అశ్వనీదత్…అబద్దాలు!

మొగుడికి లోకువ అయితే పనోడికి లోకువే అన్నది సామెత. నిన్న మొన్నటి వరకు తెలంగాణ సిఎమ్ కు దైవ సమానంగా వుంటూ వచ్చారు చినజీయర్ స్వామి. తన సీట్ లో ఆయనను కూర్చున్న తరువాతే…

మొగుడికి లోకువ అయితే పనోడికి లోకువే అన్నది సామెత. నిన్న మొన్నటి వరకు తెలంగాణ సిఎమ్ కు దైవ సమానంగా వుంటూ వచ్చారు చినజీయర్ స్వామి. తన సీట్ లో ఆయనను కూర్చున్న తరువాతే తాను కూర్చున్న వైనం కూడా వుంది. తెలంగాణ విషయంలో కేసిఆర్ కు చినజీయర్ మాట వేదశాసనం. అప్పట్లో చాలా మందికి

అలాంటిది ఏదో జ‌రిగింది. ఏమైందో తెలియదు. మొత్తానికి తేడా వచ్చింది ఇద్దరి మధ్య. ఇలాంటి టైమ్ లో మరో వ్యవహారం కూడా ఙరిగింది. సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు ఆంధ్ర సిఎమ్ జ‌గన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అంతే కాదు. జ‌గన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అన్నింటికి మించి చంద్రబాబును పిలవలేదు.

ఇవి చాలవా? చినజీయర్ ను టార్గెట్ చేయడానికి. పైగా నోరా వీపుకు తేకే అన్నట్లుగా, సదరు స్వామీజీ గతంలో ఎప్పుడో, ఎందుకో, ఏ సందర్భంలోనో నోరు పారేసుకున్నారు. అప్పట్లో ఆ విషయం ఎందుకు మరుగున పడిపోయిందో? ఎందుకు ఎవరికీ పట్టలేదో? ఎవరికీ తెలియదు. 

కేసీఆర్ నీడలో వున్నంత కాలం చినజీయర్ ను కన్నెత్తి చూడడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. పైగా మహా మహులు అంతా ఆయన ఆశీస్సుల కోసం క్యూ కట్టేవారు. ఎప్పుడయితే కేసీఆర్ అండ పోయిందో చినజీయర్ అందరికీ లోకువైపోయారు. పైగా ఆయన స్వయంకృతాపరాధం తోడయింది. ఆ పాత వీడియో బయటకు వచ్చింది. నానా గడబిడ జ‌రిగిపోతోంది. సరే ఆయన క్షమాపణ చెబుతారో. లేక మరేం చేస్తారో చూడాల్సి వుంది.

కానీ ఈ లోగా దొరికిందే సందు అని ఎవరి మాటలు వారు విసురుతున్నారు. సినిమా నిర్మాత, ఒకప్పటి తెలుగుదేశం కీలక సభ్యుడు చలసాని అశ్వనీదత్ కూడా కాస్త గట్టిగా నోరు చేసుకున్నారు. ఆ తిట్లు ఆ వైనం అలా వుంచితే ఓ మచ్చట చెప్పారు. చంద్రబాబును చినజీయర్ స్వామి దగ్గరకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పట్లో ట్రయ్ చేసారని కానీ ప్రజ‌ల సేవ చేయాలి కానీ స్వాముల సేవ కాదని చంద్రబాబు నిరాకరించారని అశ్వనీదత్ చెప్పారు.

ఇదెంత పచ్చి అబద్దం అన్నది చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు. చినజీయర్ కు చంద్రబాబు ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో అన్నది అప్పటి రోజులు గుర్తున్నవారు గుర్తు చేసుకుంటున్నారు. అసలు చినజీయర్ కు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే కదా, పెందుర్తి స్వామీజీ చంద్రబాబు వైపు కాకుండా కాంగ్రెస్ వైపు, ఆ తరువాత వైకాపా వైపు వెళ్లింది.

రాష్ట్ర విభజ‌న జ‌రిగే వరకు చినజీయర్ కార్యక్రమాలు గుంటూరు, విశాఖ కేంద్రంగానే కదా ఎక్కువగా జ‌రిగింది. విభజ‌న తరువాత కదా ఆయన పూర్తిగా తెలంగాణ మీద దృష్టి పెట్టి, అక్కడ వుండిపోయింది. ఇదే మీడియా సంస్థలు కొద్ది వారాల క్రితం సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పోటీలు పడి మరీ ఇంటర్వూలు చేసి, సండే స్పెషళ్లు వేసి, లైవ్ కవరేజ్ లు చేసి, నానా హడావుడి చేసిన సంగతి గుర్తుంది కదా?

ఇన్నాళ్లు అశ్వనీదత్ ఎక్కడున్నారు. ‘వెధవన్నర వెధవ’ అనే పద ప్రయోగం చినజీయర్ కు కేసీఆర్ కు మంచి సంబంధాలు వున్నపుడు ఎందుకు చేయలేకపోయారు. మళ్లీ అదే సమయంలో చినజీయర్ తో సన్నిహిత సంబంధాలునన్న మైహోమ్ రామేశ్వరరావు పేరును బాహాటంగా చెప్పలెకపోయారు అశ్వనీదత్. ‘పెద్దమనిషి’ అనే పద ప్రయోగం చేసారు. మళ్లీ రేపు భవిష్యత్ లో చినజీయర్ కేసీఆర్ సంబంధాలు మెరుగుపడితే అశ్వనీదత్ ఇలా బాహాటంగా మాట్లాడగలరా? ఇన్ని అబద్దాలు చెప్పగలరా?