విపక్ష వ్యూహానికి కేసీఆర్ గండి కొడతారా?

2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్రమోడీని పదవీచ్యుతుడిని చేయాలని, మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవాలని కృతనిశ్చయంతో కష్టపడుతున్న నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. దేశమంతా తిరిగి ఇప్పటికే అనేక భాజపాయేతర…

2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్రమోడీని పదవీచ్యుతుడిని చేయాలని, మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవాలని కృతనిశ్చయంతో కష్టపడుతున్న నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. దేశమంతా తిరిగి ఇప్పటికే అనేక భాజపాయేతర పార్టీలను ఒకతాటిమీదకు తీసుకువచ్చారు. అందరితో కలిపి పాట్నాలో సమావేశం కూడా ఏర్పాటు చేశారు గానీ, అది వాయిదా పడింది. ఈనెల 23న ఆ సమావేశం జరగనుంది. 

విపక్షాలు తమకు తోచినట్టుగా పార్టీ ప్రతినిధులను పంపితే కుదరదని, కేవలం పార్టీ చీఫ్ లు మాత్రమే ఈ భేటీకి రావాలని నితీశ్ కండింషన్ కూడా పెట్టారు అంటే.. మళ్లీ శషబిషలకు తావులేకుండా బిజెపిని ఓడించే పోరాటానికి తుది వ్యూహాన్ని ఇదే భేటీలో ఫైనలైజ్ చేయాలని సంకల్పిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ భేటీలో కీలకం ఒక ప్రతిపాదనను ఆమోదించబోతున్నారు. దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. అందులో కనీసం 450 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థికి పోటీగా కేవలం ఒకే ఒక్కరిని దింపాలని, తతిమ్మా అన్ని పార్టీలు ఆ అభ్యర్థికి మద్దతివ్వాలని అనుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి బలం ఉన్నదో సర్వేల ద్వారా ఖచ్చితంగా అంచనా వేసి, ఆ పార్టీ అభ్యర్థిని మాత్రమే పోటీకి పెట్టాలని ఆలోచన. అంటే.. మోడీ వ్యతిరేక ఓటు కించిత్తయినా చీలిపోకుండా జాగ్రత్త తీసుకుంటున్నారన్నమాట.

ఇలాంటి ప్రతిపాదన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమె బెంగాల్ మొత్తం తన పార్టీనే బలంగా ఉంటుందని చెబుతుంది గనుక, మరో రాష్ట్రంలో ఆమె పార్టీకి ఠికానా లేదు గనుక, అక్కడ మళ్లీ కాంగ్రెసు సీట్లు అడగకుండా ఇది ఒక ఎత్తుగడ కావొచ్చు. ఈ విధానాన్ని యథాతథంగా అమలు చేయాలంటే.. అతిపెద్దదైన కాంగ్రెసు పార్టీ చాలా త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

ఆ సంగతి పక్కన పెడితే.. మోడీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలనుకుంటున్న ఈ విపక్ష ప్రయత్నానికి కేసీఆర్ గండికొట్టబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోడీతో రహస్య డీల్ లో భాగంగానే జాతీయ పార్టీ పెట్టి, దేశమంతా పోటీచేస్తానని కేసీఆర్ అంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

నితీశ్ సారథ్యంలో జరిగే విపక్ష కూటమి భేటీకి కేసీఆర్ ను కనీసం ఆహ్వానించలేదు. మోడీపై పోరాటంలో ఆయన చిత్తశుద్ధిని వారెవ్వరూ నమ్మడం లేదా అనే సందేహాలు పలువురిలో ఉన్నాయి. మొత్తానికి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా అభ్యర్థులను మోహరిస్తే గనుక.. అది ఖచ్చితంగా మోడీ వ్యతిరేక ఓటును చీల్చి విపక్ష కూటమికి చేటు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.