బిగ్ బాస్ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ఓ గదిలో కంటెస్టెంట్లను పెట్టేస్తారు. టాస్కులు ఇస్తారు. అన్ని యాంగిల్స్ నుంచి కెమెరాల నాన్-స్టాప్ గా రికార్డ్ చేస్తుంటాయి. ఇదే కాన్సెప్ట్ ను ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కు వాడేశాడు జక్కన్న. కెమెరాలు ఉన్నాయనే విషయం మరిచిపోయి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మాట్లాడుకున్నారు. ఇష్టమొచ్చినట్టు ఇళ్లంతా కలియదిరిగారు. ఒకరిపై ఒకరు జోకులేసుకున్నారు. దీనికి ఆఫ్ ది రికార్డ్ అనే టైటిల్ కూడా పెట్టి వదిలారు.
ఆర్ఆర్ఆర్ కోసం ఎన్ని రకాలుగా ప్రచారం చేయాలో అన్నీ చేస్తున్నారు. ముందుగా ముగ్గురూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత సంప్రదాయ ఇంటర్వ్యూలు పూర్తిచేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లో కొందరు పాపులర్ యాంకర్లకు వాళ్ల స్టయిల్ లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత ఏకంగా అనీల్ రావిపూడిని రంగంలోకి దించి ఇంటర్వ్యూలు చేశారు. ఇప్పుడిలా బిగ్ బాస్ హౌజ్ కాన్సెప్ట్ తో ఇంటర్వ్యూ వదిలారు.
రేపట్నుంచి ఈ సినిమా ప్రచారం నెక్ట్స్ లెవెల్ కు చేరబోతోంది. రేపు యూనిట్ అంతా దుబాయ్ లో భారీ ఈవెంట్ లో పాల్గొంటుంది. అట్నుంచి అటు బెంగళూరులో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత 20వ తేదీన బరోడా ఢిల్లీలో.. 21న అమృతసర్, జైపూర్ లో.. 22న కోల్ కతా, వారణాసిలో పలు ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు. కాశీ ఈవెంట్ తో ప్రమోషన్ కు ప్యాకప్ చెప్పి, 23న తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు.
పెయిడ్ ప్రివ్యూస్ ఉంటే 24న, లేకపోతే రెగ్యులర్ గా రిలీజ్ అయ్యే 25వ తేదీన ఎక్కడ సినిమా చూడాలనే అంశంపై కూడా “ఆఫ్ ది రికార్డ్” మాట్లాడుకున్నారు హీరోలు, దర్శకుడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ చిరుత సినిమాను ప్రేక్షకులతో కలిసి చూశాడట చరణ్. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు చూడలేదు.
అటు ఎన్టీఆర్ అయితే కెరీర్ లో ఇప్పటివరకు తను నటించిన ఏ సినిమాను ఆడియన్స్ మధ్య కూర్చొని చూడలేదట. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడాలని ఇద్దరు హీరోలు ఫిక్స్ అయ్యారు. ఆ బాధ్యతను రాజమౌళిపై పెట్టారు. ఇలా “ఆఫ్ ది రికార్డ్” మొత్తం సరదా సరదాగా సాగిపోయింది.