విజ‌య‌సాయిరెడ్డి వ‌చ్చీ రాగానే…!

గ‌త కొన్ని నెలలుగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్న వైసీపీ ఎంపీ, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి విజ‌య‌సాయిరెడ్డి మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు.…

గ‌త కొన్ని నెలలుగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్న వైసీపీ ఎంపీ, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి విజ‌య‌సాయిరెడ్డి మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ‌చ్చీ రాగానే వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్య‌క్షుల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌డం విశేషం. దీంతో భ‌విష్య‌త్‌లో త‌న ప‌నితీరు ఎలా వుండ‌నుందో ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

విజ‌య‌సాయిరెడ్డి కొన్ని నెల‌లుగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా వుండ‌డం, ప్ర‌త్య‌ర్థుల‌తో విమ‌ర్శ‌లు చేయ‌క‌పోగా, ఆయా సంద‌ర్భాల్లో వారితో సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో వైసీపీకి దూర‌మ‌వుతార‌నే చ‌ర్చ న‌డిచింది. ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డంతో ఆయ‌న మౌనం పాటించారు. అయితే వైసీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జితో పాటు పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్ బాధ్య‌త‌ల్ని సీఎం జ‌గ‌న్ అప్ప‌గించ‌డంతో, వాటిని విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు విజ‌య‌సాయిరెడ్డి కార్యాచ‌ర‌ణ రూపొందించుకున్నారు.

అనుబంధ విభాగాల అధ్య‌క్షుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ 2019లో మాదిరిగానే 2024లో కూడా వైసీపీ విజ‌యానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. జ‌య‌హో బీసీ మ‌హాస‌భ త‌ర‌హాలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ మ‌హాస‌భ‌ల్ని త్వ‌ర‌లో పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తామ‌న్నారు. వీటిని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌ధానంగా  ఏవైనా స‌మ‌స్య‌లుంటే త‌న దృష్టికి తీసుకురావాల‌ని ఆయ‌న సూచించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

విజ‌య‌సాయిరెడ్డి కొంత కాలం మౌనాన్ని ఆశ్ర‌యించ‌డంతో ఆయ‌న బాధ్య‌త‌లు చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చేతుల మీదుగా జ‌రిగాయి. రాష్ట్ర‌స్థాయిలో త‌న‌కు తోడుగా వుండాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు, చంద్ర‌గిరిని కుమారుడు మోహిత్‌రెడ్డికి అప్ప‌గించిన‌ట్టు ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి యాక్టీవ్ కావ‌డంతో చెవిరెడ్డి క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ ఏంట‌నేది తేలాల్సి వుంది.