ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు షాక్‌!

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. స‌స్పెండ్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని కేంద్ర హోంశాఖ‌కు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు అప్పీల్ చేసుకోగా, దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకపోవ‌డంతో పాటు చార్జిషీట్ దాఖ‌లు…

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. స‌స్పెండ్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని కేంద్ర హోంశాఖ‌కు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు అప్పీల్ చేసుకోగా, దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకపోవ‌డంతో పాటు చార్జిషీట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరావు చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే ప‌ని చేశార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కుల ఫోన్ల‌ను ట్యాప్ చేస్తూ, వారిని త‌మ కంట్రోల్‌లోకి తీసుకున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం రూ.25.5 కోట్లు వెచ్చించి అవినీతికి పాల్ప‌డిన వైనం వెలుగు చూసింది. ఈ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్లు జ‌గ‌న్ స‌ర్కార్‌కు ప్రాథ‌మిక‌ ఆధారాలు దొరికాయి.

ఈ అవినీతి వ్య‌వ‌హారంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును వైసీపీ ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. స‌స్పెన్ష‌న్‌పై కేంద్రానికి ఏబీ అప్పీల్ చేసుకున్నారు. స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేసేందుకు కేంద్ర‌హోంశాఖ అంగీక‌రించ‌లేదు. అంతేకాదు, ఆ అప్పీల్‌ను ప‌క్క‌న ప‌డేసి, ఏబీవీపై చార్జిషీట్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.  

అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్‌ కాల్స్‌ను ట్యాపింగ్‌ చేయడానికి చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు 2017 లో కుట్ర‌కు తెర‌లేపిన‌ట్టు విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి. ఇజ్రాయెల్‌ నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలను కొనుగోలు చేయాలని అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

ఇందులో భాగంగా క్రిటికల్‌ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్‌ పరికరాల కొనుగోలుకు ప్రతిపాదించారు. రక్షణ ఉత్పత్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి. ఈ నిబంధన‌లేవీ పాటించ‌లేదు.

ఎందుకంటే కేంద్రానికి స‌మాచారం ఇస్తే, త‌మ కుట్ర‌లు బ‌య‌ట‌ప‌డుతాయ‌నే భ‌యంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గోప్య‌త పాటించింది. ఇదిలా ఉండ‌గా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఫోన్ ట్యాపింగ్ ప‌రిక‌రాల కోనుగోలు కాంట్రాక్ట్‌ను త‌న కుమారుడి కంపెనీకి ఇచ్చేలా ప్ర‌ణాళిక ర‌చించార‌నే ఆధారాలు ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి ల‌భ్య‌మ‌య్యాయి. అందుకే స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.