బిడ్డ చచ్చినా పురిటివాసన పోలేదని ఒక సామెత ఉంటుంది. అయితే నష్టపోయిన వారే.. దాని తాలూకు దుష్పరిణామాలను ఇంకా అనుభవిస్తున్నప్పుడు వాడే సామెత ఇది. చేసిన పాపాల తాలూకు ఫలితాలను అనుభవిస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఈ సామెత వాడుతారు! అయితే ఒకరు చేసిన పాపం తాలూకు పర్యవసానాలను మరొకరు అనుభవించాల్సి వస్తే.. ఎలా? దానికి కొత్త సామెత కనుక్కోవాలేమో.
చంద్రబాబునాయుడు ఇప్పుడు అలాంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. చంద్రబాబు పాలన సాగించిన రోజుల్లో చేసిన పాపాల ఫలితాలు ఇప్పటికీ జగన్ మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. ఆ భారాలు ఇప్పటికీ జగన్ మోయవలసి వస్తూనే ఉన్నది. తాజాగా ప్రభుత్వ సంస్థలకు గతంలో న్యాయవాదులుగా పనిచేసిన వారి ఫీజులను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ హైకోర్టు హూంకరించడం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది.
ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు సహజంగా తమకు సంబంధించిన న్యాయ వివాదాల్ని పరిష్కరించుకోవడానికి న్యాయవాదుల్ని నియమించుకుంటాయి. కొన్ని సందర్భాల్లో వారికి చాలా భారీ ఫీజులు కూడా ఇస్తుంటారు. ఎక్కువో తక్కువో మొత్తానికి వారికి ఫీజులైతే చెల్లించాల్సిందే. అయితే చంద్రబాబునాయుడు సర్కారు గత ప్రభుత్వంలో.. చాలా విషయాల్లో మాదిరిగానే అప్పట్లో వారు నియమించుకున్న న్యాయవాదులకు పీజులు కూడా చెల్లించలేదు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత.. గతంలో చంద్రబాబు తన పాపాలను కవర్ చేసుకోవడానికి వాడుకున్న న్యాయవాదుల రుసుముల్ని తామెందుకు చెల్లించాలని అనుకున్నారో ఏమో గానీ.. ఆ విషయం పక్కన పెట్టారు. డబ్బు రావాల్సి ఉన్న న్యాయవాదులు కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పింది. ఆలస్యమైతే 12 శాతం వడ్డీ చెల్లించాలని చెప్పడం ఇంకో కొసమెరుపు.
చంద్రబాబు పాపాలు, జగన్ సర్కారు మీద భారాలుగా, గుదిబండలుగా పడే సందర్భాలు ఇది కొత్త కాదు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదు, కాలేజీలకు ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ చెల్లించలేదు! ఏ రాజకీయ వాగ్దానంతో రైతులను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడో.. ఆ రైతు రుణాలను చెల్లించలేదు.
చంద్రబాబు హయాంలో కార్యకర్తలకు కాంట్రాక్టు పనులు దోచిపెట్టారు. కానీ వారికి బిల్లులు కూడా చెల్లించలేదు. చంద్రబాబు తన ప్రభుత్వం చేయాల్సిన సకల చెల్లింపులను పెండింగ్ పెట్టి నడిపించారు. అవన్నీ ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి గుదిబండగా మారాయి.
ధర్మబద్ధంగా లబ్ధిదారులు పొందవలసిన, బాబు నాటకానికి బలైన ఫీజు రీఇంబర్స్ మెంట్ వంటి వాటి విషయంలో జగన్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. అలాంటి చెల్లింపులు బాబు బకాయి పెట్టినా సరే.. కొన్ని వేల కోట్లను ఇప్పటిదాకా చెల్లిస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్త భారం పడింది. అప్పటి ప్రభుత్వం న్యాయవాదులకు పెట్టిన బకాయి చెల్లింపులన్నీ జగన్ మీద పడ్డాయి.
చంద్రబాబునాయుడు అప్పట్లో చేసిన పాపాలు.. ముందుముందు ఇంకా ఎంతకాలంపాటు జగన్ ను వెంటాడబోతున్నాయో చూడాలి!