిమాలు వచ్చాయి. నవల చదవండి. చాలాచాలా బాగుంటుంది. – (ఫోటో మార్లన్ బ్రాండో, వరదరాజ మొదలియార్, కమలహాసన్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)