సోషల్ మీడియాలో ఏపీ కొత్త మంత్రుల జాబితా..?

సోషల్ మీడియాలో వచ్చేవన్నీ పుకార్లేనని కొట్టిపారేయలేం. అలాగని పూర్తిగా నిజాలని నమ్మలేం. కానీ ఇప్పుడు ఏపీలో జగన్ కొత్త కేబినెట్ పై అధికారిక సమాచారమేదీ లేకున్నా సోషల్ మీడియాలో ఎవరికి వారే కొత్త జాబితా…

సోషల్ మీడియాలో వచ్చేవన్నీ పుకార్లేనని కొట్టిపారేయలేం. అలాగని పూర్తిగా నిజాలని నమ్మలేం. కానీ ఇప్పుడు ఏపీలో జగన్ కొత్త కేబినెట్ పై అధికారిక సమాచారమేదీ లేకున్నా సోషల్ మీడియాలో ఎవరికి వారే కొత్త జాబితా ప్రకటించేస్తున్నారు. ఇదిగో జాబితా, అదిగో లిస్ట్.. అంటూ ప్రచారం చేస్తున్నారు. మరి దీనిలో నిజమెంత..?

ఆమధ్య కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించకముందే, ఓ లిస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆశ్చర్యకరంగా దాదాపు 90శాతం అదే నిజమైంది. ఇప్పుడు ఏపీ నూతన మంత్రిమండలికి సంబంధించి కూడా ఓ జాబితా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మరి ఇది కూడా నిజమౌతుందా? ఇంతకీ ఈ లిస్ట్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? రిపీట్ అయిన మంత్రులు ఎవరు..?

పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని.. కన్ఫామ్ గా కొత్త మంత్రివర్గంలోనూ కొనసాగుతారని అంటున్నారు. బుగ్గన, బొత్స.. వీరిలో ఒకరిపేరు కూడా లిస్ట్ లో ఉంటుందనే అంచనాలున్నాయి. అయితే ఇటీవల బడ్జెట్ మీటింగ్ లో.. కోటు వేసుకు రాకపోయావా బుగ్గనా.. మళ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టే ఛాన్స్ వస్తుందో లేదో అంటూ మంత్రి బాలినేని సెటైర్ వేయడం దేనికి సంకేతమో తేలాల్సి ఉంది. ఇక్కడ బాలినేని పేరు కూడా సెకండ్ లిస్ట్ లో కంటిన్యూ అయ్యే అవకాశముందని కూడా తెలుస్తోంది.

కొత్తవారెవరు..?

కొత్తవారిలో ముఖ్యంగా రోజా పేరు వినిపిస్తోంది. ఆమెకు హోం శాఖ కూడా ఖరారు చేసేసింది సోషల్ మీడియా. ఇక గతంలో అవకాశం మిస్ అయినవారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, చెవిరెడ్డి, భూమన.. ఇలా ఓ లిస్ట్ నమ్మదగినది గానే ఉంది. 

గతంలో జస్ట్ ఛాన్స్ మిస్ అయినవారందరికీ ఈసారి ఖాయంగా కేబినెట్ లో చోటు దక్కే అవకాశముంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియా స్టార్స్..

విడదల రజిని, గుడివాడ అమర్ నాథ్, కేతిరెడ్డి.. ఇలా కొంతమంది సోషల్ మీడియా స్టార్స్ పేర్లు కూడా కొత్త లిస్ట్ లో ఉన్నాయని తెలుస్తోంది. వీరంతా సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇలాంటి వారికి జగన్ పిలిచి మరీ పదవి ఇస్తారా.. వారి సేవల్ని పార్టీకే పరిమితం చేస్తారా అనేది చూడాల్సి ఉంది. 

మన యుద్ధం ఈనాడు, ఆంధ్రజ్యోతీ, టీవీ-5 పై కూడా అంటూ జగన్.. మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హింట్ ఇచ్చిన సందర్భంలో.. సోషల్ మీడియాలో పార్టీకి తిరుగులేని పాపులార్టీ తెస్తున్న వీరందరికీ సముచిత స్థానం దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

జిల్లాల వారీ లెక్కలు తీస్తే..

ఏ జిల్లాలో ఎవరు అనే లెక్కలు తీసినా ఈ జాబితా వాస్తవానికి దగ్గరగానే ఉంది. నెల్లూరు జిల్లాలో రెడ్డి కోటాలో మేకపాటి, బీసీ కోటాలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రులు. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మరో రెడ్డికి ఆ అవకాశం ఇవ్వాలంటే కచ్చితంగా వినిపించే పేరు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇప్పటికే ఆయన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. 

జిల్లాలో సీనియర్ కాబట్టి ఆయనకి కచ్చితంగా పదవి గ్యారెంటీ అంటున్నారు. ఇక జిల్లాలో మరో బీసీ లేరు కాబట్టి.. ఆ కోటా కొత్తగా ఏర్పడే జిల్లాలకు వెళ్లే అవకాశముంది. సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ పదవి అనే ప్రచారం జరుగుతున్నా.. ఆయనకు జగన్ అంత ప్రాముఖ్యత ఇస్తారని అనుకోలేం.

రెడ్డి శాంతి, పీడిక రాజన్నదొర, కొట్టు భాగ్యలక్ష్మీ, తిప్పల నాగిరెడ్డి, దాడిశెట్టి  రాజా, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా, తెల్లం బాలరాజు, సామినేని ఉధయభాను, మేరుగ నాగార్జున, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాం భూపాల్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, జొన్నలగడ్డ  పద్మావతి, కొరముట్ల శ్రీనివాస్, హఫీజ్ ఖాన్.. ఇలా ఈ లిస్ట్ లో మరికొన్ని పేర్లున్నాయి. 

ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లాగా ఇప్పుడీ లిస్ట్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. చివరకు జగన్ అధికారికంగా లిస్ట్ ప్రకటించిన తర్వాతే వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది తేలిపోతుంది.