పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్లను ఒకేసారి క్లియర్ చేయడంతో పాటు భారీ ఆదాయాన్ని అంచనా వేస్తూ అదాలత్ ప్రకటించారు తెలంగాణ పోలీసులు. భారీ డిస్కౌంట్లు ఇవ్వడంతో ప్రజలంతా ఎగబడి తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేస్తారని భావించారు. కానీ పోలీసు శాఖ ఒకటి భావిస్తే, అక్కడ జరిగింది దానికి పూర్తి రివర్స్. ఆదరణ, ఆదాయం రెండూ అంతంతమాత్రమే.
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు మొదటి రోజు అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి వాహనచోదకులు వెబ్ సైట్ పై పడ్డంతో ఓ దశలో సర్వర్ క్రాష్ అయింది. మార్చి నెల మొత్తం పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు (డిస్కౌంట్ తో) అవకాశం కల్పించామని పోలీసులు పదే పదే ప్రకటించాల్సి వచ్చింది. కట్ చేస్తే, 2 వారాలు గడిచేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది.
తెలంగాణ అంతటా 6 కోట్లు చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటి ద్వారా 1750 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. మార్చి 1 నుంచి ప్రకటించిన భారీ డిస్కౌంట్లతో, ఈనెలలో కనీసం 500 కోట్ల రూపాయలు వస్తాయని పోలీసులు అంచనా వేశారు. కానీ నిన్నటివరకు క్లియర్ అయిన చలాన్లు కేవలం కోటి 30 లక్షలు మాత్రమే. వీటి ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 135 కోట్ల రూపాయలు మాత్రమే.
ప్రచారం, అవగాహన రెండూ తక్కువే!
ఇలా అంచనాలకు వాస్తవాలకు ఆమడ దూరంలో సాగుతోంది ఈ స్పెషల్ డ్రైవ్. దీనికి ముఖ్యంగా 2-3 కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి ప్రచారం. ఈ నెలలో భారీ డిస్కౌంట్లతో పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవచ్చంటూ పోలీసులు ప్రెస్ మీట్ లో చెప్పి వదిలేశారు. ఆ తర్వాత దీనిపై ఆశించిన స్థాయిలో ప్రచారం లేదు. ఇక రెండో కారణం ఈ-చలాన్లు చెల్లించే సైట్ మొరాయించడం.
బండి నంబర్ కొట్టిన వెంటనే పోర్టల్ ఓపెన్ అవ్వడం లేదు. ఒక్కోసారి 10 సార్లు ఎంటర్ చేసినా పేజీ ఓపెన్ అవ్వదు. ఓపెన్ అయి పేమెంట్ దగ్గరకు వెళ్లేసరికి మళ్లీ మొరాయించడం మామూలే. దీంతో చాలామంది చలాన్లు క్లియర్ చేయకుండానే సైట్ నుంచి వెనుదిరుగుతున్నారు. సైట్ కు వచ్చే యూజర్లు, క్లియర్ అవుతున్న పెండింగ్ చలాన్ల సంఖ్య మధ్య భారీ వ్యత్యాసం ఉండడానికి ఇదే కారణం. సైట్ ఓపెన్ అయి చలాన్ చెల్లించే వాళ్ల కంటే, ఓపెన్ అవ్వక వెనుదిరిగే వాళ్లే ఎక్కువమంది ఉన్నారు.
దీనికితోడు తెలంగాణలోని రూరల్ ప్రాంతాల్లో ఆన్ లైన్ చెల్లింపులపై అవగాహన లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక మీ-సేవ కేంద్రాల్లో కూడా చలాన్ల క్లియరెన్స్ అంతంతమాత్రంగానే ఉంది.
ఎక్కడ బండి కనిపిస్తే అక్కడ ఆపి చలాన్లు విధించే పోలీసులు.. ఈ ప్రత్యేక డ్రైవ్ విషయంలో కూడా ఎక్కడికక్కడ కౌంటర్లు పెడితే మంచి ఫలితాలొస్తాయనేది చాలా మంది అభిప్రాయం. అవసరమైతే ఈ విషయంలో థర్డ్ పార్టీ సేవల్ని వినియోగించుకుంటే.. అనుకున్న లక్ష్యాన్ని తొందరగా చేరవచ్చని చెబుతున్నారు.