ఆలు లేదు, చూలు లేదు… స‌మ‌న్వ‌య‌మ‌ట‌!

ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అనే చందంగా టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు త‌యారైంది. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయిన త‌ర్వాత టీడీపీతో పొత్తు వుంటుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్…

ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అనే చందంగా టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు త‌యారైంది. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయిన త‌ర్వాత టీడీపీతో పొత్తు వుంటుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కు మించి ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ముందుకు సాగ‌లేదు.

జ‌న‌సేన‌కు ఇచ్చే సీట్లు ఎన్నో ఇంకా లెక్క తేల‌లేదు. కానీ 25కు మించి సీట్లు ఇచ్చేది లేద‌ని టీడీపీ లీకులు ఇచ్చింది. ఇదే నిజ‌మైతే జ‌న‌సేన రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంట‌నేది ప‌వ‌న్‌క‌ల్యాణ్ తేల్చుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే స‌రాస‌రి జిల్లాకు ఒక సీటు కూడా జ‌న‌సేన ఏం రాజ‌కీయాలు చేస్తుంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతుంది.

టీడీపీతో పొత్తు వుంటుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన త‌ర్వాత రాజ‌కీయంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో మార్పు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అప్ప‌టి నుంచి ప‌వ‌న్‌ను టీడీపీ పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ మాత్రం టీడీపీతో స‌మ‌న్వ‌యం కోసం ఐదుగురితో కూడిన క‌మిటీని ప్ర‌క‌టించారు. తాజాగా టీడీపీ కూడా జ‌న‌సేన‌తో స‌మ‌న్వ‌యం కోసం క‌మిటీని ఏర్పాటు చేసింది. టీడీపీ క‌మిటీలో మాజీ మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, అచ్చెన్నాయుడు, పితాని స‌త్య‌నారాయ‌ణ‌, పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్‌, తంగిరాల సౌమ్య ఉన్నారు.

అస‌లు సీట్ల లెక్క తేల‌కుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డెక్క‌డ సీట్లు ఇస్తారో ప్ర‌క‌టించ‌కుండా స‌మ‌న్వ‌యం ఎలా సాధ్య‌మ‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. కేవ‌లం టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజనాల‌కు మాత్ర‌మే పొత్తు ఉప‌యోగ‌ప‌డితే, జ‌న‌సేన ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. పొత్తు అనేది ఇరు పార్టీల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగేలా వుండాల‌ని, అయితే టీడీపీని ఎంత వ‌ర‌కు న‌మ్మొచ్చ‌నే ప్ర‌శ్న జ‌న‌సేన నుంచి వ‌స్తోంది.

బాబు అరెస్ట్ నేప‌థ్యంలో స‌మ‌న్వ‌యం పేరుతో టీడీపీ రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో విస్తృతంగా పాల్గొనేలా చేసి, తీరా ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డే త‌రుణంలో సీట్ల లెక్క‌, అలాగే పోటీ చేసే ప్రాంతాల‌పై పీట‌ముడి వేస్తే ప‌రిస్థితి ఏంట‌ని జ‌న‌సేన నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అందుకే ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయ‌డంపై స‌మ‌న్వ‌య క‌మిటీ మొట్ట‌మొద‌ట దృష్టి సారించాల‌ని జ‌న‌సేన కోరుతోంది. 

ముందు వాడుకుని, ఆ త‌ర్వాత చ‌చ్చిన‌ట్టు త‌మ వెంట ప‌డేలా జ‌న‌సేనను తిప్పుకుంటారా? లేక ప‌వ‌న్ ఆశించిన‌ట్టు సీట్లు ఇస్తారా? అనేది ఇరు పార్టీల స‌మ‌న్వ‌య క‌మిటీలు స్ప‌ష్ట‌త‌కు రావాల్సి వుంటుంది. చూద్దాం ఏమ‌వుతుందో!