కీల‌క స‌మ‌యంలో ష‌ర్మిల సైలెంట్‌!

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఆరు నెల‌ల స‌మయం మాత్ర‌మే వుంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల సైలెంట్‌గా వుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ‌లో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ ఆయ‌న…

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఆరు నెల‌ల స‌మయం మాత్ర‌మే వుంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల సైలెంట్‌గా వుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ‌లో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ ఆయ‌న పేరుతో ష‌ర్మిల పార్టీ పెట్టిన సంగ‌తి తెలిసిందే. పాద‌యాత్ర‌, నిరుద్యోగ దీక్ష‌… ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌తో ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నించారు.

తీరా ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆమె ప్ర‌జ‌ల్లో తిర‌గ‌కపోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. పాద‌యాత్ర‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం, బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై దూష‌ణ‌ల‌కు దిగుతున్నార‌నే కార‌ణంతో అనుమ‌త‌ల్ని పోలీసులు ర‌ద్దు చేశారు. న్యాయ‌స్థానంలో ఊర‌ట ద‌క్కినా, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు అనుకూలించ‌డం లేదు. దీంతో కేసీఆర్ స‌ర్కార్‌పై ఆమె నిప్పులు చెరుగుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో ష‌ర్మిల రాజ‌కీయ పంథాలో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా, ఆమె ఖండిస్తున్నారు. కర్నాట‌క కాంగ్రెస్ అధ్య‌క్షుడు, ఆ రాష్ట్ర మంత్రి డీకే శివ‌కుమార్‌ను ష‌ర్మిల రెండుసార్లు క‌లిశారు. దీంతో కాంగ్రెస్‌లో విలీన వార్త‌ల‌కు బ‌లం క‌లిగించింది. ఇంట్లో నుంచి బ‌య‌ట అడుగు పెడ‌దామ‌న్నా ష‌ర్మిల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం లేదు.

మ‌రోవైపు కేసీఆర్ ప్ర‌భుత్వ అణ‌చివేత చ‌ర్య‌ల్ని ఎదుర్కొని రాజ‌కీయంగా నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయానికి ఆమె వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ భ‌విష్య‌త్‌పై ష‌ర్మిల అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. ఒక‌వైపు తెలంగాణ‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో త‌న‌ను ఎక్క‌డా వెళ్ల‌నివ్వ‌క‌పోవ‌డంతో, బ‌లాన్ని కూడ‌దీసుకునేందుకు ఆమె వ్యూహం ఏదో ర‌చిస్తున్నార‌ని స‌మాచారం. ఆ కార‌ణంగానే ప్ర‌స్తుతం ఆమె రిలాక్ష‌న్ అవుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించేందుకు ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒకే గూటి కిందికి చేర్చాల‌నే ష‌ర్మిల ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లీకృతం అవుతాయో చూడాలి. లేదంటే తానే ఏదో ఒక బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీ పంచ‌న చేరుతారా? అనే చ‌ర్చ కూడా లేక‌పోలేదు.