వైసీపీ ఎమ్మెల్యేలకు సర్వే ఫీవర్ పట్టుకుంది. ఇటీవల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తానని, అందులో వచ్చే పాజిటివీ ఆధారంగానే టికెట్ల కేటాయింపు వుంటుందని స్పష్టం చేశారు. సర్వేలో ప్రతికూల ఫలితం వస్తే మాత్రం ఎంతటి వారినైనా పక్కన పెడతానని జగన్ తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో ఒక రకమైన భయం పట్టుకుంది. ప్రశాంత్ కిషోర్ టీంతో పాటు మరో రెండు మూడు సర్వే సంస్థలకు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీల పనితీరు, వారికి మరోసారి టికెట్ ఇస్తే గెలుస్తారా? తదితర అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించే బాధ్యతల్ని అప్పగించినట్టు సమాచారం. త్వరలో సర్వే టీంలు రంగంలోకి దిగనున్నాయి. కొన్ని సర్వే సంస్థలు యూనివర్సిటీ విద్యార్థులను ఉద్యోగులుగా తీసుకున్నట్టు తెలిసింది.
పనిలో పనిగా ప్రభుత్వ పనితీరుపై కూడా సర్వే చేయిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా లక్షల కోట్లను సంక్షేమ పథకాలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో, వాటిపై ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? లబ్దిదారుల అభిప్రాయాలు, అభివృద్ధి, ఇతర రంగాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? తటస్థ ఓటర్లు, మేధావులు, విద్యావంతుల మనసులో ఏముందో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించేందుకు రకరకాల సర్వే సంస్థలు కార్యక్షేత్రంలో దిగనున్నాయి.
ఈ సంస్థలకు పెద్ద మొత్తంలో ప్రభుత్వం డబ్బు ముట్టచెప్పినట్టు సమాచారం. సర్వే సంస్థల్ని మేనేజ్ చేసేందుకు కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారి కోసం ఆరా తీస్తున్నట్టు తెలిసింది.