వారు కాంగ్రెస్ లో చేరితే.. కమలం పరువు మటాష్!!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ల క్రేజ్ మామూలుగా కనిపించడం లేదు! ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద…

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ల క్రేజ్ మామూలుగా కనిపించడం లేదు! ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసి, పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఈ ఇద్దరు నాయకులు ప్రస్తుతం హాట్ టాపిక్ మాత్రమే కాదు, హాట్ కేకుల్లాగా కూడా ఉన్నారు! 

కెసిఆర్ ని వ్యతిరేకించే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండూ.. మా జట్టులో అంటే మా జట్టులో చేరమని ఈ ఇద్దరు నాయకుల వెంట పడుతూ ఉండడం గమనార్హం! అయితే సుదీర్ఘ మంతనాల తర్వాత ఈ ఇద్దరూ కాంగ్రెస్ లో చేరడానికే నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అధినేత రాహుల్ విదేశీ యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఆయనతో భేటీ అయి.. తమ రాజకీయ భవిష్యత్తు పరంగా కాంగ్రెస్ ఎలాంటి హామీ ఇస్తుందో తెలుసుకుని, ఆ తర్వాత పార్టీలో చేరికను ప్రకటిస్తారని సమాచారం.

ఈ ఇద్దరు నాయకులు కాంగ్రెస్లో చేరడం అంటూ జరిగితే.. కమలదళం పరువు పోయినట్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ ఇద్దరినీ భారాస పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత.. వీరితో సాన్నిహిత్యం ఉన్న, బిజెపి చేరికల కమిటీ సారథి ఈటల రాజేందర్, మరికొందరు ముఖ్య నాయకులను కూడా వెంటబెట్టుకొని వీరితో రెండు దఫాలుగా భేటీ అయ్యారు. కానీ బిజెపిలో చేరడానికి ఒప్పించలేకపోయారు. ఖమ్మం జిల్లాలో అసలే బలహీనంగా ఉన్న బిజెపి తరఫున, ఆ జిల్లాలో వారి మాటకు ఎదురు ఉండదనే హామీలు ఇచ్చినప్పటికీ ఫలితం దక్కలేదు.

‘వారి చేరిక సాధ్యం కాదు, ఆ జిల్లాలో మా పార్టీ బలహీనంగా ఉంది..’ అని చెప్పిన ఈటల రాజేందర్ మాటలను గమనిస్తే, వారిని ప్రభావితం చేయడానికి బదులు వారి మాటలకు ఆయనే ప్రభావితం అయినట్లుగా మనకు అర్థమవుతుంది.

ఈటెల బృందం మాత్రమే కాకుండా ఇటీవల కమల తీర్థం పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఇద్దరు నాయకులతో మంతనాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి తరఫునుంచి ఇన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా.. వారు కాంగ్రెస్ వైపే మొగ్గుతున్నారంటే.. అది కమల దళానికి పరువు నష్టం కాక మరేమిటి!

బిజెపి చెప్పుకుంటున్నట్లుగా ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలం గురించి, ప్రజలు కూడా పునరాలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆరకంగా ఈ నాయకులు రెండు జిల్లాలకు చెందిన వాళ్లు మాత్రమే అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సరళి మీద కూడా, వీరి చేరికలు ఎంతో కొంత ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.