ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లపై క్లారిటీ వచ్చేసింది. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు ఎంత వసూళ్లు రావొచ్చనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. తొలి రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ,నైజాంలో కనీసం 50 కోట్ల రూపాయల షేర్ రావొచ్చనేది ఓ అంచనా.
ఆర్ఆర్ఆర్ వరకు ఏపీలో టికెట్ రేట్లు ఫిక్స్ అయ్యాయి. బాల్కనీ టిక్కెట్లనే తీసుకుంటే.. సి-సెంటర్ థియేటర్లలో బాల్కనీ టికెట్ కనీసం 170 రూపాయలు.. గరిష్టంగా 206 రూపాయలు ఉన్నాయి. అదే బి-సెంటర్ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర కనిష్టంగా 183 రూపాయలు, గరిష్టంగా 236 రూపాయలుంది. ఇక ఏ-సెంటర్లలో కనీస ధర 206 రూపాయలు, గరిష్ఠ ధర (రీక్లెయినర్) 265 రూపాయలు లాక్ అయ్యాయి.
ఈ రేట్లను ఇదే విధంగా కొనసాగిస్తే.. మొదటి రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఒక్క ఏపీ నుంచే 30-35 కోట్ల రూపాయల షేర్ రావొచ్చనేది ఓ అంచనా. అయితే ఇక్కడ కొన్ని కండిషన్లు ఉన్నాయి. ముందు రోజు ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తే, ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఇది కాకుండా, మరికొన్ని సెంటర్లలో అనధికారికంగా రేట్లు పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు. అప్పుడు వసూళ్లు ఇంకాస్త పెరుగుతాయి. ఇక నైజాం నుంచి తొలి రోజు 15-19 కోట్ల మధ్య షేర్ అంచనా వేస్తున్నారు.
ఏపీలో 5 షోలకు అనుమతులు ఇచ్చారు. ఇటు తెలంగాణలో కూడా 5 రోజులకు అనుమతులు ఉన్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 50 కోట్ల షేర్ పెద్ద కష్టమేం కాదంటోంది ట్రేడ్. ఇక ఓవరాల్ గా ఈ వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయనేది మేకర్స్ తీసుకునే నిర్ణయాల బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ఏకంగా 10 రోజుల పాటు ఇవే రేట్లు కొనసాగిస్తే భారీగా కలెక్షన్లు వస్తాయి. అలా కాకుండా మొదటి వారానికే రేట్ల పెంపును పరిమితం చేస్తే ఆ మేరకు వసూళ్లు తగ్గుతాయి.
మొత్తమ్మీద మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ అందుకోవాలనేది ఆర్ఆర్ఆర్ మాస్టర్ ప్లాన్. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో పిక్చర్ క్లియర్ గా కనిపిస్తోంది. నార్త్ తో పాటు.. మిగతా సౌత్ స్టేట్స్ లో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తే 200 కోట్ల గ్రాస్ పెద్ద కష్టమేం కాదు.
రేపట్నుంచి నైజాంలో ఆర్ఆర్ఆర్ ఆన్ లైన్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకెన్లు ఉంది.