ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక విషయంలో నిస్సందేహంగా మాట తప్పారు. ‘మాట తప్పను మడమ తిప్పను’ అని తన గురించి తాను వైయస్ జగన్ ఎంత గొప్పగా అయినా చెప్పుకోవచ్చు గాని, ఈ ఒక్క విషయంలో ప్రశ్నిస్తే ఆయన మౌనం దాల్చాల్సిందే!
పాదయాత్ర సమయంలో తనకు మొరపెట్టుకున్న, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కిందికి వచ్చే ఉద్యోగుల వేదనను ఆలకించి జగన్మోహన్ రెడ్డి వారికి ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చేశారు. తాను అధికారంలోకి వస్తే వారం రోజులలోపే సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకు వస్తానని చెప్పారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. కానీ ఆ పని జరగలేదు.
పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు- అని అర్థమైన తర్వాత, ఉద్యోగులు నష్టపోకుండా ఉండేలా సిపిఎస్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ ను జగన్ సర్కారు ప్రతిపాదించింది. దాని మీద ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారిని ఎగదోయడానికి ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతోంది. అదంతా వేరే సంగతి.
ఇప్పుడు- జగన్ మాట తప్పిన వ్యవహారం గురించి ఆయనను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ తప్పు పట్టాలి కదా! జగన్ మాటతప్పి మోసం చేశారని, తాము న్యాయం చేస్తామని కొత్త వాగ్దానాలు ఇవ్వాలి కదా!! అలాంటివి ఏమీ జరగడం లేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దుచేసి తిరిగి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావడం గురించి తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని నోరు మెదపడం లేదు. 14 ఏళ్ల సుదీర్ఘ ముఖ్యమంత్రిత్వ అనుభవమున్న చంద్రబాబు నాయుడు కిక్కురుమనడం లేదు. రాష్ట్రంలో సీపీఎస్ కు సంబంధించిన వివాదం అసలు సోయిలోనే లేనట్లుగా ఆయన చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారు.
అదే సమయంలో చంద్రబాబు నాయుడుకు భజంత్రీలుగా, వందిమాగధులుగా, భట్రాజులుగా తమ జీవితాన్ని వెళ్లదీస్తున్న యెల్లో మీడియా పత్రికలు, మీడియా సంస్థలు మాత్రం ఈ వ్యవహారంపై రెచ్చిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు మాట ఇచ్చి మోసం చేశాడని ఎడాపెడా కారు కూతలు కూస్తున్నాయి. ఉద్యోగులు మొత్తం ప్రభుత్వం మీద ఆగ్రహంతో రగిలిపోతున్నట్లుగా రకరకాల పుకార్లతో వండి వార్చిన కథనాలను అందిస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
సాధారణంగా ఎల్లో మీడియాలో ప్రభుత్వం మీద ఒక చిన్న విమర్శ వచ్చింది అంటే చాలు.. ఆ వెంటనే దానిని తెలుగుదేశం పార్టీ, జనసేన, ఢిల్లీలో మీడియా ముందు హడావుడి చేస్తూ ఉండే రఘురామకృష్ణరాజు అందరూ వెంటనే అందిపుచ్చుకుంటారు. ఆ పాయింట్ మీద ప్రభుత్వాన్ని ఆడుకోవడం మొదలెడతారు. కానీ సిపిఎస్ రద్దు విషయంలో వీళ్ళు ఎవ్వరూ జోక్యం చేసుకోవడం లేదు.
‘జగన్ ఆ పని చేసి తీరాల్సిందే’ అంటే గనుక… ‘మమ్మల్ని గెలిపిస్తే మేం తప్పకుండా చేస్తాం’ అనే మాట కూడా చెప్పాల్సి వస్తుంది! కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా సరే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం అసాధ్యం. తలకు మించిన భారం. అందుకే చంద్రబాబు నాయుడు ఆ వివాదంలో వేలు పెట్టకుండా పచ్చ మీడియాని ఎగదోస్తున్నారు. ఉసిగొల్పుతున్నారు.
అయితే జనం ఈ నాటకాన్ని అర్థం చేసుకునేంత తెలివితేటలతో లేరు అని భావిస్తే మాత్రం చంద్రబాబు తప్పు చేసినట్లే. ఆయన కుటిల రాజకీయ తెలివితేటలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటారు.