వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ జారీ చేసిన ‘సెల్ఫీ’ ఆదేశాలపై ఆ శాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత నింపేలా ‘సెల్ఫీ’ ఆదేశాలున్నాయి. ప్రభుత్వ వైద్యులు ప్రతీ రెండు గంటలకు ఒకసారి సెల్ఫీలు తీసి పంపాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ వింత ఆదేశాలు జారీ చేశారు.
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ వైద్యులంతా ప్రతి 2గంటలకు ఒకటి చొప్పున రోజుకు ఐదు సెల్ఫీలు తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ లెక్కల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఆ నెల జీతంలో కోతలు తప్పవు. ప్రైవేటు ప్రాక్టీసు వైపు వెళ్లకుండా కట్టడి చేసేం దుకే సెల్ఫీల ఎపిసోడ్‌ను తెరపైకి తెచ్చినట్టు కాటంనేని భాస్కర్ తెలిపారు.
కానీ ప్రభుత్వ వైద్యుల వాదన మరోలా ఉంది. విధి నిర్వహణలో నిబద్ధతను అనుమానించేలా ప్రభుత్వ తీరు ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం వాపోతుంది. వివిధ రకాల ఆపరేషన్లు, రోగుల సేవలో ఉంటున్న తాము ప్రతి రెండు గంటలకు ఒకసారి సెల్ఫీ తీసుకుని పంపడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు.
ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహించినంత మాత్రాన … మొత్తం వ్యవస్థనే అనుమానించడం, అవమానించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రతి రెండు గంటలకు ఒకసారి సెల్ఫీలు పంపాలన్న ఆదేశాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ఇది సరైంది కాదని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తప్ప, మరొక ప్రయోజనం ఉండదని వారు చెబుతున్నారు.