బీఎస్ఎన్ఎల్ కి మూడున్నర లక్షల కోట్లు…ఉక్కు మాటేంటి…?

దేశంలో ఒక్కో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఒక్కోలా విధానం ఉంటుందా. వివక్ష సైతం ఉంటుందా. లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దాని మానాన అది పనిచేసుకుంటూంటే కోరి దాన్ని ప్రైవేట్ పరం చేస్తామని…

దేశంలో ఒక్కో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఒక్కోలా విధానం ఉంటుందా. వివక్ష సైతం ఉంటుందా. లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దాని మానాన అది పనిచేసుకుంటూంటే కోరి దాన్ని ప్రైవేట్ పరం చేస్తామని పట్టుబడుతున్న కేంద్ర పెద్దలు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కి మాత్రం మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్ధిక మద్దతుని ప్రకటించడాన్ని ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు.

బీఎస్ఎన్ఎల్ కి అంత పెద్ద మొత్తం ఆర్ధిక సాయం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టడంలేదు, పైగా పూర్తిగా సంతోషిస్తున్నారు. కానీ అందులో నుంచి ఎంతో కొంత దయ విశాఖ ఉక్కు కర్మాగారం మీద చూపిస్తే ఏమి పోయింది అనే అడుగుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాపిటివ్ మైన్స్ తో పాటు వర్కింగ్ క్యాపిటల్ కింద అయిదు వేల కోట్ల రూపాయల ఆర్ధిక అవసరాలు ఉన్నాయి. ఈ మొత్తాలను సర్దుబాటు చేసుకోలేక ఉక్కు నానా ఇబ్బందులు పడుతోంది.

ఈ మొత్తాన్ని సర్దడం కేంద్రానికి చిటికలో పని. ఆ పని కేంద్రం కనుక చేస్తే విశాఖ ఉక్కు బతికి బట్ట కడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పడుతుంది. ఆ దిశగా తగిన చర్యలు కేంద్రం తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

దీని మీద సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కుని కేంద్రమే కాపాడాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పునరుద్ధరణ విష్యంలో ఇప్పటికైనా కేంద్రం ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ బారి నుంచి తాము కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేస్తున్నారు.