ఏ రాష్ట్రంలోనైనా కొత్త రాజకీయ పార్టీలు పుట్టడం సహజం. రాజకీయ పార్టీలు పుట్టడానికి అనేక కారణాలుంటాయి. వీటిల్లో రెండు రకాలుంటాయి. కొన్ని పుట్టుడు పార్టీలు, కొన్ని పెట్టుడు పార్టీలు. కొందరు నాయకులు తమకు తామే పార్టీ పెడతారు. కొన్ని పార్టీలను ఎన్నికల్లో లబ్ది కోసం కొంతమంది పెట్టిస్తారు. ఈ కాలంలో ఈ రెండో తరహా పార్టీలు ఎక్కువయ్యాయి. కొత్త పార్టీ పుట్టుకొచ్చినప్పుడల్లా కొన్ని కథలు ప్రచారంలోకి వస్తుంటాయి. వాటిల్లో నిజానిజాలేమిటో త్వరగా నిర్ధారించలేం.
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ పార్టీ పుట్టడానికి, గిట్టడానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమనే ప్రచారం సాగింది. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్, బీజేపీ, అధికార టీఆర్ఎస్ కొంతకాలం గగ్గోలు పెట్టాయి. షర్మిల చేత పార్టీ మీరు పెట్టించారంటే మీరు పెట్టించారని మూడు పార్టీలు ఒకదానిమీద ఒకటి ఆరోపణలు చేసుకున్నాయి. కేసీఆర్, జగన్ ఇద్దరూ కుమ్మక్కై షర్మిలతో పార్టీ పెట్టించారని, ఎన్నికల్లో కేసీఆర్ ప్రయోజనం కోసమే ఈ పని చేశారని కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి.
ఇక జగన్ ఆత్మ ప్లస్ కుడి భుజం సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా దీనిపై స్పందించి షర్మిల పార్టీ పెట్టడాన్ని తప్పుపట్టాడు. ఇంకా కొందరు వైసీపీ నాయకులు కూడా మాట్లాడారు. మరి షర్మిల పార్టీపై మాట్లాడిన సజ్జల, ఇతర వైసీపీ నాయకులు ఇప్పటివరకు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ గురించి ఎందుకు మాట్లాడటంలేదు? అనిల్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే కదా. సువార్త ప్రచారకుడు రాజకీయ నాయకుడిగా మరుతున్నాడని, పార్టీ పెట్టబోతున్నాడని కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది కదా.
కానీ ఇప్పటివరకు వైసీపీ నాయకుల నుంచి దీని మీద స్పందన లేదు. సీఎం బావ అయినా సరే ఇప్పుడు తన మద్దతుదారులతో భేటీలు పెట్టి తమపై విమర్శలు ఎక్కుపెడుతుంటే ఏం చేయాలి?. కనీసం వ్యక్తిగత స్ధాయిలో అయినా దానికి కౌంటర్ ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా అలా జరగడం లేదు. దానికి బదులుగా రాష్ట్రంలో క్రైస్తవ సంఘాలు రంగంలోకి దిగి ఆయన్ను కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు సైతం స్పందించిన వైసీపీ పెద్దలు సజ్జల వంటి వారు సైతం ఇప్పుడు బ్రదర్ అనిల్ గురించే మాట్లాడటం లేదు. దీంతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి.
అనిల్ కుమార్ వెనుక జగన్ ఉన్నాడని అంటున్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలను దెబ్బ కొట్టడానికి అనిల్ ను ఉపయోగించుకుంటున్నాడని అంటున్నారు. బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఇప్పటికే విజయవాడ, విశాఖలోని తన మద్దతుదారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయినా వైసీపీ వైపు నుంచి కానీ, సీఎం జగన్ నుంచి కానీ పల్లెత్తు మాట వినిపించడం లేదు. గతంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు సైతం సీఎం జగన్ మాట్లాడలేదు. ఆ తర్వాత పదే పదే అడుగుతుంటే పార్టీ పెద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ముక్తసరిగా స్పందించాడు.
కానీ ఇప్పుడు అలా కాదు. నేరుగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికే సవాల్ విసురుతూ కొత్త పార్టీకి బ్రదర్ అనిల్ సిద్ధమవుతున్నారు. అయినా కనీస స్పందన లేకపోవడంతో ఇదంతా జగన్ కన్నుసన్నల్లోనే జరుగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఏపీలో ప్రస్తుతం అధికారపక్షం వైసీపీ బలంగా ఉంది. అయినా ప్రజా వ్యతిరేకత ఉంది. కానీ దాన్ని సొమ్ము చేసుకునే పరిస్ధితుల్లో విపక్షాలు లేవు. అయితే ఇదంతా ఎప్పటివరకూ అంటే ఎవరికీ తెలియదు. ఏదో ఒక రోజు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకులంతా కూడబలుక్కోవడం ఖాయం.
సీఎం జగన్ ను టార్గెట్ చేయడం ఖాయం. దానికి బదులుగా ప్రజలకు తానే ఓ విపక్షాన్ని అందుబాటులో ఉంచి మద్దతిచ్చేలా చేసుకుని, ఆ తర్వాత తన పార్టీలో కలిపేసుకుంటే ఇక ఆ ఇబ్బంది కూడా ఉండదు. సరిగ్గా ఇదే వ్యూహంతో బ్రదర్ అనిల్ ను జగన్ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇందులో వాస్తవమెంత ఉందన్న అంశం కాస్త పక్కనబెడితే విపక్షాల్ని తప్పించి బ్రదర్ అనిల్ రూపంలో తనకు నచ్చిన విపక్షాన్ని సైతం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కచ్చితంగా విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలను కలవరపెడుతోంది.