రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చిత్తూరు జిల్లాలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తొత్తులా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలకు ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేశారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం తన సొంత వ్యవహారమన్నట్టు నిమ్మగడ్డ నడుచుకుంటున్నారని విమర్శించారు. కేవలం చంద్రబాబు ప్రయోజనాలు ఆశించే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు.
కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎన్నికలను వాయిదా వేశారని, ఇప్పుడు వ్యాక్సినేషన్ దశలో ఎన్నికలు నిర్వహించాలను కోవడం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పట్లో ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ప్రభుత్వ ఉపాధ్యాయులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రభుత్వ అభ్యంతరాలను, అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలకు సిద్ధపడటం దారుణమన్నారు.