పశ్చిమబెంగాల్ మమతాబెనర్జీ పెగాసస్ బాంబు పేల్చడంతో టీడీపీ ఉలిక్కి పడింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ సాఫ్ట్‌వేర్‌తో కేంద్ర ప్రభుత్వం రాహుల్ సహా పలువురు ప్రతిపక్ష ప్రముఖులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పారిశ్రామిక ప్రముఖుల ఫోన్ సంభాషణలను వింటోందంటూ సంచలన కథనం వెలుగు చేసింది. ఈ వ్యవహారంపై గత పార్లమెంట్ సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాస్తోందని, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. తాజాగా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌పై మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను నాటి ఏపీ సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారని ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా వెల్లడించి సంచలనం సృష్టించారు.
గతంలో మమతాబెనర్జీ, చంద్రబాబు కలిసి మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు స్నేహంగా ఉన్నారు. దీంతో ఆమె ఆరోపణలకు ప్రాధాన్యం లభించింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె ఏమన్నారంటే…
“నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ దాని సృష్టికర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారు. ఆ విషయం నాకు తెలిసి తిరస్కరించాను. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దానిని కొనుగోలు చేసింది” అని మమతాబెనర్జీ ఆరోపించారు. మమతా ఆరోపణలపై నారా లోకేశ్ స్పందించారు.
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయలేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. కొనాల్సిందిగా అప్పట్లో డెవలపర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారని, కానీ తిరస్కరించినట్టు లోకేశ్ వెల్లడించారు. ఏదో తప్పుడు సమాచారంతో ఆమె అలా మాట్లాడి వుంటారన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడం, అనుమతించడం వంటివి తమ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తారన్నారు.
చంద్రబాబు రాజకీయాల గురించి తెలిసిన వారెవరైనా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి వుంటారంటే తప్పక నమ్ముతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారని గతంలో వైసీపీ నేతలు పదేపదే ఆరోపించడాన్ని గుర్తు చేసుకుంటే, పెగాసస్ కొనుగోలును కొట్టి పారేయలేం.