కేశినేని ఘాటు వ్యాఖ్య‌ల‌పై…ఇదే జ‌గ‌న్ అయితే!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్య‌ల‌పై టీడీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఇన్‌చార్జ్‌ల‌ను ఆయ‌న గొట్టంగాళ్ల‌ని ప‌రుష ప‌ద‌జాలంతో దూషించారు. గ‌తంలో త‌న‌ను గొట్టంగాడు అని టీడీపీలోని…

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్య‌ల‌పై టీడీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఇన్‌చార్జ్‌ల‌ను ఆయ‌న గొట్టంగాళ్ల‌ని ప‌రుష ప‌ద‌జాలంతో దూషించారు. గ‌తంలో త‌న‌ను గొట్టంగాడు అని టీడీపీలోని త‌న వ్య‌తిరేక నాయ‌కులు అన‌డాన్ని ఆయ‌న గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. కొంత కాలంగా టీడీపీలో కేశినేని అసౌక‌ర్యంగా వుంటున్నారు. ముఖ్యంగా త‌న‌కు వ్య‌తిరేకంగా సొంత త‌మ్ముడైన కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్స‌హించ‌డాన్ని ఆయ‌న త‌ట్టుకోలేక‌పోతున్నారు.

టీడీపీతో అమీతుమీ తేల్చుకునేందుకే కేశినేని సిద్ధ‌మ‌య్యార‌ని ఆయ‌న ఘాటు కామెంట్స్‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. త‌న‌కు వంద‌శాతం మంట పెడితే, పక్క పార్టీల నుంచి వ‌స్తున్న ఆఫ‌ర్ల‌పై ఆలోచిస్తాన‌ని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. మ‌రీ ముఖ్యంగా తాను మంచి వాడిన‌ని, సేవా దృక్ప‌థం క‌లిగి వుండ‌డం వ‌ల్ల వైసీపీ తదిత‌ర పార్టీలు ఆహ్వానిస్తున్నాయ‌ని ఆయ‌న చెప్ప‌డం ద్వారా టీడీపీకి వార్నింగ్ ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఒక‌వైపు టీడీపీకి రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగించేలా కేశినేని నాని వ్య‌వ‌హ‌రిస్తున్నా, ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే వైసీపీలో ఎవ‌రైనా నాయ‌కుడు ఇలా వ్య‌తిరేక కామెంట్స్ చేసి వుంటే, వెంట‌నే చ‌ర్య‌లు తీసుకునేవార‌ని టీడీపీలో చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

వెంక‌ట‌గిరి, నెల్లూరు రూర‌ల్‌, తాడికొండ‌, ఉద‌య‌గిరి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిలను పార్టీ నుంచి బ‌య‌టికి పంప‌డాన్ని టీడీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. అందుకే వైసీపీలో పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డాలంటే భ‌య‌ప‌డ‌తార‌ని, టీడీపీలో ఆ ప‌రిస్థితి లేదంటూ, కొంత కాలంగా అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతున్న నాయ‌కుల గురించి చ‌ర్చించుకుంటున్నారు.

ఇలాగైతే చంద్ర‌బాబు నాయ‌క‌త్వం మ‌రింత బ‌ల‌హీన ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ క‌ట్టుబాట్ల‌ను అతిక్ర‌మిస్తే ఎంత‌టి వారిపై అయినా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌ల‌కు ప‌రిమితం కావ‌డం మంచిది కాద‌ని, ఆచ‌ర‌ణ‌కు దిగితేనే ప్ర‌యోజ‌నం వుంటుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేశినేని నానిపై వేటు వేస్తే… పరిణామాలు ఎలా వుంటాయోన‌ని టీడీపీ అధిష్టానం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. చంద్ర‌బాబు నాయ‌క‌త్వానికి కేశినేని స‌వాల్ విసురుతున్నార‌నేది వాస్త‌వం.