కశ్మీర్ ఫైల్స్ సూపర్ హిట్ అయింది. తమాషా ఏంటంటే.. ఇది ఒక సినిమా! కానీ.. ఎవ్వరూ దీని హిట్/ ఫ్లాప్ గురించి మాట్లాడడం లేదు. వ్యాపారరూపంలో విడుదలయ్యే ఒక కమర్షియల్ చిత్రానికి వ్యాపారాత్మక విజయం తప్ప మిగిలిన అన్ని విషయాలూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
కశ్మీర్ ఫైల్స్ అనేది, ‘బియాండ్ సినిమా’గా ఇవాళ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. రక్తం ఉడికిపోతోందని, ఈ సినిమా చూసి పూనకం తెచ్చుకుంటున్న వాళ్లు చాలా మందే ఉంటున్నారు. వారే మెజారిటీ! అయితే తమాషా ఏంటంటే.. ఈ సెక్షన్ ప్రేక్షకుల రక్తం మరింతగా ఉడికించి.. క్యాష్ చేసుకోవడానికి మరిన్ని సినిమాలు తయారుకాబోతున్నాయి.
చాలా రంగాలలాగానే, సినిమా ఇండస్ట్రీ కూడా సక్సెస్ వెంటపడి పరుగులు తీస్తుంటుంది. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమా సూపర్ హిట్టయింది. చిన్న ఖర్చుతో వందల కోట్ల బిజినెస్ చేస్తున్న సినిమాగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఫార్ములాతో సినిమాలు తీసేయాలని ఇప్పటికప్పుడే ఉబలాటపడుతున్న వాళ్లు అనేకులు తయారవుతున్నారు. అయితే ఈ సినిమాకు అసలు ఫార్ములా ఉందా? ఉంటే అదేంటి?
ఒక సినిమా హిట్ అయితే.. ఆ బాటలు పరుగులు తీసే గొర్రెల్లాంటి సినిమా మేకర్స్ కు ఇందులో వారివారి జ్ఞానాన్ని బట్టి అనేక రకాల ఫార్ములాలు కనిపిస్తాయి. (1) హిందువులకు ఈ దేశంలో జరిగిన అన్యాయాల్ని ఎలుగెత్తి చెప్పాలి (2) ముస్లింల మీద విద్వేషాన్ని రగిలించాలి (3) బిజెపి ఎజెండాలోని అంశాల్లో కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నవాటిని ఎంచుకుని సినిమాగా చేయాలి.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్ములా కనిపిస్తుంది. ఆ ఫార్ములా సినిమాలకోసం బాలీవుడ్ ఎగబడుతూ.. పాన్ ఇండియా సినిమాల మేకింగ్ కు మోజుపడుతున్నారు.
ఈ రకం సినిమాలు తమ ఓటు బ్యాంకు దినదిన ప్రవర్ధమానమవుతూ వర్ధిల్లడానికి బాగానే ఉపయోగపడుతున్నాయి గనుక.. బిజెపి నాయకులంతా.. ఈ సినిమాను భయంకరంగా డప్పు కొడుతున్నారు. పైగా ఈ ఫార్ములా కోసం ఎగబడే వారికోసం.. సబ్జెక్టులు కూడా కాషాయకోటరీనుంచి వస్తున్నాయి.
ఇందిరాగాంధీ కాలంలోని ఎమర్జెన్సీ పైన, యూపీలో ములాయం సింగ్ సీఎంగా ఉన్నప్పుడు రామభక్తులపై జరిగిన కాల్పులపైనా సినిమాలు రావాలని కాషాయ కోటరీ సబ్జెక్టులు సరఫరా చేస్తోంది. గోద్రా దహనం తర్వాతి ఊచకోతలను పక్కన పెట్టేసి.. కేవలం గోద్రా రైలు దహనం వరకు సినిమాగా తీయాలనే డిమాండ్ వచ్చినా, ఏకంగా సినిమానే వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు.
దేశమంతా సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ తో కమలనాధులు ఇప్పటికే ఈ సినిమాను తమ పొలిటికల్ గెయిన్‌కు వాడుకోవడం ప్రారంభించారు. ప్రజలు సినిమాను సినిమాలాగానే చూసినప్పటికీ.. వారి రక్తాన్ని ఉడికించడానికి కమలదళం తమ వంతు కృషి చేస్తూనే ఉంటుంది.