చంద్రబాబు హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.మోదీ సర్కార్ పెగాసస్‌ను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు, న్యాయమూర్తులు, వ్యాపార ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందనే కథనాలు తీవ్ర దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.
పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రత్యర్థులకు కార్నర్ కావడం పక్కన పెడితే, బాధితులనే ఆత్మరక్షణలో పడేస్తున్న పరిస్థితి.
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పెగాసస్ వ్యవహారంలో టీడీపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి ఏక వాక్యంతో ట్వీట్‌తో జగన్‌ను దెప్పి పొడిచారు. “మా దగ్గర పెగాసస్ ఉంటే అబ్బాయిల గొడ్డలిపోటు నుండి బాబాయ్ వివేకా ని కాపాడేవాళ్లం కదా! జగన్ రెడ్డి” అని వెటకరించారు. వైసీపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసింది నిజమే అయితే వివేకా హత్య కుట్రను ముందే పసిగట్టే వాళ్లం కదా అని బీటెక్ రవి ప్రశ్నించడం గమనార్హం.
ఇదే విషయమై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా తన మార్క్ ట్వీట్‌తో జగన్‌ను నిలదీశారు. “నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా నీ సవాంగన్నే చెప్పారు జగన్ రెడ్డి. సమాచార హక్కు చట్టం ప్రకారం 25-7-21 న కర్నూలు జిల్లాకి చెందిన నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు అటువంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డిజిపి సవాంగ్, స్వయంగా నాటి డిజిపి సవాంగ్ 12-8-21న సమాధానం ఇచ్చారు. తాను, తన మీడియా చేసేవన్నీ అసత్య ప్రచారాలే అని స్వయంగా జగనే బయటపెట్టడమే దేవుడి స్క్రిప్ట్” అని అయ్యన్న వ్యంగ్యంగా పేర్కొన్నారు.